సాధారణ ఎన్నికలను తలపిస్తున్న చేనేత కార్మిక సంఘం ఎన్నికల ప్రచారాలు

ABN , First Publish Date - 2021-07-27T07:00:13+05:30 IST

పట్టణంలోని పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2000 మంది సభ్యులున్న ఈ సంఘానికి ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.

సాధారణ ఎన్నికలను తలపిస్తున్న చేనేత కార్మిక సంఘం ఎన్నికల ప్రచారాలు

భూదాన్‌పోచంపల్లి, జూలై 26: పట్టణంలోని పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2000 మంది సభ్యులున్న ఈ సంఘానికి  ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు ముగియగా అధ్యక్ష స్థానానికి 8 మంది, పురుష డైరెక్టర్లు 8 స్థానాలకు 23 మంది, రెండు మహిళా డైరెక్టర్ల స్థానాలకు ఐదుగురు బరిలో నిలిచారు. రాజకీయాలకతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  నాయకులు తమ అభ్యర్థులను ప్యానల్‌గా ఏర్పా టు చేసుకుని ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అంకం పాండును నిర్ణయించారు. ఈ మేరకు ఆయన మాధవ నగర్‌ కాలనీలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో సోమవారం పూజలు నిర్వి హించి ప్రచారం ప్రారంభించారు. అదేవిధంగా బీజేపీ నుంచి  ఏలె శ్రీని వాస్‌, ముసునూరి యాదగిరి, మరో టీఆర్‌ఎస్‌ నాయకుడు కొంక లక్ష్మీ నారాయణ అధ్యక్ష స్థానానికి బరిలో ఉన్నారు. తమను గెలిపించాలని తమ కేటాయించిన గుర్తులను చూపుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయ డంతో పాటు సోషల్‌ మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా, ఎన్నికలు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, అందు కు చేనేత నాయకులందరూ సహకరించాలని ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ భారత పురుషోత్తం, కోకన్వీనర్‌ అంకం మురళి, నాయకులు ఏలె భిక్షపతి, కడవేరు ఎల్లప్ప, చింతకింది రమేష్‌ కోరారు.


Updated Date - 2021-07-27T07:00:13+05:30 IST