హంద్రీ-నీవా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

ABN , First Publish Date - 2020-10-27T17:10:30+05:30 IST

వైసీపీ అడ్డగింత అల్టిమేటాలు, పోలీసుల హెచ్చరికల నడుమ హంద్రీ-నీవా సాధనకోసం కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన..

హంద్రీ-నీవా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్‌ అరెస్టు

కాలువ వెంబడి ద్వితీయ శ్రేణుల నిరసనలు


కుప్పం/రామకుప్పం: వైసీపీ అడ్డగింత అల్టిమేటాలు, పోలీసుల హెచ్చరికల నడుమ హంద్రీ-నీవా సాధనకోసం కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపినా, ఎక్కడిక్కడ విపక్ష నేతల హౌస్‌ అరెస్టులతో సద్దుమణిగింది. మరోవైపు వైసీపీ పోటీగా తలపెట్టిన ర్యాలీని సైతం పోలీసుల మధ్యవర్తిత్వంతో విరమించుకోవడంతో ఉద్రిక్తత ఉపశమించింది. టీడీపీ ముఖ్య నేతలు అమరనాథ రెడ్డి,నాని, అనూష,ఎన్‌.శ్రీనాథరెడ్డి, ఎమ్మెల్సీలు దొర బాబు, గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆంజినేయరెడ్డిలతోపాటు వైసీపీ నియోజకవర్గ నాయకుడు భరత్‌ను హౌస్‌ అరెస్టు చేయడంతో పరిస్థితులు అదుపులోకొచ్చాయి.


టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గానికి తాగు, సాగు నీరందించేందుకు హంద్రీ-నీవా బ్రాంచి కాలువ పనులను ప్రారంభించి 85 శాతం పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు రామకుప్పం మండలం బైపరెడ్లపల్లె దాకా వచ్చి కాలువకు నీళ్లు కూడా వదిలారు. అయితే వైసీపీ అధి కారంలోకి వచ్చాక పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నియోజకవర్గ వైసీపీ నాయకులు భరత్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌కు పలుమార్లు విన్నపాలు చేసినా ఫలితం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో హంద్రీ-నీవా సాధనకోసం కుప్పం నియోజకవర్గ టీడీపీ అధ్వర్యంలో పాదయాత్రను తలపెట్టారు. దీనిపై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారంనాడు పాదయాత్రను రామ కుప్పం మండలంనుంచి ప్రారంభించి, 30వ తేదీన కుప్పం మండలంలో ముగించడానికి నిర్ణయించారు. దీనికోసం వారం పదిరోజులుగా టీడీపీ సమా యత్తం అవుతోంది.


ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు టీడీపీ పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించారు. అంతేకాక చంద్రబాబు కోర్టులో వేసిన కేసుల వల్ల గృహ నిర్మాణాలు ఆగిపోయినందుకు నిరసనగా సోమవారమే రామకుప్పంలో పోటీ ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ నియోజకవర్గ నేత భరత్‌ ప్రకటించారు. పోటీ యాత్రలు, ర్యాలీల నేపథ్యంలో అప్రమత్తమైన డీఎస్పీ ఆరిఫుల్లా నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, వందమందికి పైగా పోలీసులను రామకుప్పం మండలవ్యాప్తంగా మోహరింపజేశారు.టీడీపీ ముఖ్య నాయకులను ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత వారివారి స్వగృహాల్లో నిర్బంధించారు. శాంతిపురం మండలం వెంకటేపల్లెలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, రామకుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ఆంజినేయరెడ్డి, మాజీ జడ్పీటీసీలు మునస్వామి, రాజ్‌కుమార్‌ తదితరులు ఇల్లు దాటకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఇదిలా జరుగుతుండగానే టీడీపీ పాదయాత్రకు ప్రతిగా ర్యాలీ నిర్వహించడానికంటూ  వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, కుప్పం మున్సిపల్‌ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ సుధీర్‌ ,వైసీపీ మండల కన్వీనర్‌ విజలాపురం బాబు, కో-కన్వీనర్లు చంద్రారెడ్డి, పంద్యాలమడుగు బాబురెడ్డి, నేతలు నితిన్‌రెడ్డి, మురుగేష్‌, మురళి, బర్కతుల్లా, అప్పి, కేశవరెడ్డి, గోవిందప్ప తదితరుల నేతృత్వంలో వందలాదిగా కార్యకర్తలు రామకుప్పం మినీమార్కెట్‌యార్డు ఆవరణకు చేరుకున్నారు. అధికార పార్టీ విషయంలో తొలుత ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు, పరిస్థితి విషమించే ప్రమాదం ఉండడంతో వైసీపీ నియోజకవర్గ నాయకుడు భరత్‌ను హౌస్‌ అరెస్టు చేశాయి.హుటాహుటిన మినీమార్కెట్‌యార్డు వద్దకు చేరుకున్న డీఎస్పీ ఆరీఫుల్లా వైసీపీ శ్రేణులకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగారు. మరోవైపు టీడీపీ ముఖ్య నాయకులు హౌస్‌ అరెస్టులో ఉండడంతో  రామకుప్పం మండలంలోని వర్దికుప్పం, కిలాకిపోడు, నిమ్మనపల్లె తదితర గ్రామాల సమీపంనుంచి వెళ్తున్న హంద్రీ-నీవా కాలువ వెంబడి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు కాసేపు నిరసనలు తెలిపారు.బైపరెడ్లపల్లె వద్ద  నరేంద్రరెడ్డి, జ్ఞానశేఖర్‌రెడ్డి, మంజునాథరెడ్డి, వెంకటరమణ, మురళి , కిలాకిపోడు వద్ద వేలు, శాంతిపురం-రామకుప్పం మండల సరిహద్దుల్లో శంకర్‌చలం, మురళి, సతీష్‌కుమార్‌, వేణుగోపాల్‌గౌడు,వేణుగోపాల్‌రెడ్డి, గురప్ప తదితరులు హంద్రీ-నీవా కాలువల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ కాస్త దూరం పాదయాత్ర చేశారు.


ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పం ప్రజలకు తాగు,సాగునీరు అందించాలని డిమాండు చేశారు.అయితే ప్రజాస్వామ్యబద్ధంగా తాము తలపెట్టిన పాదయాత్రను భగ్నం చేయడానికి పోలీసులు నిర్బంధాన్ని అమలు చేయడంపట్ల, అరెస్టులు సాగించడంపట్ల గౌనివారి శ్రీనివాసులు, పిఎస్‌.మునిరత్నం తదితరులు మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసే హక్కును హరించడం దారుణమని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా పాతికేళ్ళుగా చంద్రబాబు కుప్పం రైతుల గోడును ఎందుకు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. హంద్రీ-నీవా కుప్పం కెనాల్‌ పనుల్లో కొన్ని లొసుగులు బయటపడ్డాయని, కాంట్రాక్టరుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని, వారి నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు.కాగా పాదయాత్ర ప్రారంభించాల్సిన బయపరెడ్లపల్లె వద్ద పాదయాత్ర సందర్భంగా పూజ చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించిన చోట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసివుండడం కలకలం రేపింది. పసుపు, కుంకుమతో చతురస్రాకార ముగ్గు వేసి, నిమ్మకాయలతో పూజలు చేసివుండడం గమనించి తాము చేపట్టిన పాదయాత్ర భగ్నం కావాలని అధికారపార్టీ శ్రేణులే ఈ చర్యకు పాల్పడి ఉంటాయని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-10-27T17:10:30+05:30 IST