కుమార్తెను దారుణంగా చంపిన తండ్రికి ఉరిశిక్ష

ABN , First Publish Date - 2021-02-20T17:23:32+05:30 IST

ఏడాదిన్నర వయస్సున్న కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన

కుమార్తెను దారుణంగా చంపిన తండ్రికి ఉరిశిక్ష

బెంగళూరు : ఏడాదిన్నర వయస్సున్న కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన కేసులో తండ్రికి ఉరిశిక్ష విధిస్తూ గదగ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కర్ణాటకలోని గదగ్‌ జిల్లా రోణ తాలూకా హల్లూర గ్రామానికి చెందిన ప్రశాంతగౌడపాటిల్‌ మైనార్టీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత భార్యను హింసించడం ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ పునరావాస కేంద్రానికి వెళ్లింది. వీరికి ఒక కుమార్తె కలిగింది. బంధువులు మందలించడంతో కలిసి జీవనం సాగిద్దామని తప్పును ఒప్పుకుంటున్నానని ప్రశాంతగౌడ పాటిల్‌.. రోణలో ఓ అద్దె ఇంట్లో సంసారం పెట్టాడు.


కొన్ని నెలలకే తనపై కేసులు ఉపసంహరించుకోవాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వేధింపులు పునరావృతం కావడంతో భార్య భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రశాంతగౌడపాటిల్‌ 2015 ఏప్రిల్‌ 6న ఏడాదిన్నర కుమార్తెను గజేంద్రగడ సమీపంలోని కాలకాలేశ్వర కొండపైకి తీసుకెళ్లి గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. సాక్ష్యం లేకుండా చేయాలని మృతదేహాన్ని కాల్చివేశాడు. భర్తపై అనుమానంతో భార్య కేసు పెట్టడంతో దర్యాప్తుచేసిన పోలీసులు తండ్రే హంతకుడని తేల్చారు. ఈ మేరకు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌ వి పాటిల్‌ నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేశారు.

Read more