ఊసేలేని ఉద్యానవన నర్సరీ

ABN , First Publish Date - 2021-11-28T05:23:04+05:30 IST

ఉద్యానవన నర్సరీ ఏర్పాటు ఊసేలేదు.

ఊసేలేని ఉద్యానవన నర్సరీ
పిచ్చి మొక్కల మధ్య అప్పటి కలెక్టర్‌, ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకం

  1. 15 ఏళ్లు గడిచినా పట్టని అధికారులు
  2. పండ్ల మొక్కలు అందేనా?


రుద్రవరం, నవంబరు 27: ఉద్యానవన నర్సరీ ఏర్పాటు ఊసేలేదు. 15 ఏళ్లయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లోని రైతులకు పండ్ల మొక్కలు అందించాలన్న లక్ష్యంతో నల్లమల తీరంలోని హరినగరం సమీపంలో ఉద్యానవన నర్సరీ ఏర్పాటు చేయాలని 15 ఏళ్ల క్రితం భావించారు. ఈ మేరకు అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి, కలెక్టర్‌ దానకిశోర్‌ 2006 నవంబరు 10వ తేదీన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఇందు కోసం 804/4లో 3.50, 804/5లో మూడు ఎకరాలు, 804/6లో మూడు ఎకరాలు, 890/ 4లో 0.31 ఎకరాలు, 891/1 సిలో 0.32 ఎకరాలు మొత్తం 10.20 ఎకరాలను రెవెన్యూ శాఖ భూమి సేకరించి ఉద్యావన శాఖకు అప్పగించింది. రూ.16 లక్షల నిధులు కేటాయించగా ఇందులో కొంత డబ్బు ఖర్చు చేసి భూమి చదునుతో సరిపెట్టేశారు. ఆ తరువాత నర్సరీ ఏర్పాటు గురించి పట్టిం చుకున్న నాథుడే లేడు. నర్సరీ ప్రారంభమైతే సులభంగా పండ్ల మొక్కలు లభ్యమవుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి ఉద్యానవన నర్సరీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌ను వివరణ కోరగా ఇటీవల ఏపీఎంఐపీ డిప్యూటీ డైరెక్టర్‌ ఉమాదేవి నర్సరీ స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. ఆమె ఆదేశాల మేరకు సర్వే చేసి నివేదిక పంపామని వెల్లడించారు.


నర్సరీని అభివృద్ధి చేయాలి

నర్సరీని అభివృద్ధి చేసి పండ్ల మొక్కలను అందుబాటులోకి తేవాలి. నర్సరీ కోసం భూములు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా నర్సరీ మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

 - వెంకట సుబ్బనర్సయ్య, రైతు, నాగులవరం


ఎదురు చూసి వదిలేశాం

హరినగరం సమీపంలో ఉద్యాన నర్సరీ ఏర్పాటు చేసి పండ్ల మొక్కలు అందిస్తారని ఎదురుచూశాం. కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పండ్ల మొక్కలు అందలేదు. 15 ఏళ్లుగా ఎదురు చూపే మిగిలింది. 

- బొప్పా పక్కిరయ్యగౌడ్‌, రైతు, తిప్పారెడ్డిపల్లె 




Updated Date - 2021-11-28T05:23:04+05:30 IST