‘ఊపా’తో ఉరి

ABN , First Publish Date - 2021-07-06T06:39:56+05:30 IST

గిరిజన హక్కుల కార్యకర్త, బీమాకోరేగావ్‌ కేసులో సహనిందితుడూ అయిన స్టాన్‌స్వామి మరణం అత్యంత విషాదకరం. ముంబై హైకోర్టులో సోమవారం ఆయన బెయిల్‌ విచారణ...

‘ఊపా’తో ఉరి

గిరిజన హక్కుల కార్యకర్త, బీమాకోరేగావ్‌ కేసులో సహనిందితుడూ అయిన స్టాన్‌స్వామి మరణం అత్యంత విషాదకరం. ముంబై హైకోర్టులో సోమవారం ఆయన బెయిల్‌ విచారణ సందర్భం ఓ నివాళి ఘట్టంగా ముగిసింది. బెయిల్‌ వ్యతిరేకించే ఎన్‌ఐఏ న్యాయవాది, న్యాయమూర్తులతో సహా అందరూ  ఈ ఎనభైనాలుగేళ్ళ ‘ఊపా’ ఖైదీ మరణం పట్ల విషాదం వెలిబుచ్చారు. బెయిల్‌ అడగవలసిన స్టాన్‌స్వామి న్యాయవాదులు మరణవార్తను తెలియచేస్తూ, కనీసం భౌతికకాయాన్ని సత్వరమే అప్పగించే దిశగా ఆదేశించమని అభ్యర్థించారు. ‘ఆస్పత్రికి పోను, ఆదివాసుల మధ్యనే కన్నుమూస్తాను, బెయిల్‌ ఇవ్వండి చాలు’ అని ప్రార్థించిన ఫాదర్‌ స్టాన్‌స్వామి చివరకు ముంబై మట్టిలో కలిసిపోవలసి వచ్చింది.


ఆదివాసుల సంక్షేమం కోసం ఆజన్మాంతం పరితపించిన సన్యాసికి ఇటువంటి మరణం దక్కినందుకు నాయకులనుంచి సామాన్యుల వరకూ ఆగ్రహాన్నీ, ఆవేదననీ వెలిబుచ్చుతున్నారు. ఆ మహామనిషి రక్తంతో చేతులు తడుపుకున్న మోదీ అమిత్‌షాలను జాతి ఎన్నటికీ మరిచిపోలేదని దళిత యువనేత జిగ్నేష్‌ మేవానీ ఘాటుగా అన్నారు. ఎన్‌ఐఏ, ఎన్‌హెచ్‌ఆర్‌సి, బీజేపీ, న్యాయవ్యవస్థ కట్టకట్టుకొని చేసిన హత్య ఇది అంటారు యోగేంద్రయాదవ్‌. స్టాన్‌స్వామి పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్దయగా వ్యవహరించిందో తెలుసు. సమస్త వ్యవస్థలూ ఈ ఆదివాసీ హక్కుల పరిరక్షకుడి పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించి పొట్టనబెట్టుకున్నాయి. ఆరోపణలే కానీ, ఆధారాలూ, విచారణలూ లేకుండా తొమ్మిదినెలలుగా జైల్లో బంధించి, బెయిల్‌ కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడ్డారు. న్యాయస్థానాలు సకాలంలో స్పందిస్తే కరోనా కాటుకు చిక్కకుండా కచ్చితంగా బతికేవారు. న్యాయంలో జాప్యం ప్రాణాలు తీసింది. పాలకులతో పాటు న్యాయస్థానాలను కూడా ఈ పాపంలో భాగస్వాములుగా పలువురు విమర్శిస్తున్నది ఇందుకే. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్‌ యూనియన్‌ మానవహక్కుల విభాగాలు కూడా ఈ కస్టడీ మరణాన్ని తీవ్రంగా పరిగణించి భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. మే 21న ముంబైహైకోర్టు వర్చువల్‌ హియరింగ్‌ నిర్వహించిన సందర్భంలో ఆయన ఆరోగ్యం ఎంతగా పతనమైనదీ ప్రత్యక్షంగా తెలిసింది. ఎంతో కష్టంమీద కానీ ఆయన న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఈ సందర్భంగానే ఆయన జైల్లో చావనైనా చస్తాను కానీ, జేజే ఆస్పత్రికి మాత్రం పోననీ, రెండుసార్లు పోయినా తన ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదనీ అన్నారు. అలాగే, తలోజా జైలుకు వచ్చేవరకూ హాయిగా స్వహస్తాలతో తింటూ తిరుగుతూండే తాను క్రమంగా ప్రతీ అవయమూ దెబ్బతినిపోతూ చివరకు కదల్లేని స్థితికి చేరుకున్నాననీ చెప్పారు. కూడదీసుకొని కష్టపడి మాట్లాడుతున్న ఈ వయోవృద్ధుడు కంటికెదురుగా కనిపిస్తున్నా, దయుంచి బెయిల్‌ ఇవ్వండి, ఎక్కడకూ పారిపోను, నాతోటివారందరూ ఉన్నచోటకు పోయి ప్రశాంతంగా కన్నుమూస్తాను అని ప్రాథేయపడుతున్నా న్యాయమూర్తులు కరగలేదు. అతడు జైల్లో, లేదా ఆస్పత్రిలో ఉండాలి తప్ప, ఈ మహాప్రమాదకారికి బెయిల్‌ ఇస్తే దేశభద్రతకే ముప్పువాటిల్లుతుందని పాలకుల మాదిరిగానే వారికీ అనిపించిందేమో. 


‘ఊపా’తో ఇలా ఉరివేస్తే ఇక కడవరకూ జీవచ్ఛవమే. వారి పట్ల అమానుషంగా వ్యవహరించడంలో కారాగారాలకూ న్యాయస్థానాలకూ పెద్ద తేడా ఉండదు. పార్కిన్సన్‌ వ్యాధి ముదిరి, తింటున్నప్పుడు చేతులు వొణికిపోతున్నాయనీ, సిప్పరూ స్ట్రా ఇవ్వాల్సిందిగా తలోజాజైలు అధికారులను కోరితే, వారు మన్నించకపోవడంతో చివరకు వాటికోసం కూడా న్యాయస్థానాలకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. దోషి అని రుజువయ్యేవరకూ నిందితులంతా అమాయకులే అన్న ఆదర్శానికి ‘ఊపా’ అతీతం. వాదనలూ, రుజువులూ నిర్థారణలూ చేయకుండానే తనకు దొరికినవాడిని కనీసం మనిషిగా కూడా ఈ చట్టం గుర్తించడం మానేస్తుంది. కనీసం ఒక్కరోజు కూడా ఆయనను ప్రశ్నించడానికి ముందుకురాని ఎన్‌ఐఏ ఈ క్రూరచట్టం కింద ఎందుకు అరెస్టుచేసినట్టు? అని స్టాన్‌స్వామి న్యాయవాది ముంబైహైకోర్టులో సోమవారం ఓ ప్రశ్న వేశారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన దుర్గతిలో మనపాలకులు లేరు. ఆదివాసులను అక్రమకేసులనుంచీ, అఘాయిత్యాలనుంచీ, దురాక్రమణల నుంచీ రక్షించి, కార్పొరేట్‌ ప్రయోజనాలను దెబ్బతీసిన ఈ సన్యాసి చివరకు చట్టవ్యతిరేకి అన్న ముద్రతో లోకంనుంచి నిష్క్రమించడం విషాదం, విచారకరం.

Updated Date - 2021-07-06T06:39:56+05:30 IST