హనుమ జన్మస్థలం అంజనాద్రే

ABN , First Publish Date - 2021-04-22T10:02:37+05:30 IST

శ్రీరామ భక్తుడు ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అంటూ పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలకు చెందిన కొన్ని ఆధారాలను జాతీయ పండిత బృందం బుధవారం తిరుమలలో వెల్లడించింది.

హనుమ జన్మస్థలం అంజనాద్రే

  • ఆధారాలను బయటపెట్టిన పండిత బృందం
  • పౌరాణిక, వాఙ్మయ, శాసన, 
  • భౌగోళిక ప్రమాణాలతో నివేదిక 


తిరుమల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): శ్రీరామ భక్తుడు ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అంటూ పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలకు చెందిన కొన్ని ఆధారాలను జాతీయ పండిత బృందం బుధవారం తిరుమలలో వెల్లడించింది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి మురళీధరశర్మ, రాణి సదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్‌ అధికారి విభీషణ శర్మతో కూడిన కమిటీ దాదాపు 4నెలల పాటు పరిశోధించి తయారు చేసిన నివేదికను శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ శ్రీమద్రామాయణంలోని సుందరకాండతో పాటు అనేక పురాణాల్లో, వేంకటాచల మహాత్మ్యం తదితర కావ్యాల్లో హనుమంతుడి జన్మ వృత్తాంతం చక్కగా వర్ణించి ఉందని తెలిపారు. సుందరకాండలో తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడే స్వయంగా సీతాదేవికి తెలిపారని వివరించారు. అంజనాదేవికి వాయుదేవుడి వల్ల తాను జన్మించినట్లు చెప్పారన్నారు. మాతంగ మహర్షి చెప్పినట్టుగా అంజనాదేవి వేంకటాచలానికి వచ్చి తపస్సు చేసుకోవడం, ఆంజనేయస్వామికి జన్మనివ్వడం ద్వారా కొండకు ‘అంజనాద్రి’ అనే పేరు వచ్చిందన్నారు. ‘సూర్యబింబాన్ని పట్టుకోవడానికి బాలాంజనేయస్వామి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముడి దర్శనం తర్వాత సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడటం, వానరవీరులు వైకుంఠం గుహలో ప్రవేశించడం... ఇలా అనేక విషయాలు వేంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తున్నాయి’ అని ఆయన వివరించారు.


వాజ్ఞ్మయ, శాసన ఆధారాల ప్రకారం.. వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, వేదాంతదేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారన్నారు. స్టాటన్‌ అనే అధికారి 1800వ సంవత్సరంలో తిరుమల గుడి గురించి విషయాలను సంకలనం చేసి ‘సవాల్‌-ఏ-జవాబ్‌’ పుస్తకాన్ని రాశారని, అందులో కూడా అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్లే అంజనాద్రి అన్నారనే విషయాన్ని రాసినట్టు తెలిపారు. వేంకటాచల మహాత్య్మం అనే గంరఽథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయని, మొదటి శాసనం 1491 జూన్‌ 27, రెండె శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదిగా చెప్పారు. అలాగే శ్రీరంగంలో ఉన్న ఓ శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందన్నారు.


ఆ రాష్ట్రాలపై ఆధారాలు లేవు: టీటీడీ ఈవో

భగవత్‌ సంకల్పంతోనే శ్రీరామనవమి రోజున హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. ఓ భక్తుడి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా ఈ సంకల్పానికి పూనుకున్నట్టు తెలిపారు. ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసి లోతుగా పరిశోధించామన్నారు. రెండు నెలల్లో పూర్తి వివరాలతో పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దాన్ని కూడా తాము శాస్ర్తీయంగా పరిశీలించినట్టు తెలిపారు. అక్కడ కిష్కింధ అనే రాజ్యం ఉండొచ్చని, హనుమ అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సహాయం చేసినట్టు భావించవచ్చని తెలిపారు. గుజరాత్‌, మహారాష్ట్ర, హరియాణాల్లో హనుమంతుడు జన్మించినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ప్రస్తుతం పండితులు ఇచ్చిన నివేదికపై టీటీడీ బోర్డులో, రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులతో చర్చించి జపాలి తీర్థంలో ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. 




ఇకపై హనుమ జన్మస్థానం తిరుమల: తమిళనాడు గవర్నర్‌ 

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ మాట్లాడుతూ ‘శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య, ఇక పై రామభక్తుడైన హనుమంతుడి జన్మస్థానం తిరుమల’ అన్నారు. టీటీడీ ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందన్నారు. హనుమంతుడి భక్తుడినైన తనకు ఈ విషయం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. లోతుగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసున్నారు. నాలుగు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. 

Updated Date - 2021-04-22T10:02:37+05:30 IST