వేధిస్తున్న కూలీల కొరత

ABN , First Publish Date - 2022-07-07T06:39:39+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారినా కూలీల కొరత వేధిస్తోంది.

వేధిస్తున్న కూలీల కొరత
జిల్లాలో నాటు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు

- డబుల్‌ కూలి ఇస్తామన్నా దొరకని వైనం 

- ఇతర రాష్ట్రాల వారేపైనే ఆధారం 

- జిల్లాకు చేరుకుంటున్న అంతర్రాష్ట్ర కూలీలు 

- రోజు కూలి రూ. 550 నుంచి రూ. 700 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారినా కూలీల కొరత వేధిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కూలీల డిమాండ్‌ పెరిగిపోయింది. వర్షాలకు తోడుగా జిల్లాలో కాళేశ్వరం జలాలతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సారి వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో రైతుల్లో ఆశలు చిగురించినా వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు ప్రతియేటా వచ్చే అంతర్రాష్ట్ర కూలీలు, పొరుగు జిల్లాల కూలీలపైనే ఆఽధారపడాల్సి వస్తోంది. దీంతో జిల్లాలో గత యేడాది కంటే ఈసారి రోజు కూలి 200రూపాయల వరకు పెరిగింది. మరోవైపు కూలీలు దొరకని చోట డబుల్‌ కూలి చెల్లిస్తామన్నా నాట్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. గత సంవత్సరం కూలీలకు 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు చెల్లిస్తే ప్రస్తుతం 550 రూపాయల నుంచి 700 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. మగ కూలీలకు 700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గుత్తగా ఎకరానికి ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సొంత ఊళ్లలో కూలీలు లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న సిద్దిపేట, కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి, జిల్లాల నుంచి ఆటోల ద్వారా కూలీలను రప్పిస్తున్నారు. కూలీతో పాటు రవాణా ఛార్జీలు కూడా రైతులు అదనంగా చెల్లిస్తున్నారు. 

- ఎకరానికి రూ. 5,500 నుంచి రూ. 6,000.. 

జిల్లాలో వరి నాట్ల కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రతి యేటా ఇతర రాష్ట్రాల కూలీలపైనే ఆధారపడుతున్నారు. జిల్లాకు బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు వరినాట్లు వేస్తున్నారు. ఒక జట్టుగా ఎకరానికి రూ 5500 నుంచి రూ 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు వచ్చే ఇతర రాష్ట్రాల కూలీలు ఎక్కువగా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్నారు.

- బీడీలు వదిలి పొలం బాట... 

సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బీడీలు చుట్టే కార్మికులు నాట్లు వేయడానికి పొలంబాట పడుతున్నారు. రోజంతా బీడీలు చుడితే  200 రూపాయలు కూడా లభించని పరిస్థితి ఉంది. నాట్లు వేయడానికి వెళ్తే రోజుకు 500 రూపాయలతో పాటు రవాణా ఛార్జీ కింద మరో  50 రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో బీడీ కార్మికులు వ్యవసాయ పనులవైపు  మొగ్గు చూపతున్నారు. 

- జిల్లాలో 2.44 లక్షల ఎకరాల్లో సాగు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగు 2.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసుకుంటారని అంచనాలు వేశారు. ఇందులో వరి 1.50 లక్షల ఎకరాలు, పత్తి 80,900 ఎకరాలు, పెసర 845 ఎకరాలు, కందులు 5,020 ఎకరాలు, అయిల్‌పాం 1,600 ఎకరాలు, ఇతర పంటలు 1,650 ఎకరాలు సాగు చేస్తారని అంచనాలు వేశారు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతోనే వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే 45,981 ఎకరాల్లో సాగయింది. ఇందులో వరి నాట్లు 1,977 ఎకరాల్లో వేయగా పత్తి 43,365 ఎకరాలు, కందులు 298 ఎకరాలు, మొక్కజొన్న 326 ఎకరాలు, పెసర 15 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు.

Updated Date - 2022-07-07T06:39:39+05:30 IST