నడిరోడ్డుపై వైద్యురాలికి వేధింపులు

ABN , First Publish Date - 2022-08-14T08:42:06+05:30 IST

పెందుర్తి ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌ అనుచరుడు మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ ఓ వైద్యురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.

నడిరోడ్డుపై వైద్యురాలికి వేధింపులు

  • బైక్‌పై వెంబడిస్తూ అసభ్య ప్రవర్తన

        పెందుర్తిలో ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం

        అడ్డుకోబోయిన భర్తనూ పొడిచేస్తానంటూ వీరంగం

        స్నేహితుడితో కలిసి నానా హంగామా

        వీడియో తీసిన స్థానికులు.. వైరల్‌

        పోలీసుల అదుపులో ఇద్దరు.. కేసు నమోదు


పెందుర్తి, ఆగస్టు 13: పెందుర్తి ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌ అనుచరుడు మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ ఓ వైద్యురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఆమె భర్తను పొడిచి పారేస్తామంటూ హల్‌చల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాధితుల కథనం ప్రకారం శరగడం శేషు విశాఖ జిల్లా పెందుర్తి ప్రశాంతినగర్‌ సమీపంలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్‌. ఆ దంపతులు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో బైక్‌పై పెళ్లికి బయలుదేరారు. నల్లక్వారీ సమీపంలోని మర్రిచెట్ల కాలనీకి చెందిన మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ బైక్‌పై వీరిని అనుసరిస్తూ డాక్టర్‌ను వేధించసాగారు.


శేషు వారించడంతో మరింత రెచ్చిపోయారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్ద శేషు బైక్‌ను ఆపడంతో మనోహర్‌ ఆ బైక్‌ పైకి ఎక్కి ఇప్పుడు ఏమైందంటూ పెద్దగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. పొడిచి పారేస్తా, పోలీసులకు కంప్లైట్‌ చేసుకో.. అంటూ శేషును వెనక్కి నెట్టాడు. అక్కడున్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. మనోహర్‌ మరింత శ్రుతిమించడంతో పోలీసులకు వైద్యురాలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మనోహర్‌, కల్యాణ్‌లను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. మనోహర్‌ పెందుర్తి ఎమ్మెల్యే అనుచరుడని, వైసీపీలో చురుకుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. 

Updated Date - 2022-08-14T08:42:06+05:30 IST