హార్బర్‌ కల నెరవేరేనా!

ABN , First Publish Date - 2021-09-18T05:34:43+05:30 IST

నరసాపురం మండలం బియ్యపుతిప్ప హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం మొండిచేయి చూపింది.

హార్బర్‌ కల నెరవేరేనా!
నరసాపురం తీర ప్రాంతం

బియ్యపుతిప్ప పోర్టుకు కేంద్రం మొండిచేయి !

మిగిలిన మూడు కేంద్రాలకు90 శాతం నిధులు

రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.429 కోట్లతో తీర ప్రాంత హార్బర్‌ 


 నరసాపురం, సెప్టెంబరు 17: నరసాపురం మండలం బియ్యపుతిప్ప హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించే మూడు హార్బర్‌లకు 90 శాతం నిధులు కేటాయించి, బియ్యపుతిప్ప పోర్టుకు మాత్రం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.429 కోట్లు భరిం చాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న నేపథ్యంలో ఇంత భారీ వ్యయం వెచ్చించి పనుల్ని పూర్తి చేస్తారా ? నిర్మాణ పనులు ముందుకు వెళతాయా ? అన్న సందేహం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది.                   

విభజన హామీల్లో భాగంగా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో నాలుగు హార్బర్‌ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అందులో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లాలోని పుడిమదాక, ప్రకాశంలోని కొత్తపట్నం, నరసాపురం మండలంలో బియ్యపుతిప్ప ఉన్నాయి. గత ఏడాది వీటి నిర్మాణానికి సర్వే చేపట్టి భూసేకరణ పూర్తి చేసి కేంద్రం ఆమోదా నికి పంపారు. వీటిలో బుడగట్లపాలెంకు రూ.365 కోట్లు, పూడిమదాకకు రూ.392, కొత్తపట్నంకు రూ.392 కోట్లు, బియ్యపుతిప్పకు రూ.429 కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి నివేదించారు. కేంద్రం మూడు హార్బర్‌లకు ఎఫ్‌ఐడీఎఫ్‌ నిధుల కింద రూ.450 కోట్లు, ఎన్‌ఐడీఐ రుణం కింద రూ.630 కోట్లు కేటాయించింది. మిగిలిన పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సూచించింది. వీటిలో బియ్యపుతిప్పకు మాత్రం ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. గత నెల 19న ఫిషరీస్‌ కమిషనర్‌ చీఫ్‌ కార్యదర్శి కరికల్‌ జారీచేసిన ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వలేదన్న దానిపై భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. 


 కేంద్ర నిపుణుల నివేదికతో.. నిధులకు బ్రేక్‌


రాష్ట్ర ప్రభుత్వం బియ్యపుతిప్ప వద్ద సేకరించిన స్థలంలో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కోస్టల్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ఫిషరీస్‌ (సీఐసీఈఎఫ్‌) సర్వే నిర్వహించింది. ఇందులో హార్బర్‌ నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయనే సందేహాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. దీని ఆధారంగానే కేంద్రం నిఽధులు ఇవ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సముద్రం గోదావరి కలిసే ప్రదేశంలో ఆటుపోటులు ఎక్కువగా ఉండడం, విపత్తులు సంభవించినప్పుడు తీర ప్రాంతం కోతకు గురవ్వుతుండడం తదితర కారణాలతో నిధుల కేటాయింపునకు బ్రేక్‌లు వేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర నిధులతో హార్బర్‌ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాలను సేకరించింది. కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో ప్రభుత్వమే ఈ హార్బర్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.429.43 కోట్లు కేటాయిస్తున్నట్టు జీవో జారీచేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తారా ? అనే సందేహం కనిపిస్తోంది. 


ఒకే ప్యాకేజీలో నాలుగు హార్బర్లు


కేంద్రం నిధులు ఇవ్వకపోయి నా.. ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమే హార్బర్‌ నిర్మించేందుకు ముందుకొచ్చిం ది. ఇందుకు నిధుల్ని విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేసిం ది. అయితే మిగిలిన మూడు పోర్టుల ప్యాకేజీలో బియ్యపుతిప్పను చేర్చి నాలుగింటికి ఒకేసారి టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనివల్ల పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హార్బర్‌ను నిర్మించి తీరుతాం.

– ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే


Updated Date - 2021-09-18T05:34:43+05:30 IST