కష్టంగా జీ‘వనం’

ABN , First Publish Date - 2022-09-30T04:55:30+05:30 IST

శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో పదకొండు గిరిజన గ్రామాలున్నాయి. వీరంతా కొండపైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు ఆనుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అనంతగిరి మండల గిరిజన గ్రామాలున్నాయి.

కష్టంగా జీ‘వనం’
ఎస్‌.కోట మండలం దారపర్తి పంచాయతీ

సబ్‌ప్లాన్‌లో లేక.. ఐటీడీఏ రాక గిరిజనుల ఇబ్బందులు
మౌలిక సౌకర్యాలూ కరువు.. రహదారి లేక నరకయాతన
170 యాక్టు అమలుకాక చేతులు మారుతున్న భూములు

శృంగవరపుకోట, సెప్టెంబరు  29:


 శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో పదకొండు గిరిజన గ్రామాలున్నాయి. వీరంతా కొండపైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు ఆనుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అనంతగిరి మండల గిరిజన గ్రామాలున్నాయి. వారంతా సబ్‌ప్లాన్‌ పరిధిలో ఉండడంతో పాడేరు ఐటీడీఏ నుంచి సేవలు పొందుతున్నారు. పక్కనే ఉన్న మన జిల్లాకు చెందిన గ్రామాలు సబ్‌ప్లాన్‌ పరిధిలో లేవు. యాస, భాష, సంసృతి, సాంప్రదాయాలన్నీ ఒక్కటే. కానీ సబ్‌ప్లాన్‌లో లేక సేవలు అందుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ గ్రామాలకు రహదారి లేదు. అత్యవసర సమయంలో నరకయాతన పడుతున్నారు.


 వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామ పంచాయతీ పరిధిలో తొమ్మిది గిరిజన గ్రామాల వరకూ ఉన్నాయి. ఈ గ్రామాలేవీ సబ్‌ప్లాన్‌ పరిధిలో లేవు. దీంతో 170 యాక్టు అమలు కావడం లేదు. గిరిజనుల భూములన్నీ చేతులు మారుతున్నాయి. విశాఖ, హైదరాబాద్‌, అమెరికాలో నివశిస్తున్న వారంతా తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసేశారు. గిరిజనులనే కాపలాగా ఉంచి భూములన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. స్థానికంగా వున్న కొంతమంది పెద్ద మనుషులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయం చేసుకొనేందుకు ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను పక్కనున్న జిరాయితీ సర్వే నెంబర్‌లను నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించేస్తున్నారు.
ఇదీ సబ్‌ప్లాన్‌ పరిధిలోలేని గిరిజన గ్రామాల దుస్థితి. తాము కూడా గిరిజనులమేనని.. యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ షెడ్యూల్‌ గ్రామాల పరిధిలోని గిరిజనుల వలే ఉన్నాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు ఎన్నిసార్లు  మొర పెట్టుకున్నా ప్రభుత్వాలు కనికరించడం లేదు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో ఉంచేయడంతో అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం వరకు పార్వతీపురం ఐటీడీఏ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లేందుకైనా అవకాశముండేది. ఇప్పుడా అవకాశం లేదు. పునర్వీభజనలో ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) లేని జిల్లాగా మిగిలింది. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అందరిలాగే వీరికి కూడా కలెక్టరేట్‌ స్పందనే దిక్కువుతోంది.


ముఖ్యమంత్రికి వినతి
జిల్లాకు ఐటీడీఏను సమకూర్చాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురామరాజు ఇటీవల జరిగిన శాసనసభా సమావేశాల్లో సీఎం జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గిరిజన గ్రామాలకు అందుబాటులో వున్న శృంగవరపుకోట మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే సబ్‌ప్లాన్‌ పరిధిలో లేని గ్రామాల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


గతంలోనూ అన్యాయమే
ఉమ్మడి విజయనగరం జిల్లాకు పార్వతీపురం ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ) ఉండేది. పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని గిరిజన గ్రామాలన్నీ షెడ్యూల్‌ ఏరియా (సబ్‌ ప్లాన్‌)గా ఉండేవి. మిగిలిన మండలాల్లో వున్న గిరిజన గ్రామాలు సబ్‌ప్లాన్‌ ప్రాంతంలో లేకపోయేవి. యాస, భాష, సంసృతి, సాంప్రదాయాలన్నీ షెడ్యూల్‌ ఏరియాల్లో వున్న గిరిజన గ్రామాల వలే వున్నప్పటికీ ఎస్‌.కోట మండలంలోని గిరిజనులకు అన్యాయం జరిగేది. ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ నేతల చొరవ లేక పార్లమెంటు వరకు చేరలేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇక్కడి గిరిజనులకు నష్టం జరిగింది. అయితే పోడు వ్యవసాయం, గిరిజన ఉత్పత్తుల విక్రయాల వంటి వా


అభివృద్ధికీ దూరం
జిల్లాలో శృంగవరపుకోట, వేపాడ, గంట్యాడ, కొత్తవలస,  బొండపల్లి, మెంటాడ తదితర మండలాల పరిధిలో గిరిజన గ్రామాలున్నాయి. వీరికి రహదారి సదుపాయం లేక విద్య, వైద్యానికే కాదు అన్ని రకాల అభివృద్దికి దూరంగా వున్నారు. ఉదాహరణకు గంట్యాడ మండలం దిగువ కొండపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో 13 ఆవాసాలున్నాయి. వారంతా నూతనంగా ఆవిర్భవించిన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ గ్రామం వరకు నడుచుకువచ్చి ఎస్‌.కోట మండలం బొడ్డవర నుంచి మండల కేంద్రానికి వెళ్లాలి. జిల్లాలోని కొండ ప్రాంతంలో నివశిస్తున్న గిరిజన గ్రామాలన్నీ దాదాపుగా ప్రస్తుతం పాడేరు కేంద్రంగా ఏర్పాటైన అల్లూరి సీతారామ రాజు జిల్లా అనంతగిరి మండల గ్రామాలకు ఆనుకుని ఉన్నాయి.


మౌలిక సౌకర్యాలు లేక..
శృంగవరపుకోట, గంట్యాడ, వేపాడ మండల పరిధిలోని గిరిజనులు మైదాన ప్రాంత వాసులతో పోటీపడలేక విద్య, ఉద్యోగాల్లో వెనకబడుతున్నారు. గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేక నాణ్యమైన విద్య, వైద్యం పొంద లేకపోతున్నారు. వీరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు డబ్బు ఆశ చూపించి  సాగు చేసుకుంటున్న భూములను తక్కువ ధరకు లాక్కుంటున్నారు. వీరు నివశిస్తున్న గ్రామాలకు ఆనుకుని వున్న అనంతగిరి మండల గ్రామాలన్నీ ఐటీడీఏ పరిధిలో ఉండడంతో వారు విద్య, ఉద్యోగ ఫలాలు పొందుతున్నారు. పక్కనే వున్న మన జిల్లాకు చెందిన గిరిజనుల బతుకులు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.

సబ్‌ప్లాన్‌ పరిధిలో చేర్చాలి

జిల్లాలో వున్న గిరిజన గ్రామాలన్నీ సబ్‌ప్లాన్‌ పరిధిలో చేరేలా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి. ఎస్‌.కోట మండల కేంద్రంలో ఖాళీగా వున్న జీసీసీ గోదాం భవనాల్లో ఐటీడీఏను ఏర్పాటు చేసేలా కృషి చేయాలి. అంతవరకు గ్రూప్‌ 1 స్థాయి అధికారితో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసి గిరిజనులకు సేవలు అందేలా చూడాలి.
                                        - జె.గౌరిష్‌, గిరిజన సంఘ నాయకుడు, శృంగవరపుకోట
 
 

Updated Date - 2022-09-30T04:55:30+05:30 IST