హార్ధిక్ పాండ్యా కరెక్టే.. మాజీల మద్దతు

ABN , First Publish Date - 2022-04-13T22:03:57+05:30 IST

ముంబై : ఐపీఎల్ 2022లో భాగంగా గత సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు.

హార్ధిక్ పాండ్యా కరెక్టే.. మాజీల మద్దతు

ముంబై : ఐపీఎల్ 2022లో భాగంగా గత సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించలేదనే కారణంతో టీం సభ్యుడు, టీమిండియా సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ షమీపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు కారణమైంది. అయితే విమర్శల సంగతి అటుంచితే.. స్వాన్, మ్యాథ్యూ హెడెన్ వంటి మాజీ క్రికెట్ దిగ్గజాల నుంచి పాండ్యాకు  మద్దతు దక్కింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి లేదా షమీపై కోపం అంశంలో పాండ్యా తప్పుబట్టకూడదని స్వాన్ సమర్ధించాడు. ఏ విధంగా నడుచుకోకూడదో మాత్రమే ఈ ఘటన తెలియజేస్తుంది. అంతేతప్ప హార్ధిక పాండ్యా కెప్టెన్సీ బాగాలేదని అనడం సబబుకాదు. తక్కువ పరుగులు చేయడం వల్ల మాత్రమే వారు ఓటమి పాలయ్యారు. ఇక షమీపై ఆగ్రహం విషయానికి వస్తే.. ఒక కెప్టెన్‌గా లేదా బౌలర్‌గా పాండ్యాను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని మద్దతిచ్చాడు. ఆసిస్ క్రికెటర్ మ్యాథ్యూ హెడెన్ కూడా పాండ్యా వైపే నిలిచాడు. మ్యాచ్‌లో అది చాలా కీలకమైన క్షణమని, ఆ  సమయంలో పాండ్యా బౌలింగ్ వేశాడని అన్నాడు. క్యాచ్ పట్టేందుకు మొహమ్మద్ షమీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని ప్రస్తావించాడు. బౌండరీ దగ్గరకు జరిగాడని, అయితే కావాలనే క్యాచ్ పట్టలేదని మాత్రం అనబోనని హెడెన్ వ్యాఖ్యానించాడు.


షమీపై  పాండ్యా ఆగ్రహంపై మ్యాచ్ అనంతరం క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లతోపాటు మాజీ క్రికెటర్లు కూడా పాండ్యా తీరును తప్పుబట్టారు. సీనియర్ క్రికెటర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని విమర్శలు గుప్పించారు. కెప్టెన్ అయ్యావని గర్వం తలకెక్కిందా అని ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని సూచించారు. కాగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-13T22:03:57+05:30 IST