Spelling Bee విజేత మనమ్మాయే.. రన్నరప్‌ కూడా మనోడే!

ABN , First Publish Date - 2022-06-03T17:07:34+05:30 IST

2022 స్క్రిప్స్ స్పెల్లింగ్‌ బీ (Scripps National Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి ప్రతిభ చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్(14) విజేతగా నిలిస్తే.. మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12) రెండో..

Spelling Bee విజేత మనమ్మాయే.. రన్నరప్‌ కూడా మనోడే!

వాషింగ్టన్‌: 2022 స్క్రిప్స్ స్పెల్లింగ్‌ బీ (Scripps National Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి ప్రతిభ చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్(14) విజేతగా నిలిస్తే.. మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12) రెండో స్థానంలో నిలిచాడు. విజేతను నిర్ధారించే చివరి రౌండ్‌లోని 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పడం విశేషం.


ఇక రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు 15 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పగలిగాడు. ఈ పోటీల్లో పాల్గొన్న 230 మందిని (12 మంది ఫైనలిస్ట్‌లను కలుపుకుని)వెనక్కి నెట్టి హరిణి అందరి కంటే ఎక్కువ పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పడం గమనార్హం. ఇక ఫైనల్ రౌండ్‌లో scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠిన పదాలకి సైతం ఆమె ఏమాత్రం తడబాటుకు గురికాకుండా కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పడంతో విజేతగా నిలిచింది. హరిణికి నిర్వాహకులు జ్ఞాపికతో పాటు రూ.38లక్షల నగదు పారితోషికం అందజేశారు. ఇక రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. 


ఇక గతేడాది జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో సైతం భారతీయ విద్యార్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. మొత్తం 11 మంది ఫైనలిస్టుల్లో 9 మంది భారత సంతతి బాలలు ఉన్నారు. అయితే, లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన అఫ్రికన్ అమెరికన్​ జైలా అవంత్​ గార్డె(14) విజేత​గా నిలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్​ అమెరికన్​గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేగాక 96 ఏళ్ల 'స్పెల్లింగ్​-బీ' పోటీల చరిత్రలో ఛాంపియన్​గా నిలిచిన రెండో నల్లజాతీయురాలు కూడా జైలానే. భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్​తో సరిపెట్టుకుంది. కానీ, ఈ ఏడాది భారత సంతతి బాలలు విజేతగా నిలిచి సత్తాచాటారు.  



Updated Date - 2022-06-03T17:07:34+05:30 IST