హరీశ్‌ టీం.. ప్లీనరీకి దూరం

ABN , First Publish Date - 2021-10-26T05:26:50+05:30 IST

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ప్లీనరీ వేడుకలకు సిద్దిపేట నియోజకవర్గ నేతలు దూరంగా ఉన్నారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉపఎన్నిక ప్రచారంలో వీరంతా నిమగ్నం కావడంతో ప్లీనరీకి వెళ్లలేకపోయారు. మూడు నెలలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శకంలో పని చేస్తున్నారు.

హరీశ్‌ టీం.. ప్లీనరీకి దూరం

హుజూరాబాద్‌  ఉప ఎన్నిక పోరులో నిమగ్నం  

అక్కడే మూడు నెలలుగా మకాం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 25 : హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ప్లీనరీ వేడుకలకు సిద్దిపేట నియోజకవర్గ నేతలు దూరంగా ఉన్నారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉపఎన్నిక ప్రచారంలో వీరంతా నిమగ్నం కావడంతో ప్లీనరీకి వెళ్లలేకపోయారు. మూడు నెలలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శకంలో పని చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌,  కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలకు హుజూరాబాద్‌లో ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వారు వారికి కేటాయించిన గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని గడపగడపకూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు అక్కడే ఉంటారు. అందుకే టీఆరెస్‌ పార్టీ ప్లీనరీకి హాజరుకాలేకపోయారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి పురిటి గడ్డగా ఉన్న సిద్దిపేట ప్రాంత నేతలు ప్రతీ కార్యక్రమంలోనూ ముందుండేవారు. హుజూరాబాద్‌ ఎన్నిక నేపథ్యంలో మొదటిసారిగా సిద్దిపేట ప్రాంత టీఆర్‌ఎస్‌ నేతలు గైర్హాజరయ్యారు. 


హుజూరాబాద్‌ పోరులో హరీశ్‌ పనిచేస్తున్నాడు : సీఎం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడ పనిచేస్తున్నాడని సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్లీనరీలో ప్రస్తావించారు. అందుకే ప్లీనరీకి రాలేదని చెప్పుకొచ్చారు. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుస్తున్నాడని.. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడని సభలో జోష్‌ నింపారు. ఇటీవల కేసీఆర్‌ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సలోనూ సిద్దిపేట నేతలను ప్రత్యేకంగా ప్రశంసించారు. బాగా పని చేస్తున్నారని, మరింత కృషి చేస్తే మంచి మెజార్టీతో గెలుస్తామని దిశానిర్ధేశం చేశారు.


Updated Date - 2021-10-26T05:26:50+05:30 IST