స్వచ్ఛ ‘హరిత’ం

ABN , First Publish Date - 2020-12-02T06:34:25+05:30 IST

జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును దక్కించుకున్న విజయవాడలోనే పర్యాటక శాఖ మరో అవార్డునందుకుంది.

స్వచ్ఛ ‘హరిత’ం

బెర్మ్‌ పార్క్‌కు మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు 
2020 బెస్ట్‌ టూరిజం హోటల్‌గా ఎంపిక 
2019లోనూ అవార్డు సాధించిన హరిత 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 
జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును దక్కించుకున్న విజయవాడలోనే పర్యాటక శాఖ మరో అవార్డునందుకుంది. కృష్ణాతీరంలోని హరిత బెర్మ్‌పార్క్‌ పర్యాటక కేటగిరిలో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపికైంది. హరిత బెర్మ్‌ పార్క్‌ యూనిట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మంగళవారం ఈ అవార్డును స్వీకరించారు. దేశ స్థాయిలో పర్యాటకంగా ఏపీ విశిష్ఠ స్థానం సాధించిన సంగతి తెలిసిందే. దీనిలో ఏపీటీడీసీకి చెందిన హరిత బెర్మ్‌ పార్క్‌ వంతు కూడా ఉంది. హరిత బెర్మ్‌ పార్క్‌ ఒక్క హోటల్‌గానే కాకుండా.. చక్కటి రిక్రియేషన్‌ సెంటర్‌గా ఉంటోంది. రుచికరమైన భోజనాన్ని వండి వార్చే ఏసీ రెస్టారెంట్‌, బార్‌, స్టార్‌ హోటల్‌లోని సూట్లతో సమానమైన కాటేజీలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చక్కటి లాన్‌, ఫంక్షన్‌ హాల్‌ ప్రత్యేకమైనవి. లాన్‌లోనూ అద్భుతమైన సెట్టింగ్‌ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయి. భారీ పార్కింగ్‌ ఏరియాతో పాటు, కృష్ణానదిలో చక్కెర్లు కొట్టడానికి, భవానీ ద్వీపానికి చేరుకోవటానికి బోటింగ్‌ యూనిట్‌ కూడా ఇక్కడే ఉంది. ఎన్నో అంశాల మేళవింపుతో ఉన్న హరిత బెర్మ్‌ పార్క్‌ 2019లో మొదటి సారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును అందుకుంది. ఇప్పుడు 2020లో కూడా రెండో సారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపిక కావటం గమనార్హం. 

Updated Date - 2020-12-02T06:34:25+05:30 IST