లక్ష్యం.. నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-20T05:47:55+05:30 IST

లక్ష్యం.. నిర్లక్ష్యం

లక్ష్యం.. నిర్లక్ష్యం

గ్రేటర్‌ పరిధిలో కనిపించని హరితహారం

లక్ష్యానికి మించి మొక్కలు పంపిణీ చేసినట్లు లెక్కలు

కార్పొరేటర్లకు మొక్కలిచ్చి వదిలేసిన అధికార గణం

ఎక్కడ నాటారో తెలియని వైనం

అధికారుల తీరుపై నగరవాసుల మండిపాటు


వరంగల్‌ సిటీ, సెప్టెంబరు 19: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ విడత హరితహారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో మాత్రం లక్ష్యాన్ని చేరలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 13,13,256 మొక్కలు నాటేందుకు గ్రేటర్‌ వరంగల్‌ అధికార గణం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఆ మేరకు 22 నర్సరీల్లో మొక్కలను సైతం సిద్ధం చేసుకున్నారు. అయితే లక్ష్యానికి మించి మొక్కలను కార్పొరేట్లకు పంపిణీ చేసినట్లు గ్రేటర్‌ అధికారులు చెప్పుతున్నారు. కానీ నగరంలో ఎక్కడా వాటిని నాటిన దాఖలాలు మాత్రం కపించడం లేదు. కేవలం ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్‌ పేరిట నాటిన మొక్కలే తప్ప నగరంలోని వీధుల్లో ఎక్కడా మొక్కలు నాటినట్లు కనిపించడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. మొక్కలు నేరుగా ఇంటింటికి పంపిణీ చేయాలని కార్పొరేటర్లకు పంపిణీ చేసిన మొక్కల జాడ ఎక్కడా కనిపించడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసినా హరితహారం కార్యక్రమం గ్రేటర్‌ పరిధిలో లక్ష్యాన్ని చేరలేదని, ప్రజా ధనం వృథా అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


22 నర్సరీల్లో రూ. కోట్ల ఖర్చుతో మొక్కల పెంపకం...

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 8వ విడత హరితహారం కార్యక్రమంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకుని మొక్కలను 22 నర్సరీల ద్వారా సిద్ధం చేశారు. దీని కోసం ఒక్కొక్క నర్సరీకి ముగ్గురు సిబ్బందిని మొక్కల నిర్వహణ కోసం నియమించారు. సంవత్సరంపాటు ఈ నర్సరీలను గ్రేటర్‌ వరంగల్‌ నిధులతో నిర్వహించారు. నర్సరీ నిర్వహణ కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ. 11,650 చొప్పున చెల్లించారు. వీటితోపాటు సీడ్స్‌, బ్యాగ్స్‌ కోసం సుమారు. రూ. 17 లక్షలను వెచ్చించారు. వెరసి మొత్తంగా సుమారు రూ. 11 కోట్లు వెచ్చించి 22 నర్సరీల్లో 13 లక్షలకు పైచిలుకు మొక్కలను పెంపకం చేశారు. 


లక్ష్యాన్ని మించినట్టులెక్కలు..

ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 58 డివిజన్లలో 13.13లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. అందుకు అనుగుణంగానే నర్సరీలో ్లనుంచి లక్ష్యానికి మించిన మొక్కలను కార్పొరేటర్లకు పంపిణీ చేసినట్లు గ్రేటర్‌ అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇప్పటికే సుమారు 14 లక్షల మొక్కలను పంపిణీ చేసినట్లు వారి లెక్కల్లో పేర్కొన్నారు. 


కానరాని కార్పొరేటర్లకు పంపిణీ చేసిన మొక్కలు...

ప్రతీ ఇంటిలో మొక్కలు నాటాలనే లక్ష్యంతో బల్దియా అధికారులు నేరుగు పౌరులకు మొక్కలను పంపిణీ చేసేందుకు డివిజన్ల వారీగా ఆయా కార్పొరేటర్లకు మొక్కను పంపిణీ చేశారు. అయితే కార్పొరేటర్లకు మొక్కలు పంపిణీ చేసినట్లు లెక్కల్లో కనిపిస్తున్నాయే తప్ప మొక్కలు ఎక్కడ నాటారో తెలియడం లేదు. 58 డివిజన్ల పరిధిలో వీధుల్లో మొక్కలు నాటాల్సి ఉండగా కొన్నిచోట్ల మాత్రమే కార్పొరేటర్లు మొక్కలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా వాటిని ఎక్కడ నాటారో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. 


ప్రధాన రహదారుల వెంబడి మాత్రమే అవెన్యూ ప్లాంటేషన్‌...

బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల వెంబడి మాత్రమే హరితహారంలో భాగంగా మొక్కలు నాటినట్లు కనిపిస్తున్నాయి. రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్‌ చేసినట్లు కనబడుతుంది. ఇక నగరంలోని వీధుల్లోని రహదారుల వెంబడి ఎక్కడా కొత్తగా మొక్కలు నాటిన దాఖలాలు కనిపించడం లేదు. ములుగురోడ్‌, హంటర్‌రోడ్‌, నర్సంపేట రోడ్‌ తదితర ప్రధాన రహదారుల వెంబడి మాత్రమే 8వ విడత హరితహారంలో మొక్కలు నాటినట్లు కనబడుతోంది. 

Updated Date - 2022-09-20T05:47:55+05:30 IST