హరివంశ్‌ హైడ్రామా

ABN , First Publish Date - 2020-09-23T07:11:40+05:30 IST

సస్పెండై న ఎంపీల నిరవధిక ధర్నా అయిపోయింది! ఇప్పుడు సస్పెండ్‌ చేసిన డిప్యూటీ చైర్మన్‌ వంతు! తనను అవమానించిన

హరివంశ్‌ హైడ్రామా

ఉదయాన్నే సస్పెండైన సభ్యుల వద్దకు

వారికి స్వయంగా టీ అందించే యత్నం

ఎంపీల తిరస్కరణ.. రైతు వ్యతిరేకి ముద్ర

మరోసారి డిప్యూటీ చైర్మన్‌ మనస్తాపం

24 గంటలపాటు నిరాహార దీక్షకు నిర్ణయం

సస్పెండైన సభ్యులకు టీ అందించే యత్నం

ఎంపీల తిరస్కరణ.. రైతు వ్యతిరేకి ముద్ర

నిరాహార దీక్షకు డిప్యూటీ చైర్మన్‌ నిర్ణయం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): సస్పెండై న ఎంపీల నిరవధిక ధర్నా అయిపోయింది! ఇప్పుడు సస్పెండ్‌ చేసిన డిప్యూటీ చైర్మన్‌ వంతు! తనను అవమానించిన ప్రతిపక్ష సభ్యుల తీరుకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ 24 గంటల నిరాహార దీక్షకు పూనుకొన్నారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచీ ఆయన పలు నాటకీయ పరిణామాలను రక్తికట్టించారు. సస్పెన్షన్‌కు నిరసనగా 8 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రంతా దీక్ష చేశారు.


మంగళవారం ఉదయాన్నే టీ తీసుకుని హరివంశ్‌ అక్కడికి వెళ్లారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు కప్పుల్లో పోసి టీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయి తే, ఆయన ‘టీ కప్పు దౌత్యాన్ని’ సస్పెండైన ఎంపీలు తిరస్కరించారు. ‘రైతు వ్యతిరేకి’ అంటూ విమర్శలు గుప్పించారు. దాంతో మరోసారి తనకు అవమానం జరిగిందని భావించిన హరివంశ్‌ తన ఆవేదనను వివరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రప తి వెంకయ్య నాయుడుకు 3 పేజీల లేఖ రాశారు.

తన 24 గంటల దీక్షతోనైనా సస్పెండైన ఎంపీలకు ఆత్మశుద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఆ లేఖను ప్రధాని మోదీ ట్విటర్లో ఉంచి హరివంశ్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే, బిహార్‌కు చెందిన హరివంశ్‌ చుట్టూ నడుపుతున్న రాజకీయ హైడ్రామాను ప్రతిపక్షాలు గుర్తించాయి. బిహార్‌ ఎన్నికల నీడ పార్లమెంటుపై పడిందని ట్విటర్లో జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన తీరును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. 




నా దారి లేదా రహదారి చెల్లదు: వెంకయ్య

ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ఎంతో సంయమనంతో వ్యవహరించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ‘నా దారి లేదా రహదారి’ అన్నట్లున్న విపక్ష నాయకుల వైఖరి చెల్లదని తప్పుబట్టారు. 


Updated Date - 2020-09-23T07:11:40+05:30 IST