Jhulan Goswami: ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న జులన్ గోస్వామి.. కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్

ABN , First Publish Date - 2022-09-25T00:02:46+05:30 IST

టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జులన్ గోస్వామి (39) కెరియర్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. ప్రతిష్ఠాత్మక

Jhulan Goswami: ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న జులన్ గోస్వామి.. కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్

లండన్: టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జులన్ గోస్వామి (39) కెరియర్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డే ప్రారంభానికి ముందు భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) ఆమెను ప్రత్యేకంగా గౌరవించింది. టాస్ కోసం తన వెంట గోస్వామిని మైదానంలోకి తీసుకెళ్లిన హర్మన్.. ఆమెతోనే టాస్ చెప్పించి తుది మ్యాచ్‌కు ముందు ఆమెను గొప్పగా గౌరవించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2తో ఓడిపోయిన భారత జట్టు వన్డేల్లో మాత్రం అద్భుతంగా రాణించింది. తొలి వన్డేలను గెలుచుకుని 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా, గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.


మ్యాచ్ ప్రారంభానికి ముందు జులన్‌కు బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది. తనతో ఇన్నాళ్లు కలిసి ఆడిన జులన్‌కు ఇది చివరి మ్యాచ్ కావడంతో టీం సమావేశంలో హర్మన్ కన్నీళ్లు పెట్టుకుంది. మిగతా ఆటగాళ్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ను జులన్ ఓదార్చింది. ఈ వీడియోను షేర్ చేసిన బీసీసీఐ జులన్ రికార్డును ప్రస్తావించింది. 33 ఏళ్ల హర్మన్ 2009లో గోస్వామి కెప్టెన్సీలోనే అరంగేట్రం చేసింది.


జులన్ రికార్డులు

* జులన్ గోస్వామి (Jhulan Goswami) తన కెరియర్‌లో అత్యద్భుతమైన రికార్డులు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు సాధించిన తొలి మహిళా బౌలర్‌గా రికార్డులకెక్కింది. రైటార్మ్ పేసర్ అయిన జులన్ ఇప్పటి వరకు 353 వికెట్లు పడగొట్టింది. మహిళా ప్రపంచకప్‌లో అత్యధికంగా 43 వికెట్లు తీసింది. 

* చివరి మ్యాచ్‌కు ముందు జులన్ మాట్లాడుతూ.. 2005, 2017 ప్రపంచకప్‌లలో రన్నరప్‌లుగా మిగిలిపోవడం తన కెరియర్‌లోనే అత్యంత బాధాకరమని పేర్కొంది. ప్రపంచకప్ సాధించాలన్న తన కల నెరవేరకుండానే రిటైర్ అవుతున్నందుకు బాధగా ఉందని విచారం వ్యక్తం చేసింది. 

* ఇండియా క్యాప్‌ను అందుకోవడం తన జీవితంలోనే మర్చిపోలేని మధురానుభూతి అని పేర్కొన్న జులన్.. 1997లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్.. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలన్న తన కలలకు ఆజ్యం పోసిందని గుర్తు చేసుకుంది. ఆ మ్యాచ్‌కు తాను బాల్ గాళ్‌గా వ్యవహరించినట్టు పేర్కొంది.  

* టీమిండియా తరపు 12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20లకు జులన్ ప్రాతినిధ్యం

* వన్డే క్రికెట్‌లో 253 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్

* అంతర్జాతీయ క్రికెట్‌లో 2260.2 ఓవర్లతో అత్యధిక బంతులు విసిరిన మహిళా బౌలర్‌గా రికార్డు

* మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక కాలం (20 సంవత్సరాల 261 రోజులు) క్రికెట్‌లో కొనసాగిన ప్లేయర్‌గా రికార్డు  

* 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది.  

* 12 టెస్టు మ్యాచుల్లో 44 వికెట్లు పడగొట్టింది.

* 2007లో ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

* 3సార్లు ఆసియా కప్ విజేత



Updated Date - 2022-09-25T00:02:46+05:30 IST