JK Rowling : ఇక నీ వంతు రాబోతోంది : ‘హారీ పోటర్’ రచయిత్రికి బెదిరింపులు...

ABN , First Publish Date - 2022-08-14T18:56:12+05:30 IST

సంచలనం సృష్టించిన హారీ పోటర్ (Harry Potter) సిరీస్ రచయిత్రి

JK Rowling : ఇక నీ వంతు రాబోతోంది :  ‘హారీ పోటర్’ రచయిత్రికి బెదిరింపులు...

న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన హారీ పోటర్ (Harry Potter) సిరీస్ రచయిత్రి జేకే రౌలింగ్‌ (JK Rowling)కు ట్విటర్ వేదికగా బెదిరింపులు వచ్చాయి. న్యూయార్క్‌లో సల్మాన్ రష్డీ (Salman Rushdie)పై దాడిని ఖండించినందుకు ఆమెను ఓ ట్విటరాటీ బెదిరించాడు. ఆమె విజ్ఞప్తి మేరకు పోలీసులు స్పందించి, దర్యాప్తు జరుపుతున్నారు. 


సటానిక్ వర్సెస్ (Satanic Verses) రచయిత సల్మాన్ రష్డీని చంపాలని ఇరాన్ లీడర్, మత పెద్ద అయతొల్లా రుహొల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. ఈ నేపథ్యంలో హడీ మటర్ అనే వ్యక్తి సల్మాన్ రష్డీపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. రష్డీ న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఉపక్రమిస్తుండగా ఈ దారుణం జరిగింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం ఆయనకు వెంటిలేటర్‌ను తొలగించారు. ఆయన మాట్లాడగలుగుతున్నారు. 


జేకే రౌలింగ్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో,  సల్మాన్ రష్డీపై దాడి అత్యంత భయానకమని, దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపారు. రష్డీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


ఈ ట్వీట్‌కు ఓ వ్యక్తి బదులిస్తూ, ‘‘బాధపడకు, తర్వాతి వంతు నీదే’’ అని హెచ్చరించాడు. (రష్డీపై దాడి చేసిన) ఆ వ్యక్తి పేరు హడీ మటర్ అని, అతను అయతొల్లా ఖొమేనీ ఫత్వాను పాటించాడని పేర్కొన్నాడు. అతను విప్లవాత్మక షియా యోధుడని అభివర్ణించాడు. ఈ హెచ్చరిక స్క్రీన్‌షాట్‌ను రౌలింగ్ ట్విటర్ సపోర్ట్ సెంటర్‌కు ట్యాగ్ చేసి, తనకు సాయం చేయాలని కోరారు. 


తనకు మద్దతిచ్చినవారందరికీ జేకే రౌలింగ్ ధన్యవాదాలు చెప్పారు. తనను బెదిరించిన అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. గతంలో వచ్చిన బెదిరింపులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. 


అయితే ఆ యూజర్ కామెంట్‌లో ట్విటర్ నిబంధనల ఉల్లంఘన జరగలేదని ట్విటర్ ఫీడ్‌బ్యాక్ నుంచి సమాధానం వచ్చినట్లు రౌలింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. 


Updated Date - 2022-08-14T18:56:12+05:30 IST