జిల్లాలో వరికోతలు షురూ

Published: Mon, 28 Mar 2022 01:33:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జిల్లాలో వరికోతలు షురూ

జిల్లాలో మొదలైన వరి కోతలు 

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతనివ్వని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

వ్యాపారులకు అమ్మేందుకు సిద్ధమవుతున్న రైతులు

బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం ప్రకటన

అయోమయంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు

జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3 లక్షల 50 వేల ఎకరాల వరకు వరి సాగు 

జిల్లాలో తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా

నిజామాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రైతులు యాసంగి సీజన్‌లో సాగుచేసిన వరి పంట కోతలు షురువయ్యాయి. కొన్ని గ్రామాల్లో సీజన్‌ ప్రారంభంలోనే వరి సాగును మొదలు పెట్టడంతో ప్రస్తుతం పంటలు కోతకు వచ్చాయి. దీంతో రైతులు హార్వెస్టర్‌ సహాయంతో పంటను కోస్తున్నారు. కల్లాలు, రోడ్ల వెంట ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. జిల్లాలోని సిరికొండ, వర్ని, మోస్రా, చందూర్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరి కోతలు మొదలుపెట్టారు.

    3.50 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3 లక్షల 50 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. వీటిలో 2 లక్షల 25 వేల వరకు సన్న రకాలు ఉండగా మిగతా దొడ్డు రకాలను సాగు చేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 9 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి రానుందని అంచనా వేశారు. ప్రతి సీజన్‌లో సన్న రకాలు మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తూన్నారు. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఐదున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసినా జిల్లాలో వచ్చే మొత్తం దిగుబడి కొనడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున యాసంగి కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో పౌరసరఫరాల శాఖ ఎలాంటి ఏర్పాట్లను చేపట్టలేదు. గన్నీ బ్యాగులతో పాటు ఇతర ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. నిజామాబాద్‌ మార్కెట్‌ మిన హాయిస్తే ఇతర మార్కెట్‌లో కొనుగోలు చేసినా సరిపడా సిబ్బంది, హమాలీలు లేరు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్ల పై తమ కు ఎలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు రాలేదని మార్కెటింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

   గ్రామాల్లో రైతుల తీర్మానాలు..

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని పలు గ్రామాల్లో రైతులు తీర్మానాలు చేస్తున్నారు. పంజాబ్‌ తరహాలో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని, రా రైస్‌ మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి పీయూస్‌ గోయల్‌ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణగడం లేదు. యాసంగిలో వరి సాగు ముందుగా చేసిన రైతులు మాత్రం కోతలను మొదలు పెట్టారు. ధాన్యం రోడ్లపై ఎండబోస్తు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు కేందాలు లేకపోవడం వల్ల ఎలా అమ్ముకోవాలని ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తే మద్దతు ధర వచ్చే అవకాశం లేకపోవడంతో అయోమయంలో పడ్డారు.

  ఆందోళనలో మిల్లు యాజమానులు..

బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 220 రా రైస్‌ మిల్లులు ఉండగా.. బాయిల్డ్‌ మిల్లులు 70 ఉన్నాయి. రా రైస్‌ మిల్లులకు ఇబ్బందులు లేకున్నా బాయిల్డ్‌ రైస్‌ కొనకుంటే మిల్లులు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ఈ మిల్లులో రెండు టన్నులు, నాలుగు, అరు టన్నుల మిల్లులు ఉన్నాయి. ఒక్కొక్క మిల్లుపై రూ.6నుంచి 10కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రతి మిల్లులో 50 నుంచి వంద మంది వరకు పని చేస్తున్నారు. వీరే కాకుండా ప్రత్యేక్షంగా, పరోక్షంగా  పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. 2016లో కేంద్రం మొత్తం బాయిల్డ్‌ రైస్‌నే కొనుగోలు చేయగా.. ప్రస్తుతం మొత్తం కొనబోనడం వల్ల పరిశ్రమ దెబ్బతింటుందని రైస్‌ మిల్లు అసోసియేషన్‌ నేతలు వాపోతున్నారు. కేంద్రం దశల వారీగా తగ్గిస్తే మిల్లర్లు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. ఒకేసారి బాయిల్డ్‌ కొనబోనడం వల్ల మిల్లర్లతో పాటు రైతులకు కూడా నష్టం జరగనుందని వాపోతున్నారు. తాము కొనుగోలు చేసినా.. ఎఫ్‌సీఐ కొనుగోలు చేయకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని వారంటున్నారు. బాయిల్డ్‌ బియ్యం తమిళనాడు, కేరళ, బీహార్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా వినియోగించడం వల్ల అమ్మే అవకాశం లేదని రాష్ట్రంతో పాటు ఏపీలోనూ బాయిల్డ్‌ బియ్యం వినియోగం లేనందున మిల్లుల నిర్వహణ కష్టమవుతుందని  వారు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి కొన్ని సంవత్సరాల పాటు కోటా తగ్గించయినా తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.