బిసి విద్యార్థులకు త్వరలో హార్వర్డ్ చదువులు

ABN , First Publish Date - 2022-06-25T21:44:45+05:30 IST

తెలంగాణ బిసి గురుకులాల్లో,హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ చదువులు రానున్నాయి.

బిసి విద్యార్థులకు త్వరలో హార్వర్డ్ చదువులు

హైదరాబాద్: తెలంగాణ బిసి గురుకులాల్లో,హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ చదువులు రానున్నాయి.బిసి సంక్షేమ శాఖ(bc welfare), ఉస్మానియా యునివర్సిటీ(ou), హార్వర్డ్ యూనివర్సిటీ(harward university) సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను శనివారం కలిసి తమ ప్రతిపాదన తెలియజేశారు.వచ్చే ఏడాది జనవరి నుంచి బిసి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా బుర్రా వెంకటేశంకి వారు తెలిపారు. 


బిసి విద్యార్థుల్లో ప్రతిభ ఆధారంగా ముందుగా వంద మందిని గుర్తించి వారికి పదిరోజులపాటు క్లాసులు నిర్వహిస్తామని, ఉన్నత చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడానికి ఈ తరగతులు ఉపయోగపడతాయని వారు వివరించారు.భవిష్యత్ లో వందశాతం స్కాలర్ షిప్ సాధించి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విదేశీ విద్యను అందుకునేందుకు అవసరమైన శిక్షణను ఈ తరగతుల ద్వారా విద్యార్థులకు అవగతం అవుతుందన్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.బిసి విద్యార్థుల కోసం తరగతులను నిర్వహించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీతో కలిసి ముందుకు రావడం అభినందనీయమని ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.


ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలోనే వారికి తెలియచేస్తామని ఆయన చెప్పారు. బిసి విద్యార్థులకు ఉన్నతవిద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.హార్వర్డ్ యూనివర్సిటీ తరగతి గదుల్లోకి మన విద్యార్థులకు ప్రవేశం కల్పించడం ద్వారా ఆ యూనివర్సిటీ చదువుకునే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా  హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావోకి తాను రచించిన అమెజాన్ బెస్ట్ సెల్లర్  “ సెల్ఫీ ఆఫ్ సక్సెస్” పుస్తకాన్ని ఆయన బహుకరించారు. 

Updated Date - 2022-06-25T21:44:45+05:30 IST