మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిన హర్యానా

ABN , First Publish Date - 2022-03-23T00:39:46+05:30 IST

హర్యానా ప్రీవెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వెర్షన్ ఆఫ్ రిలిజయన్ బిల్లు-2022 ప్రకారం.. హర్యానాలోని మైనర్లు, మహిళలు, వ్యక్తులు ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులను బలవంతంగా, మభ్యపెట్టి అయినా మతమార్పిడి చేసినా..

మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిన హర్యానా

చండీగఢ్: మతమార్పిడి నిరోధక బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ బిల్లును రూపొందించాయి. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ బిల్లును రూపొందించింది. అంతే కాదు, మంగళవారం ఈ బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం సైతం తెలిపింది. ఈ బిల్లును నిరసిస్తూ హర్యానా కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాక్ ఔట్ చేసి నిరసన వ్యక్తం చేసింది.


హర్యానా ప్రీవెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వెర్షన్ ఆఫ్ రిలిజయన్ బిల్లు-2022 ప్రకారం.. హర్యానాలోని మైనర్లు, మహిళలు, వ్యక్తులు ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులను బలవంతంగా, మభ్యపెట్టి అయినా మతమార్పిడి చేసినా, అందుకు సహకరించినా నాలుగేళ్లకు తగ్గకుండా (పదేళ్లకు పెంచుకోవచ్చు) జైలు శిక్షతో పాటు, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.


అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు చర్యలపై ఇప్పటికే రాజ్యాంగపరమైన చట్టాలు ఉన్నాయని, మళ్లీ దానికి కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా చరిత్రలో ఈరోజు ‘చీకటి రోజు’గా నిలిచిపోతుందని మరొక కాంగ్రెస్ నేత కిరణ్ చౌదరి విమర్శించారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించి ప్రజల మధ్య పేరుకుపోయిన గోడల్ని బద్దలు కొట్టడానికి బదులు, వాటిని మరింత పటిష్టం చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.


అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ తాము ఏ వర్గాన్ని చిన్నచూపు చూసే దృష్టిలో ఈ బిల్లు తీసుకురాలేదని, అయితే ప్రజల వ్యక్తిగత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బలవంతపు చర్యలను ఆపేందుకు ఈ చట్టం చేశామని స్పష్టం చేశారు. పెళ్లి ద్వారా ఒక మతం నుంచి మరొక మతానికి చాలా మంది బలవంతంగా తమ విశ్వాసాలను మార్చుకుంటున్నారని, దాన్ని అడ్డుకోవాలని ఖట్టర్ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-03-23T00:39:46+05:30 IST