ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం Chautalaకు నాలుగేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-05-27T21:51:37+05:30 IST

న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోకదళ్

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం Chautalaకు నాలుగేళ్ల జైలు

న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోకదళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి వికాస్ ధుల్ ఆదేశించారు. తీర్పు సమయంలో చౌతాలాలో కోర్టురూంలోనే ఉన్నారు. 




హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చౌతాలా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు. 1999 జులై 24 నుంచి 2005 మార్చ్ 5 మధ్య చౌతాలా, ఆయన కుటుంబ సభ్యులు 1,467 కోట్ల రూపాయలు కూడబెట్టడమే కాక, వేల ఎకరాల భూములు కబ్జా చేసినట్లు సీబీఐ గుర్తించి ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. 43 స్థిరాస్థులతో పాటు అక్రమంగా కూడబెట్టిన నగదు, నగల గురించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అనధికారిక లెక్కల ప్రకారం చౌతాలా అక్రమాస్తుల విలువ రూ. 6,09,79,026 ఉండొచ్చని అంచనా వేశారు.  2008 జూన్‌లో 3206 మంది బేసిక్ టీచర్ల అపాయింట్‌మెంట్‌లో చౌతాలాతో పాటు మొత్తం 53 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. చౌతాలా కుమారులైన అభయ్ సింగ్, అజయ్ సింగ్‌లపై కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విడిగా విచారణ జరిపారు. 2013 జనవరిలో ఢిల్లీ న్యాయస్థానం చౌతాలా ఆయన కుమారుడు అజయ్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకుని 2021 జులై 2న చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 




చౌతాలకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ఆయన కుమారుడు అభయ్ చౌతాలా తెలిపారు. 


ఓం ప్రకాశ్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడు. 

Updated Date - 2022-05-27T21:51:37+05:30 IST