సెంట్రల్‌ జీఎస్‌టీ బదులు.. స్టేట్‌ జీఎస్‌టీ చెల్లించారా?

ABN , First Publish Date - 2021-10-24T08:49:45+05:30 IST

జీఎస్‌టీ నియమ నిబంధనల ప్రకారం.. అంతరాష్ట్ర సరఫరా అయితే ఐజీఎస్‌టీ, రాష్ట్ర అంతర్గత సరఫరా అయితే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌ టీ కట్టాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు పొరపాటున ఒక

సెంట్రల్‌ జీఎస్‌టీ బదులు.. స్టేట్‌ జీఎస్‌టీ చెల్లించారా?

జీఎస్‌టీ నియమ నిబంధనల ప్రకారం.. అంతరాష్ట్ర సరఫరా అయితే ఐజీఎస్‌టీ, రాష్ట్ర అంతర్గత సరఫరా అయితే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌ టీ కట్టాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు పొరపాటున ఒక దానికి (హెడ్‌) బదులు మరొక హెడ్‌లో పన్ను చెల్లిస్తే.. దాన్ని సరి చేయటం ఎలాగో తెలుసుకుందాం.


సాధారణంగా పన్ను చెల్లించటానికి సంబంధిత మొత్తాన్ని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) నుంచి చెల్లించవచ్చు. ఒకవేళ ఐటీసీ ఖాతాలో సరిపోను నగదు లేకపోయినా, రివర్స్‌ చార్జీకి సంబంధించిన సరఫరాలు పొందినా పన్ను చెల్లింపును తప్పనిసరిగా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో ఒక చలాన్‌ను తయారు చేసుకుని సంబంధిత పన్ను మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చెల్లించాల్సిన మొత్తం ఏ ట్యాక్స్‌కు సంబంధించినవి అయితే అదే ట్యాక్స్‌ ఖాతాలో వేయాలి. చలాన్‌ ద్వారా సంబంధిత పన్నును నగదు రూపంలో చెల్లిస్తే.. అది తొలుత వ్యాపారస్తుడి క్యాష్‌ లెడ్జర్‌కు జమ అవుతుంది. అక్కడ నుంచి మాత్రమే సంబంధిత పన్ను ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఒక పన్నుకు బదులు మరొక పన్నును చెల్లిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. 


ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు ఐజీఎస్‌టీ రూ.20,000 కట్టే బదులు సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ రూ.10 వేల చొప్పున కట్డాడనుకుందాం. ముం దు చెప్పినట్లు చలాన్‌ ద్వారా చెల్లించిన మొ త్తం తొలుత క్యాష్‌ లెడ్జర్‌లోకి వెళుతుంది. ఆ తర్వాత సంబంధిత రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ‘సెట్‌ ఆఫ్‌’ను ఎంపిక చేసుకున్నప్పుడే క్యాష్‌ లెడ్జర్‌ నుంచి సంబంధిత పన్ను ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ పొరపాటును క్యాష్‌ లెడ్జర్‌ నుంచి సంబంధిత పన్ను ఖాతాకు బదిలీ కావటానికి ముందే గ్రహించాడనుకుందాం. అప్పుడు ఐజీఎస్‌టీలో రూ.20,000 మరలా చెల్లించి పొరపాటున కట్టిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో రిఫండ్‌ ద్వారా వెనక్కు పొందవచ్చు లేదా దీన్ని అలానే ఉంచి తదుపరి నెలల్లో జరిగే విక్రయాలకు చెల్లించవచ్చు. 


అయితే 2020 ఏప్రిల్‌ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం పీఎంటీ-09 అనే ఫారమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే పన్ను చెల్లింపుదారుడు సులభంగా ఒక హెడ్‌ కింద ఉన్న మొత్తాన్ని మరొక హెడ్‌కు మార్చుకోవచ్చు. పైన చెప్పిన విధానాలు ఎలకా్ట్రనిక్‌ క్యాష్‌ లెడ్జర్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను మార్చుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి. అలా కాకుండా ఒకవేళ ఒక హెడ్‌కు బదులు మరొక హెడ్‌కు పన్ను చెల్లించటం అంటే రిటర్న్‌ ఫైల్‌ చేసి క్యాష్‌ లెడ్జర్‌ నుంచి డెబిట్‌ అయ్యిందనుకుందాం. అంటే ఐజీఎస్‌టీ బదులు సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ కట్టడం జరిగింది. అలాంటి సందర్భాల్లో ముందుగా సరైన హెడ్‌ కింద కట్టాల్సిన పన్నును అంటే ఐజీఎస్‌టీ కింద రూ.20,000 కట్టిన తర్వాత సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీలో పొరపాటున కట్టిన పన్నును రిఫండ్‌ రూపంలో వెనక్కు తీసుకోవచ్చు. అయితే ఈ రిఫండ్‌కు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇటీవల అంటే సెప్టెంబరు 24న ప్రకటించింది. దీని ప్రకారం సంబంధిత రిఫండ్‌ అప్లికేషన్‌ దాఖలు చేయటానికి గడువు, సరైన పన్నును చెల్లించిన తర్వాత నుంచి రెండేళ్లలోపు అంటే ఐజీఎస్‌టీ కింద రూ.20 వేలు కట్టిన తేదీ నుంచి రెండేళ్లలోపు లేదా 2021 సెప్టెంబరు 24 నుంచి రెండేళ్లలోపు ఏది వెనకైతే ఆ తేదీ.

Updated Date - 2021-10-24T08:49:45+05:30 IST