హస్తం గూటికి తాటి

ABN , First Publish Date - 2022-06-25T05:53:28+05:30 IST

ఇటీవల టీఆర్‌ఎస్‌ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధిక్కార స్వరం వినిపించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హస్తం పార్టీ గూటికి చేరారు

హస్తం గూటికి తాటి

టీపీపీసీ అధ్యక్షుడు రేవంత సమక్షంలో చేరిన ‘పేట’ మాజీ ఎమ్మెల్యే

కరకగూడెం జడ్పీటీసీ, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కూడా..

మారనున్న అశ్వారావుపేట రాజకీయ సమీకరణలు

అశ్వారావుపేట /కరకగూడెం, జూన్‌ 24: ఇటీవల టీఆర్‌ఎస్‌ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధిక్కార స్వరం వినిపించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హస్తం పార్టీ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు, అశ్వారావుపేటకు చెందిన సుంకవల్లి వీరభద్రరావు, మాజీ జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్‌లు పొట్టా రాజులు, కారం ఎర్రయ్య, ములకలపల్లికి చెందిన తాండ్ర బుచ్చిబాబు, దమ్మపేట మండలానికి చెందిన రాంబాబు, అన్నపురెడ్డిపల్లికి చెందిన నాగరాజు, రవి, చంద్రుగొండకు చెందిన కృపాకర్‌తో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడిన తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరడంతో అశ్వారావుపేట నియోజకవర్గ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఈ పరిణామం.. ఇప్పటికే అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో కొంత ఆందోళన కలిగిస్తుండగా.. తాటి, ఆయన అనుచరుల చేరితో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రానుందని, తనతో పాటు మండలం నుంచి మరో 100మంది కాంగ్రెస్‌లో చేరారన్నారు. 

Updated Date - 2022-06-25T05:53:28+05:30 IST