హస్తినలో కెసిఆర్‌ కుప్పిగెంతులు

ABN , First Publish Date - 2022-05-24T06:23:08+05:30 IST

కేంద్రంలో గత ఎనిమిదేళ్ల కాలంలో రాజకీయ అస్థిరతా పరిస్థితులు ఎప్పుడైనా కనిపించాయా? 2జీ, బొగ్గుగనుల కేటాయింపులు, కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన వేల కోట్ల రూపాయల కుంభకోణాలు...

హస్తినలో కెసిఆర్‌ కుప్పిగెంతులు

కేంద్రంలో గత ఎనిమిదేళ్ల కాలంలో రాజకీయ అస్థిరతా పరిస్థితులు ఎప్పుడైనా కనిపించాయా? 2జీ, బొగ్గుగనుల కేటాయింపులు, కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఇప్పుడెక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడ చూసినా కొడుకులు, కూతుళ్లు, భార్యలు, బంధువులు రాజ్యమేలే కంపుగొట్టే వారసత్వ ఛాయలు ఎక్కడైనా మనకు గోచరిస్తున్నాయా? ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టులు, రహదార్లు, జాతీయ కారిడార్లు అభివృద్ది అయిన దాఖలాలు ఎనిమిదేళ్ల క్రితం ఎప్పుడైనా ఉన్నాయా? కోట్లాది సామాన్యులకు, మహిళలకు, రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి లక్షల కోట్లు ఎలాంటి మధ్య దళారీల ప్రమేయం లేకుండా బదిలీ అయిన ఉదంతాలను గతంలో మనం చూశామా? దేశంలోనూ, విదేశాల్లోనూ భారతదేశ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రతి భారతీయుడూ సగర్వంగా చెప్పుకోగల పరిస్థితులు ఇదివరకు ఎప్పుడైనా మనం చూడగలిగామా? ఎనిమిదేళ్ల క్రితం నిత్యం విచ్ఛిన్న కార్యకలాపాలకు పాల్పడే సంఘ విద్రోహ, ఉగ్రవాద శక్తులు ఇప్పుడు ఎక్కడైనా తచ్చాడుతున్నాయా? ప్రజలతో నిత్యం సజీవ సంబంధాలు పెట్టుకుంటూ రకరకాల కార్యక్రమాల ద్వారా కోట్లాది ప్రజలతో సంభాషించే ప్రధానమంత్రి గతంలో ఎప్పుడైనా ఉన్నారా? తనకంటూ ఒక కుటుంబం లేక, అక్రమ సంపాదనకు పాల్పడాల్సిన ఏ అవసరమూ లేక అహోరాత్రాలు నిత్యం పనిచేసే ప్రధానమంత్రి గతంలో ఎప్పుడైనా మనకు కనిపించారా? ఈ ఎనిమిదేళ్లలో ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరుగా నరేంద్రమోదీ ఎందుకు గుర్తింపు పొందగలిగారు?


త్వరలో తన ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్వితీయ విజయాల గురించి ఎంత చెప్పినా సరిపోదు. దేశంలో సమతుల్య అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, సామాజిక భద్రతకు ఈ ఎనిమిదేళ్లు అంకితం చేశామని గత వారం జైపూర్‌లో బిజెపి ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధానమంత్రి ఒక్క మాటలో చెప్పారు. సుపరిపాలన ద్వారా ప్రజా సంక్షేమం ఏ విధంగా సాధించవచ్చునో ఆయన నిరూపించారు. చిన్న రైతులు, కష్టించే శ్రమజీవులు, మధ్య తరగతి ఆకాంక్షలను సఫలీకృతం చేసే దిశలో ఏ విధంగా పనిచేయవచ్చునో ఆయన నిరూపించారు. బలహీనవర్గాలు, మహిళా సాధికారిత కోసం, స్వచ్ఛ మైన భారతదేశం కోసం, నిర్మాణాత్మకమైన కార్యకలాపాల కోసం ఏ విధంగా కృషిచేయవచ్చు అన్నదానికి ఆయన ఉదాహరణగా నిలిచారు. నరేంద్ర మోదీ ఎప్పుడూ వెనుకంజ వేసే నాయకుడు కాదు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మరో పాతికేళ్లలో ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేయాలో అన్నదానికి ఆయన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన లక్ష్యాలను నిర్దేశించుకుని వచ్చే పాతికేళ్లు నిరంతరం పనిచేయాలని ఆయన జైపూర్ సమావేశంలో పిలుపునిచ్చారు.


పనిచేయడమంటే ఏమిటి? రాజకీయ అధికారం కోసం ప్రాముఖ్యం ఇవ్వడం కన్నా ప్రజలకు సేవభావంతో పనిచేయడమే ముఖ్యమని మోదీ విశ్వసిస్తారు. కరోనా మహమ్మారి సమయంలో, ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా సేవ చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన చెప్పారు. రాజకీయ కార్యకర్తలుగా కాకుండా ఎన్జీవో సేవకులుగా పనిచేయాలని ఆయన కోరారు. తనను తాను ప్రధానమంత్రిగా కాకుండా ప్రధాన సేవకుడుగా భావించిన ఏకైక రాజకీయ నాయకుడు మోదీయే. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మే ఒక సామాన్యుడి స్థాయి నుంచి పేదరికాన్ని తట్టుకుంటూ తాను ఎదిగిన వైనాన్ని ఆయన ఎప్పుడూ చెప్పేది అందుకే. తనను సేవ చేసే నేతగా చిత్రించాలని కార్యకర్తలను మోదీ ఎప్పుడూ కోరుతుంటారు. ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలు, ఆశయాల గురించి వివరించేందుకు కేంద్ర మంత్రులను, సీనియర్ నేతలను కూడా ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లమని ఆయన కోరారు. సంక్షేమపథకాల ప్రయోజనాలను పొందిన లబ్ధిదారులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయమని ఆయన నిర్దేశించారు. వారి వల్లే బిజెపి అధికారంలోకి రాగలుగుతుందనేది ఆయన ప్రగాఢ నమ్మకం.


మోదీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఏమి చేసిందో, ఏమి చేయబోతున్నదో వివరించే ఒక రిపోర్టు కార్డును విడుదల చేసేందుకు పార్టీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. మోదీ ఎనిమిదేళ్ల పాలన ముందు ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా వెలవెలబోతుందో ఈ రిపోర్టు కార్డు వెల్లడిస్తుంది. ఈ ఎనిమిదేళ్లలో పేదరికం ఏ విధంగా క్షీణించిందో, దేశంలో కొత్త అభివృద్ధి రాజకీయాలకు ఏ విధంగా స్థానం లభించిందో, కుల, వారసత్వ, ప్రాంతీయ రాజకీయాలకు ఏ విధంగా కాలం చెల్లిందో కూడా వివరించేందుకు బిజెపి సన్నద్ధంగా ఉన్నది.


తెలంగాణలో కాళ్ల క్రింద నేల జారిపోతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవడం కోసం ఢిల్లీకి వచ్చారు! రైతులపై కపట ప్రేమను ఒలికిస్తూ పంజాబ్‌లో ఉపన్యాసాలు చేయడం కూడా బిజెపిపై దుష్ప్రచారం చేసి తన పబ్బం గడుపుకోవడానికే అన్న విషయం స్పష్టమవుతోంది. గత ఎనిమిది సంవత్సరాలుగా బిజెపిపై కాంగ్రెస్ ఎన్ని దుష్ప్రచారాలు చేసిందో, ఎన్ని అభాండాలు వేసిందో కెసిఆర్‌కు తెలియనిది కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు సాధ్యం కానిది కెసిఆర్‌కు సాధ్యమవుతుందా? ఉత్తర ప్రదేశ్ వంటి 80 లోక్‌సభ స్థానాలున్న పెద్ద రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ బిజెపిని ఓడించడానికి ఎంత విఫలయత్నం చేసిందో కెసిఆర్‌కు తెలియనిది కాదు. యూపిలో మూడోవంతు సీట్లు కూడా లేని తెలంగాణ నుంచి ఒక నేత జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కొనేందుకు పోరాడాలని పిలుపునిస్తే జనం ప్రతిస్పందిస్తారనుకోవడం హాస్యాస్పదం. అంతేకాదు, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి తాండవిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువుల పాలన నడుస్తోంది. అప్పులు చేయడంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఇటీవల ఒక సర్వే తేల్చింది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ తదితర సౌకర్యాల క్రింద తెలంగాణ, ఏపీతో పోటీ పడి అప్పులు తీసుకుంటోంది. తెలంగాణ ప్రత్యేక ఆర్థిక కార్యదర్శి అప్పులకోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వంత జిల్లాలో రైతులు అప్పులు చెల్లించలేక పురుగుల మందులు త్రాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంచాయితీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, కూలీలకు కూడా ఐదు నెలలుగా డబ్బులు ఇవ్వలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. ఉద్యోగులకు నెలసరి జీతాలు కూడా అందడం లేదు. తెలంగాణలో ఒక అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తూ దేశ రాజధానికి వచ్చి ప్రధాని మోదీని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మివేసిన చందంగానే ఉంటుంది. కెసిఆర్ వైఖరి చూస్తుంటే జాతీయ రాజకీయాల పేరుతో ఢిల్లీకి వచ్చి రాష్ట్రంలో తన వారసుడికి అధికారం అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనపడుతోంది. అయితే తెలంగాణలో బిజెపికి అధికారం అప్పజెప్పేందుకు కూడా కెసిఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఏతావాతా కెసిఆర్ భవిష్యత్తు రెంట చెడ్డ రేవడిలా మారడం ఖాయం.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-05-24T06:23:08+05:30 IST