ఇవి అమెరికా ఆత్మపై ఓ మచ్చలా మిగిలిపోతున్నాయి: అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-05-17T00:09:32+05:30 IST

అమెరికాలో తరచూ జరుగుతున్న ద్వేషపూరిత దాడులను నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిధులను వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సూచించారు.

ఇవి అమెరికా ఆత్మపై ఓ మచ్చలా మిగిలిపోతున్నాయి: అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: అమెరికాలో తరచూ జరుగుతున్న ద్వేషపూరిత దాడులను నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిధులను వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సంస్మరణార్థం జరుపుకునే పీస్ ఆఫీసర్స్ మెమోరియల్ డే సభలో ఆదివారం బైడెన్ ప్రసంగిస్తూ ఈ సూచన చేశారు. అంతేకాకుండా.. ఈ ద్వేషం అమెరికా ఆత్మపై ఓ మచ్చలా మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


న్యూయార్క్‌లోని  బఫెలో ప్రాంతంలో ఓ శ్వేతజాతీయుడు ఇటీవల కాల్పులకు తెగబడడంతో 10 మంది మృతి చెందగా.. ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. బాధితుల్లో అధిక శాతం నల్లజాతివారే కావడంతో ఇది ద్వేషపూరిత దాడి అయి ఉండొచ్చని అమెరికా ఫెడరల్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిధులను వినియోగించడం ద్వారా పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడే.. ఈ ఎండాకాలంలోనే  నిధులను సద్వినియోగం చేయండి. నేరాల సంఖ్య ఈ సమయాల్లో పెరుగుతుందన్నది తెలిసిందేకదా.. ’ అని బైడెన్ పేర్కొన్నారు. 


 కాగా.. 2021లో విధినిర్వహణలో నేలకొరిగిన 129 మంది పోలీసు అధికారులకు ఈ సందర్భంగా బైడెన్ నివాళులు అర్పించారు. అమెరికా నేరదర్యాప్తు శాఖ ఎఫ్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2021లో వివిధ ప్రమాదాల కారణంగా 56 మంది పోలీసులు మరణించగా..క్రిమినల్ నేరాల కారణంగా మరో 73 మంది అసువులు బాసారు. ఇక.. చట్టాల అమలలో పోలీసులకు సహాయకారిగా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ ‘అమెరికా రెస్క్యూ ప్లాన్’ పేరిట.. 350 బిలియన్ డాలర్లను కేటాయించింది. ముఖ్యంగా పోలీసుల తన ఉద్యోగాల్లో కొనసాగేలా ప్రోత్సహించేందుకు ఈ నిధులు విడుదల చేసింది. 



Updated Date - 2022-05-17T00:09:32+05:30 IST