ఖాదిమ్‌ల విద్వేష వ్యాఖ్యల ఫలితం.. అజ్మీర్ దర్గా వైపు చూడని భక్తులు

ABN , First Publish Date - 2022-07-10T01:40:14+05:30 IST

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ గత నెలలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఆమె

ఖాదిమ్‌ల విద్వేష వ్యాఖ్యల ఫలితం.. అజ్మీర్ దర్గా వైపు చూడని భక్తులు

జైపూర్: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ గత నెలలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ అజ్మీర్ దర్గాకు చెందిన ముగ్గురు ఖాదిమ్‌లు చేసిన హింసాత్మక నినాదాల ప్రభావం భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే దారులు ఇప్పుడు బోసిపోసి కనిపిస్తున్నాయి.


సాధారణంగా ప్రతి శుక్రవారం అజ్మీర్ దర్గా  కిక్కిరిసిపోతుంది. భక్తులతో కోలహాలంగా ఉంటుంది. అలాంటిది ఈ శుక్రవారం మాత్రం ఈ సూఫీ మందిరం బోసిపోయి కనిపించింది. అతి కొద్దిమంది మాత్రమే దర్గాను దర్శించుకున్నారు. అంతేకాదు, దర్గాను దర్శించుకోవాలనుకుని ముందుగా హోటళ్లు, రిసార్ట్‌లను బుక్ చేసుకున్న వారు తర్వాత వాటిని రద్దు చేసుకున్నారు. హోటళ్లు కానీ, బస్సులు ఇతరత్రా ప్రయాణికులను చేరవేసే వాహనాలు కానీ గతంతో పోలిస్తే పదిశాతం ఆదాయాన్ని కూడా ఆర్జించలేకపోయాయి.


ప్రతి శుక్రవారం రోజు అజ్మీర్ కిక్కిరిసిపోతుందని, కానీ ఇప్పుడు మాత్రం వెలవెలబోతోందని ఖాదిమ్ సయ్యద్ ఐనుద్దీన్ చిస్తీ పేర్కొన్నారు. ప్రతి రోజు 15 నుంచి 20 వేల మంది భక్తులు దర్వించుకుని వెళ్లేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. వారి వల్ల ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగేదని పేర్కొన్నారు. దర్గా బజార్, ఢిల్లీ గేట్, డిగ్గీ బజార్‌లోని రిసార్ట్‌లు, ఖాదీం మొహల్లా, కమ్మాని గేట్, అందర్ కోటే, లఖన్ కోట్రీలలోని రిసార్డులు ఇప్పుడు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఈ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం భక్తుల నుంచి నేరుగా జీవనోపాధి పొందుతుంది.


దర్గా స్థలంలోని జన్నత్ గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ యజమాని రియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ద్వేషపూరిత ప్రసంగాల ప్రభావం భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ ఘటన జరిగిన వెంటనే కేన్సిలేషన్లు ప్రారంభమైనట్టు చెప్పారు. 'ఛతీ' (చంద్ర క్యాలెండర్‌లోని ఆరో రోజు) శుభదినమైనా రిసార్టులు నిండలేదని ఖాన్ పేర్కొన్నారు. స్థూల అమ్మకాలు 90 శాతం పడిపోయాయని ఖావాజా ఘరీబ్ నవాజ్ స్వీట్స్ యజమాని షాదాబ్ సిద్దిఖీ ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-07-10T01:40:14+05:30 IST