కుల పెద్దరికం కోసమే హత్య

ABN , First Publish Date - 2020-12-04T05:01:43+05:30 IST

విందు వివాదంలో యువకుడి హత్య కుల పెద్దరికం కోసమేనని పోలీసుల విచారణలో తేలింది.

కుల పెద్దరికం కోసమే హత్య
భువనగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ కె.నారాయణరెడ్డి

విందు వివాదం కేసులో మరో కోణం

ముగ్గురు నిందితుల అరెస్టు

యాదాద్రి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విందు వివాదంలో యువకుడి హత్య కుల పెద్దరికం కోసమేనని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో రాచకొండ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన సూరారం చంద్రయ్య దశాబ్ద కాలంగా తమ సామాజిక వర్గపు కుల పెద్దగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన స్థానంలో సూరారం వెంకటయ్యను కులపెద్దగా చేయాలని ఇరు కుటుంబాల మధ్య ఏడాది క్రితం పంచాయితీ నిర్వహించారు. తమ డిమాండ్‌ నెరవేరకపోవటంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తమ కుటుంబానికి కుల పెద్దరికం దక్కాలంటే ప్రస్తుత కులపెద్ద చంద్రయ్యను లేదా వారి కుటుంబ సభ్యులను హతమార్చాలని వెంకటయ్య కుటుంబీకులు నిర్ణయించారు. ఈ ప్రణాళిక అమలుకోసం ఈ నెల 1వ తేదీన జరిగిన బంధువు తాటిపాముల మహేష్‌ పెళ్లిని అవకాశంగా చేసుకున్నారు. సురారం ప్రవీణ్‌, సూరారం వెంకటయ్య, సూరారం వెంకటమ్మ, మరో నలుగురు కలిసి సూరారం చంద్రయ్య కుటుంబీకులతో వివాహ విందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామం వెళ్లారు. అక్కడ తమకు సరైన మర్యాద జరగలేదని, కుల పెద్దగా ఏం చేస్తున్నావంటూ చంద్రయ్యతో వెంకటయ్య కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు. గ్రామానికి తిరిగివచ్చిన అనంతరం అదే రోజు రాత్రి ఇదే విషయమై చంద్రయ్యతో మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ వివాదంలో కులపెద్ద చంద్రయ్య చిన్న కుమారుడు సురారం పరశురాములు(26)పై సురారం ప్రవీణ్‌ గొడ్డలితో దాడిచేశాడు. పక్కనే గల సురారం నాగరాజు, సూరారం చిన లక్ష్మయ్యలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో మోత్కూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. పరుశురాములు అదేరోజు రాత్రి మృతిచెందగా; నాగరాజు, చినలక్ష్మయ్యకు ప్రాణాపాయం తప్పింది. మృతుడి సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. గొడ్డలితో దాడిచేసి ఒకరి హత్య, ఇరువురిని గాయపరిచిన ఏడుగురు నిందితుల్లో సూరారం ప్రవీణ్‌, సూరారం వెంకటయ్య, సూరారం వెంకటమ్మలను గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో నలుగురు నిందితులు సూరారం కృష్ణ, సూరారం యాదమ్మ, సూరారం అనిల్‌, చిల్లర రమేష్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ పి.సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, మోత్కూర్‌ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:01:43+05:30 IST