
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన (గవర్నర్) ఎవరినీ లెక్క చేయడం లేదని, అందరినీ బెదిరిస్తున్నారని పేర్కొన్న మమత.. ఆయనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పలుమార్లు లేఖలు రాసినట్టు చెప్పారు. తాను స్వయంగా వెళ్లి కూడా మాట్లాడానని పేర్కొన్నారు.
గవర్నర్ తీరుతో గత ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పంపిన ప్రతి ఫైలు పెండింగులో పెడుతున్నారని, విధాన నిర్ణయాలపై ఆయనెలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి నాలుగు ఉత్తరాలు కూడా రాసినట్టు తెలిపారు.
అలాగే, గవర్నర్ ధన్ఖర్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మమత ఆరోపించారు. పెగాసస్ స్పై వేర్ను ఉపయోగించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ ఆరోపించిన 24 గంటలలోపే మమత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి