మిషన్‌ భగీరథ సమస్యలు పట్టవా?

ABN , First Publish Date - 2022-09-24T06:03:20+05:30 IST

మిషన్‌భగీరథ నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు పనుల్లో అధికారుల తీరుపై సభ్యులు ఽమండిపడ్డారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా సముదాయ భవనంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

మిషన్‌ భగీరథ సమస్యలు పట్టవా?
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

- నీటి సరఫరాలో ఇబ్బందులు  

- మురికి కాలువలు లేకుండా సీసీ రోడ్లు

- చేపల పంపిణీలో ప్రజాప్రతినిధులకు పిలుపేది? 

- అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం 

-  జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మిషన్‌భగీరథ నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు పనుల్లో  అధికారుల తీరుపై సభ్యులు ఽమండిపడ్డారు.  పలు   సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి  ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా సముదాయ భవనంలో  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.  వివిధ  శాఖల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 359 అవాసాలకు వంద శాతం మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తామని,  620 ట్యాంక్‌లకు 606 ట్యాంక్‌లకు నీటి సరఫరా ఉందని నివేదికలు అందించిన అఽధికారులపై  సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మండలంలోని చాలా గ్రామాలకు నీరు అందడం లేదని 70 శాతం కూడా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న తీరును ప్రశ్నించారు. రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ   మండల కేంద్రంతోపాటు మానాల గ్రామ పంచాయతీల సముదాయంలో మిషన్‌భగీరథ నీటి సమస్యలు ఉన్నాయని అన్నారు. మానాలలో పాఠశాలలకు నీళ్లు రావడం లేదని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుద్రంగిలో వర్షపు నీరు పట్టుకొని  అవసరాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రతీసారి మీటింగ్‌లో చెప్పలేక పోతున్నామన్నారు. రుద్రంగిలో పైపులైన్‌ సమస్య ఉందన్నారు. రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ రుద్రంగిలో చాలా చోట్ల సమస్యలు ఉన్నాయన్నారు. జడ్పీ కో ఆప్షన్‌సభ్యుడు చాంద్‌పాషా మాట్లాడుతూ వీర్నపల్లిలో బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో మురికినీరు వస్తోందని, మహిళలు మురికి నీటి బిందెలతో రోడ్దు మీదికి వచ్చారని తెలిపారు.  అనంతరం  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకం చేపట్టిందని, క్షేత్ర స్థాయిలో మిషన్‌భగీరథ నీటి సరఫరాను పరిశీలించాలని అన్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతు చేయాలన్నారు. మరోసారి మిషన్‌భగీరథపై ఫిర్యాదులు వస్తే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ మాట్లాడుతూ సబ్సిడీ రుణాలపై డెయిరీ ఫాంలు ఏర్పాటు చేసుకోవడంలో బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బ్యాంకుల వాళ్లు అంగీకరించకపోవడంతో డెయిరీలను విస్తరించుకోలేక పోతున్నామన్నారు. ధర్మారంలో దళితులకు వంద ఎకరాల వరకు స్థలాలు ఇచ్చామని రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే వినయోగంలోకి భూమి వస్తుందని తెలిపారు. డెయిరీ ఫాంలు కూడా విస్తరించుకుంటారన్నారు. స్పందించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బ్యాంకర్లతో మాట్లాడుతామన్నారు. డెయిరీ రంగాన్ని విస్తరించుకునే అవకాశాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయన్నారు. జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఏటా చెరువుల్లో చేపపిల్లలు వేస్తున్నారని, ప్రజాప్రతినిధులను ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ వర్షాలకు గ్రామాల్లో రోడ్డు కిరువైపులా కోతకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండలంలోని మూడు గ్రామాల్లో బస్సులు పడిపోయే పరిస్థితి కూడా ఉందని అన్నారు. రోడ్ల మరమ్మతు చేపట్టాలన్నారు. వేములవాడ రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ మురికి కాలువలు లేకుండానే సీసీ రోడ్లు వేయడంతో వర్షాలకు నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారన్నారు. బాలరాజుపల్లెలో పాఠశాలలకు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుద్రంగి ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణంలో కచ్చితంగా ప్రమాణాలు పాటించాలన్నారు. కొన్ని చోట్ల మురికి కాలువలు నిర్మాణం సరిగా లేదన్నారు. అవసరం లేని చోట పనులు చేపట్టడంతో డబ్బులు కూడా వృథా అవుతు న్నాయన్నారు. పంచాయతీ రాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌ నిబంధనలుపాటించే విధంగా ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలం చింతల్‌ఠాణా రోడ్డు ఎప్పుడూ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణానికి రూ.2.61 కోట్లు మంజూరై టెండర్లు పిలిచే దశలో ఆక్వాహబ్‌ వాళ్లు డబుల్‌ లేన్‌ రోడ్డు సర్వే చేశారని అందువల్లనే టెండర్లు నిలిపివేశామని అన్నారు. ఆక్వాహబ్‌లో రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు.  పీఆర్‌ ఈఈ సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు సంబంధించి 62 ప్రతిపాదనలు జిల్లా నుంచి పంపించామన్నారు. డీఈవో రాదాకిషన్‌  ప్రగతి నివేదిక అందిస్తూ జిల్లాలో 172 పాఠశాలలు ‘మన ఊరు- మనబడి’ ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు.  మొదటి విడతలో 3.10 లక్షల పాఠ్యపుస్తకాలు, 48,806 మంది విద్యార్థులకు ఒక జత  యూనిఫాం అందించినట్లు చెప్పారు. రెండో విడత దసరా సెలవుల తర్వాత అందిస్తామన్నారు.  మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆగస్టు  వరకు బిల్లులు వచ్చినట్లు తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల బిల్లులు వెంట వెంటనే చెల్లించాలన్నారు. వారికి  గౌరవ వేతనం తక్కువగానే ఇస్తున్నామని గుర్తు చేశారు. రుద్రంగి  ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ రుద్రంగి పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ మూత్ర శాలల నిర్మాణంలో అధునాతన పద్ధతులు వచ్చాయని, పాఠశాలలకు పరిశీలించి మూత్ర శాలలు నిర్మించాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, 60 శాతం వరకు ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రజాప్రతినిధులు సహకారించాలని కోరారు. వేములవాడ రూరల్‌ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ వర్షాలకు పంట నష్టం వాటిల్లిందని ఎంతవరకు నివేదికలు తయారు చేశారని ప్రశ్నించారు. జిల్లా వ్యవసాయ అఽధికారి రణధీర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని,   వరి అధికంగా 1.77 లక్షల ఎకరాలు, పత్తి 54 వేల ఎకరాల్లో సాగు చేశారని అన్నారు. వర్షాలకు నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక తయారు చేశామన్నారు. 33 శాతం దాటితేనే పరిగణలోకి తీసుకునే నిబంధన ఉందని వివరించారు. వేములవాడ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ గొర్రెల పాకలపై రైతులకు అవగాహన కల్పించాలని, బిల్లులు రావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. 


ప్రజాఫిర్యాదులపై స్పందించాలి

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

ప్రజా సమస్యలు, ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అధికారులకు సూచించారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను అహ్వానించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.  క్షేత్ర స్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు ప్రతీ గడపకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 

 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై దృష్టి సారించాలి

- వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు

వ్యవసాయ సంప్రాదాయ పద్ధతుల నుంచి బయటపడి వ్యవసాయ అనుబంధ రంగాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. గతంలోని ప్రభుత్వాల హాయంలో లక్ష రూపాయల రుణం పొందాలంటే లబ్ధిదారులు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహకారం అందుతుందన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా బారీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మిడ్‌ మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారంపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించి రూ.29 కోట్లు పెండింగ్‌ పరిహారం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. 200 మందికి పట్టాలు ఇవ్వడం సంతోషకరమన్నారు. వేములవాడ పట్టణానికి సమీపంలో రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఎథనాల్‌ పరిశ్రమ స్థాపనకు మంత్రి కేటీఆర్‌ చొరవ చూపారని, దీని ద్వారా 1200 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని అన్నారు. తెలంగాణలో నీళ్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌ స్థిరీకరణ అయ్యిందన్నారు. ఆరోగ్య వ్యవస్థలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ముందంజలో ఉండడం  గర్వకారణమన్నారు. కార్మిక క్షేత్రం సిరిసిల్ల, ధార్మిక క్షేత్రం వేములవాడ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అనేక చిక్కుముడులతో కూడిన పోడు భూముల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సాహాసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిజమైన అర్హులకు పోడు భూములపై హక్కులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. సిరిసిల్ల సెస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సెస్‌కు రూ.200 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, వాటి రికవరీకి సహకరించాలని కోరారు. జిల్లాలో పాడి అభివృద్ధికి యూనిట్లను మంజూరు చేయాలన్నారు. 

  దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరించాలి

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

వర్షాలతో దెబ్బతిన్న అన్ని రోడ్లను అక్టోబరు తరువాత పునరుద్ధరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. ప్రగతిలో ఉన్న చెక్‌డ్యాంలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. పోడు భూములకు సంబంధించి హక్కులు కల్పించడానికి ఏడు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులపై  మండల, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. మిషన్‌భగీరథ అధికారులు, ప్రతీ వారం మండలంలోని అన్ని గ్రామాలు తిరిగేలా కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలో మినీఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు 35 శాతం రాయితీ ఇస్తుందని వ్యక్తులుగా, సమూహాలుగా యూనిట్ల స్థాపన చేసుకోవచ్చన్నారు. ఈ సంవత్సరం జిల్లా లక్ష్యం రూ.15 కోట్లు ఉన్నందున ముందుకు వచ్చిన వారికి పథకం అందజేస్తామన్నారు. రాజన్న సిరిసిల్లను పోషణ లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ నెలలో పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా మిల్లెట్స్‌ఫుడ్‌  ఫెస్టివల్‌ కార్యక్రమం చేపట్టిందన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా పారిశుధ్యం, డ్రైడే కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. డెంగ్యూ వంటివి ప్రబలకుండా చూసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడిన తగిన చికిత్స తీసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు.

దివ్యాంగుడికి ట్రై మోటార్‌ సైకిల్‌ పంపిణీ

జిల్లాలోని దివ్యాంగుడికి ట్రై మోటార్‌ సైకిల్‌ను శుక్రవారం  కలెక్టరేట్‌ ఆవరణలో ప్రతినిఽధులు అందజేశారు. దివ్యాంగుల సహాయ ఉపకరణల పథకంలో భాగంగా మోటార్‌ సైకిల్‌ను అందించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య,  జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. 


సమస్యలను అవగతం చేసుకొని రావాలి 

- పవర్‌లూం టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ 

చట్ట సభల్లో చర్చల కంటే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో జరిగే చర్చల్లో నాణ్యత ఉంటే దేశం ప్రగతి బాటన పయనిస్తుందని పవర్‌లూం టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు. ప్రజాప్రతినిధులు సమావేశాలకు వచ్చే ముందు క్షేత్ర స్థాయిలో సమస్యలను అవగతం చేసుకొని సంసిద్ధమై వస్తే అధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించే వీలు కలుగుతుందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలను అద్భుత వేదికలుగా ఉపయోగించుకోని ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలన్నారు. 


Updated Date - 2022-09-24T06:03:20+05:30 IST