మాకు దాపరికాలు లేవు, చట్టానికి కట్టుబడే పార్టీ మాది: Congress

ABN , First Publish Date - 2022-06-08T23:21:51+05:30 IST

కాంగ్రెస్ పార్టీ చట్టానికి కట్టుబడి ఉంటే పార్టీ అని, దర్యాప్తు సంస్థల వద్ద తమ నేతలు దాచిపెట్టేది ఏమీ లేదని ..

మాకు దాపరికాలు లేవు, చట్టానికి కట్టుబడే పార్టీ మాది: Congress

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చట్టానికి కట్టుబడి ఉంటే పార్టీ అని, తమ నేతలకు ఎలాంటి దాపరికాలు లేవని , ఈడీ ముందు దాచిపెట్టేదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ ముందు తమ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పింది. తమను చూసి బీజేపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలని చురకలు వేసింది. నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ డీల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీని ఈడీ కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా స్పందించింది.


కరోనా పాజిటివ్ నుంచి తాను ఇంకా కోలుకోలేదని, మరికొంత గడువు ఇవ్వాలని దర్యాప్తు సంస్థను సోనియాగాంధీ కోరారు. రాహుల్ గాంధీకి సైతం ఈడీ సమన్లు పంపింది. ఈనెల 13న ఆయన ఈడీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి ముందు జూన్ 2న తమ ముందు హాజరుకావాలని రాహుల్‌ను ఈడీ కోరగా, తాను విదేశాల్లో ఉన్నందున మరింత సమయం కావాలని ఈడీకి ఆయన సమాచారం ఇచ్చారు.


తాజా పరిణామాలపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ...''మాది చట్టానికి కట్టుబడే పార్టీ. మేము నిబంధనలను పాటిస్తాం. సమన్లు పంపితే వెళ్తాం. దాచి పెట్టేందుకు ఏమీ లేదు. మేము వాళ్లలా (బీజేపీ) కాదు. 2002 నుంచి 2013 వరకూ అమిత్‌షా చక్కర్లు కొడుతూ  వచ్చిన విషయం మాకు గుర్తుంది. సత్యపథాన్ని అనుసరించే వ్యక్తులు ఏవిధంగా ఉంటారో మమ్మల్ని చూసి వాళ్లు (బీజేపీ నేతలు) నేర్చుకోవాలి'' అని ఖేరా అన్నారు. కాగా, సోమవారంనాడు ఈడీ కార్యాలయం ముందు రాహుల్ గాంధీ హాజరు కానున్నందున దీనినొక 'బిట్ ఈవెంట్‌'గా కాంగ్రెస్ మలిచే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2022-06-08T23:21:51+05:30 IST