గంజాయి తాగారా.. మత్తులో ఉన్నారా?

ABN , First Publish Date - 2022-05-26T09:08:53+05:30 IST

‘‘కోనసీమలోని శెట్టి బలిజల్లో అంబేడ్కర్‌ పేరును సహించలేని ఒక కొత్తతరం వచ్చిందా! మంత్రి ఇంటిని తగలబెట్టే సాహసమా? ఇది స్పహలో ఉండి చేయలేదు.

గంజాయి తాగారా.. మత్తులో ఉన్నారా?

  • శెట్టి బలిజల్లో అంబేడ్కర్‌ను సహించలేని తరం వచ్చిందా?
  • మంత్రి ఇంటిని తగలబెట్టే దుస్సాహసమా?
  • అంబేడ్కర్‌ ఇచ్చిన ఫలాలు అనుభవిస్తూ.. 
  • ఆయననే వ్యతిరేకించడమా?
  • కోనసీమలో ఇలా తయారైన దరిద్రులు
  • ప్రభుత్వ సలహాదారు జూపూడి ధ్వజం


విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘‘కోనసీమలోని శెట్టి బలిజల్లో అంబేడ్కర్‌ పేరును సహించలేని ఒక కొత్తతరం వచ్చిందా! మంత్రి ఇంటిని తగలబెట్టే సాహసమా? ఇది స్పహలో ఉండి చేయలేదు. గంజాయైునా తాగి ఉండాలి. లేదా... ఎవరైనా మందు తాగించి ఉండాలి’’ అని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోనసీమ అల్లర్లపై స్పందించారు. ‘‘చైతన్యవంతమైన ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళనకరం. శెట్టి బలిజలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారు. ఇద్దరూ బ్రహ్మాండంగా కలిసి ఉంటారు. ఎన్నికల్లో ఒక్కటవుతారు. అవతలి వారిని వ్యతిరేకించేందుకు వైస్సార్సీపీగా తయారవుతారు. కానీ... కోనసీమలోని శెట్టి బలిజల్లో కూడా అంబేడ్కర్‌ పేరును సహించలేనటువంటి ఒక తరం వచ్చిందా? నాకు అందిన సమాచారం మేరకు...


 వీరందరూ కూడా, కొంతమంది యువకులు అంబేడ్కర్‌ను వ్యతిరేకించే దశకు వెళ్లి... మంత్రి ఇల్లు తగలబెట్టే సాహసం చేశారంటే... నాకు తెలిసి వాళ్లు స్పృహలో ఉన్నట్లు కాదు! గంజాయైునా తాగి ఉండాలి. ఎవరైనా మందు తాగించైనా ఉండాలి. లేకుంటే... ఏదైనా మత్తులో పెట్టి ఉండాలి. ఏ వర్గాల కోసమైతే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పని చేశారో, ఏ కులాల కోసమేతే రాజ్యాంగాన్ని ఇచ్చారో... ఆ ఫలాలను అనుభవిస్తూ ఆయనపైనే దాడి చేయడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది. కోనసీమలో ఉన్న వారు ఈ విధంగా తయారైన దరిద్రులుగా నేను భావిస్తున్నాను’’ అని జూపూడి పేర్కొన్నారు. కోనసీమలో ఏడు లక్షల మంది దళితులు తిరగబడితే అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ జెండాలు మోసేవారే అల్లర్లకు పాల్పడ్డారని, పోలీసుల విచారణలో అన్నీ బహిర్గతమవుతాయని తెలిపారు. హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును ఆ పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-26T09:08:53+05:30 IST