పేదల భూములపై గద్దలు

ABN , First Publish Date - 2020-11-22T04:43:59+05:30 IST

ఆ గిరిజనులు తరతరాలుగా ఆ భూములనే నమ్ముకున్నారు. వాటిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఏళ్ల తరబడి అవే వారికి తిండి పెడుతున్నాయి. తాజాగా వారి నోటికాడి ముద్దను లాక్కెళ్లేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు.

పేదల భూములపై గద్దలు
సాగులో ఉన్న కుడుమూరు రెవెన్యూ భూములు

 అడ్డదారిలో రికార్డుల సృష్టికి కొందరి యత్నాలు
పోరాడుతున్న రైతులు
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులు

 
ఆ గిరిజనులు తరతరాలుగా ఆ భూములనే నమ్ముకున్నారు. వాటిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఏళ్ల తరబడి అవే వారికి తిండి పెడుతున్నాయి. తాజాగా వారి నోటికాడి ముద్దను లాక్కెళ్లేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన 782 ఎకరాలను అడ్డదారిలో సొంతం చేసుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు...కొంతమంది అధికారులు...ఈ అక్రమాల పర్వానికి తెరవెనుక సహకారం అందిస్తున్నారు. ఈ భూములు కాపాడాలని కోరుతూ నెలల తరబడి గిరిజనులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా స్పందించే అఽధికారే లేరు.

(పాచిపెంట)
గిరిజనులకు తిండి పెడుతున్న భూములపై నాయకులు కన్నేశారు. దశాబ్దాల కాలంగా ఆ భూములనే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజన రైతులు వాపోతున్నా.. వాలుతున్న గద్దలను తరిమేందుకు నిరంతరం పోరాడుతున్నా... అండగా నిలిచే వారే కరువవుతున్నారు. అధికారులు ప్రేక్షక పాత్రను వీడడం లేదు. పాచిపెంట మండలంలోని కుడుమూరు రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 48లో 782 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.100 కోట్లకు పైనే. ఈ భూముల్లో 12 గ్రామాలకు చెందిన 250 గిరిజన కుటుంబాలు తాతల కాలం నుంచీ సాగు చేసుకుంటున్నాయి. కుడుమూరు, మెట్టవలస, ఇప్పలవలస, వలిసలమడ, చీడివలస, వేటగానివలస, రిట్లపాడు, కొండతాడూరు, తోకమెట్ట, కొత్తవలస, గులిగుడ్డి, కన్నయ్యవలస గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలు వాటిపై బతుకుతున్నాయి. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కొంతమంది నాయకులు...అధికారులు ప్రత్యక్షంగా..పరోక్షంగా వత్తాసు పలుకుతున్నారు. ఇటు గిరిజనులను నయానో..భయానో ఒప్పించడం...అటు అధికారుల నుంచి తమ పేరిట పత్రాలు సృష్టించడం... రెండు పనులనూ ఒకేసారి చేస్తున్నారు. సర్వే చేయకపోవడం వల్ల ఈ భూములు ఎవరివనే దానిపై  స్పష్టత లేదు. అసలు ఆ భూములు ప్రభుత్వానివా? లేక జిరాయితీనా తేలాల్సి ఉంది. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉన్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో ఆ వ్యక్తులు రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేశారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ఎంతటి వ్యయానికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇందుకోసం అన్నిమార్గాల్లో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకుల సహకారం తీసుకుంటున్నారు.  కుడుమూరు రెవెన్యూ పరిధిలోని సర్వే 48లో  ఉన్న ఈ 782 ఎకరాల భూమి సుమారు రూ.100 కోట్ల ధర ఉంటుంది. గిరిజనులు మాత్రం సాగు చేస్తున్న భూములను కాపాడుకునేందుకు ఉడుంపట్టు పట్టారు. వాటిపై పట్టాలు మంజూరు చేయాలంటూ పలుమార్లు ధర్నాలు చేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. గిరిజన రైతులకు సీపీఎం, గిరిజన సంఘం నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ అధికారులు...ప్రజాప్రతినిధులు మాత్రం దీనిపై స్పందించడం లేదు.


సర్వే చేస్తాం
 భూములపై ముందు స్పష్టత అవసరం. సర్వే చేసి గిరిజనులకు న్యాయం చేస్తాం. సర్వే సమయంలో సహకరించాలి. అవాస్తవమైన ఆరోపణలు వీడాలి.
                                                    - ఎంవీ రమణమూర్తి, తహసీల్దార్‌, పాచిపెంట

భూములను వదులుకోం
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూములను వదులుకొనేందుకు సిద్ధంగా లేము. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతాం. ఆ భూములు లేకుంటే జీవనమే కష్టం. వాటినే నమ్ముకున్నాం.
                                                - సూకురు అప్పలస్వామి, గిరిజన రైతు, తోకమెట్ట, పాచిపెంట మండలం
    

             సర్వే చేయాలి
ప్రభుత్వపరంగా సర్వే చేసి సాగు పట్టాలు మంజూరు చేయాలి. అధికారులు దయతలచి న్యాయం చేయాలి. ఆక్రమణదారులను అడ్డుకుంటాం. ఎంతవరకైనా పోరాటం చేస్తాం.
                                                    - గెమ్మెల గోపాల్‌, గిరిజన రైతు, తోకమెట్ట, పాచిపెంట మండలం        
           

Updated Date - 2020-11-22T04:43:59+05:30 IST