హయగ్రీవ ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-08-17T06:47:14+05:30 IST

ఎండాడ సర్వే నంబర్‌ 92/3లో ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ చేపట్టిన నిర్మాణ పనుల్లో అనేక లొసుగులు బయటకు వస్తున్నాయి.

హయగ్రీవ ఇష్టారాజ్యం
హయగ్రీవకు కేటాయించిన భూమిలో తవ్విన గ్రావెల్‌ను సాగర్‌నగర్‌లోని బ్లైండ్‌ స్కూల్‌ వెనుక ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ చేస్తున్న దృశ్యం

అనుమతులు లేకుండా 12 యంత్రాలతో కొండ తవ్వకం

ఆ మట్టి సమీపంలో గల ప్రభుత్వ భూమిలో డంపింగ్‌

గనుల శాఖ అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహారం

నిర్మాణ పనులను నిలుపుచేయాలన్న టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఆదేశాలు బేఖాతరు

తమ పైవారికి చెప్పండంటూ నిర్లక్ష్యంగా సమాధానం

చోద్యం చూస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు


విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

ఎండాడ సర్వే నంబర్‌ 92/3లో ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ చేపట్టిన నిర్మాణ పనుల్లో అనేక లొసుగులు బయటకు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వేయడంతోపాటు ఆ మట్టిని వాహనాలతో తీసుకువెళ్లి ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ చేస్తున్నారు. మట్టి లేదా గ్రావెల్‌ను తవ్వి మరొకచోటకు తరలించాలంటే గనుల శాఖ అనుమతి తప్పనిసరి. అయితే హయగ్రీవ యాజమాన్యం ఎటువంటి అనుమతులు పొందిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతిరోజూ 12 యంత్రాలతో కొండను తవ్వుతున్న యాజమాన్యం ఆ మట్టిని అంతే వేగంగా సమీపంలోని సాగర్‌నగర్‌ బ్లైండ్‌ స్కూల్‌ వెనుక గల ప్రభుత్వ స్థలంలో డంపింగ్‌ చేస్తోంది. ఈ విషయం గనుల శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఎందుచేతనో చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఎండాడలో హ యగ్రీవ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో కేటాయించిన 12.5 ఎకరాలపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ భూమిని సకాలంలో వినియోగంలోకి తేలేకపోయారు కాబట్టి, కేటాయింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఇటీవల సిఫారసు చేశారు.  ఆ భూమిలో నిర్మాణాలకు అనుమతివ్వాలంటూ జీవీఎంసీకి ప్లాన్‌ కోసం సంస్థ యాజమాన్యం దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్‌ నుంచి తాజా ఎన్‌ఓసీతోపాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి ఈసీ తమకు అందజేయాలని, అంతవరకూ ప్లాన్‌ జారీ చేయలేమంటూ జీవీఎంసీ కమిషనర్‌ షార్ట్‌ఫాల్‌లో పెట్టేశారు. అయినప్పటికీ ఆ భూమిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా కథనాలు ప్రచురితం కావడంతో జీవీఎంసీ జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిర్మాణాలు జరుగుతున్న చోటకు వెళ్లి పనులను తక్షణం నిలుపు చేయాలని ఆదేశించారు. ప్లాన్‌ దరఖాస్తును కమిషనర్‌ షార్ట్‌ ఫాల్‌లో పెట్టినందున వాటికి సంబంఽధించిన డాక్యుమెంట్లు అందజేసిన తర్వాతే పనులు చేసుకోవాలని, అంతవరకూ అనుమతించేది లేదని స్పష్టంచేశారు. అయితే అక్కడి సిబ్బంది విషయం తమకు కాదని, తమ పైవారికి చెప్పాలంటూ అధికారులను పట్టించుకోలేదు. పైగా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని చెప్పినట్టు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక అక్కడకు వెళ్లిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు...తమ పై అధికారులకు అక్కడ ఎదురైన సమాధానాన్ని వివరించగా, నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టంచేసి వచ్చేయాలని సూచించినట్టు తెలిసింది. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. తాము హెచ్చరించినా నిర్మాణ పనులు యథాతథంగా కొనసాగించడం హయగ్రీవ యాజమాన్యం బరితెగింపునకు అద్దంపడుతోందని జీవీఎంసీ అధికారులు అంటున్నారు. 

Updated Date - 2022-08-17T06:47:14+05:30 IST