ఆమె మృతిపై పిటిషన్ వేయడానికి నువ్వెవరు?: లాయర్‌కు హైకోర్టు చీవాట్లు!

ABN , First Publish Date - 2020-11-26T23:03:04+05:30 IST

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో కోర్టు పర్యవేక్షణలో సీబీఐ...

ఆమె మృతిపై పిటిషన్ వేయడానికి నువ్వెవరు?: లాయర్‌కు హైకోర్టు చీవాట్లు!

ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో  సీబీఐ దర్యాప్తు నిర్వహించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను బోంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఏదైనా సమాచారం ఉంటే నేరుగా పోలీసులను సంప్రదించవచ్చునని సూచించింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ న్యాయవాది పునీత్ ధండాకు కూడా హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసే అర్హత ఆయనకు లేదంటూ తీవ్రంగా మందలించింది. దిశా కేసులో సీబీఐ విచారణ కోరుతూ పునీత్ ధండా వేసిన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఈ పిటిషన్ వేయడానికి నువ్వెవరు? దిశా శాలియన్ మృతి వెనుక ఏదైనా కుట్ర జరిగిందన్న సందేహాలు ఉంటే.. చట్ట ప్రకారం ఆమె కుటుంబమే చర్యలు తీసుకుంటుంది కదా?’’ అని తీవ్ర స్వరంతో పేర్కొంది.


28 ఏళ్ల దిశా శాలియన్ ఈ ఏడాది జూన్ 8న ముంబైలోని 14 అంతస్తుల ఓ భవంతిపై నుంచి దూకి బలన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే నగర పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తూ జరిగినట్టుగా నమోదు చేశారు. కాగా ఆమె మృతికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలంటూ ఆగస్టు 5న ముంబై పోలీసులు విడుదల చేసిన ప్రకటనను హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పిటిషనర్ ధండా పోలీసులను సంప్రదించినట్టు ఎలాంటి రికార్డులూ లేవనీ.. వాస్తవానికి ఆయన నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లారని పేర్కొంది. తన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకే ధండా బోంబే హైకోర్టును ఆశ్రయించారు. దిశా శాలియన్‌ది ‘‘హత్యే’’ నంటూ మీడియాలో పలు కథనాలు వెలువడినప్పటికీ... పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా కేసును మూసేశారని పిటిషనర్ వాదించారు. అయితే ఆయన పోలీసులనే సంప్రదించాలంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. 

Updated Date - 2020-11-26T23:03:04+05:30 IST