CBI డైరెక్టర్‌గా Subodh నియామకంపై కేంద్రానికి బాంబే హైకోర్ట్ నోటీసులు

ABN , First Publish Date - 2022-06-09T21:58:52+05:30 IST

ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌(Subodh Kumar Jaiswal)ను సీబీఐ డైరెక్టర్‌(CBI director)గా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్ట్‌(Bombay High Court)లో విచారణ జరుగుతోంది.

CBI  డైరెక్టర్‌గా Subodh నియామకంపై కేంద్రానికి బాంబే హైకోర్ట్ నోటీసులు

ముంబై : ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌(Subodh Kumar Jaiswal)ను సీబీఐ డైరెక్టర్‌(CBI director)గా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్ట్‌(Bombay High Court) విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా సీబీఐ, కేంద్ర ప్రభుత్వం(Central govt)తోపాటు సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 18వ తేదీలోగా సంబంధిత ఏజెన్సీలు, జైస్వాల్ అభ్యంతరాలపై సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. బాంబే హైకోర్ట్ చీఫ్ జస్టిస్ దిపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కాగా జైస్వాల్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర మాజీ పోలీస్ అధికారి రాజేంద్ర త్రివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ ప్రకారం సీబీఐ డైరెక్టర్‌గా జైస్వాల్ నియామకం చెల్లదని పేర్కొన్నారు.


జైస్వాల్ నియామకం ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌కు విరుద్ధం. జైస్వాల్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన ముగ్గురు సభ్యుల కమిటీ ప్రొసీడింగ్స్, రికార్డులను కోరాలని తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌గా  నిష్కళంకమైన, విశ్వసనీయత కలిగిన మోస్ట్ సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎంపిక చేయాలి. అవినీతి నిరోధక కేసులపై దర్యాప్తు చేసిన అనుభవం కూడా ఉండాలి. కానీ ఇందుకు విరుద్ధంగా 2012లో సుబోధ్ జైస్వాల్‌పై పరువునష్టం ఫిర్యాదు నమోదయింది. ముంబైలోని మెజిస్ట్రేట్ కోర్ట్‌కు వెళ్లడంతో సంబంధిత ప్రక్రియకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయని బాంబే హైకోర్టుకు త్రివేది తరపు అడ్వకేట్ ఎస్‌బీ తాలేకర్ వెల్లడించారు. పరువు నష్టం కేసుపై విచారణ ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని వివరించారు.  ఇందుకు సంబంధించిన ఆధారాలను అఫిడవిట్‌లో జతపరిచారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రికార్డ్‌లోకి తీసుకుంది. కాగా ఈ కేసుపై తదుపరి విచారణ జులై 28న జరుగుతుందని ప్రకటించింది. కాగా సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ జైస్వాల్ గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. గతేడాది మే నెలలో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-09T21:58:52+05:30 IST