India Vs Austalia: ఉప్పల్ టీ20 మ్యాచ్‌కు నో టికెట్స్

ABN , First Publish Date - 2022-09-23T02:58:39+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్

India Vs Austalia: ఉప్పల్ టీ20 మ్యాచ్‌కు నో టికెట్స్

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ‌్‌ను కళ్లారా వీక్షించాలని కలలు గన్న  హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ తీరుతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టికెట్ల విక్రయాల విషయంలో హెచ్‌సీఏ ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 


గురువారం ఉదయం 7 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ తొలుత ప్రకటించింది. దీంతో టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు తెల్లవారుజాము నుంచే జింఖానా స్టేడియానికి చేరుకుని పడిగాపులు కాశారు. మూడు వేల  టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. మహిళలు కూడా టికెట్స్‌ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు.. టికెట్ల కోసం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే తొక్కిలసలాటలో పలువురు అభిమానులు గాయపడగా... పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


పరిస్థితులు చేదాటిపోవడంతో సాయంత్రం నుంచి పేటీఎం యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచుతామని హెచ్‌సీఏ ప్రకటించింది. దీంతో అభిమానులు దానిని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నారు. అయినప్పటికీ టికెట్లు బుక్ కాకపోవడంతో గందరగోళంలో పడిపోయారు. తాజాగా, మ్యాచ్ టికెట్లు అయిపోయాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. దీంతో హెచ్‌సీఏ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, టికెట్ల కోసం శుక్రవారం కూడా అభిమానులు పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్స్‌కు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-23T02:58:39+05:30 IST