Advertisement

'రియల్టీ’లో గిరాకీ నిర్మాణాత్మకమే..

Apr 23 2021 @ 01:15AM

  • అమాంతంగా ఏం పెరగలేదు.. 
  • హెచ్‌డీఎ్‌ఫసీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ 

ముంబై: దేశీయ స్థిరాస్తి రంగంలో ఈ మధ్య గృహాలకు గిరాకీ అమాంతంగా పెరిగినది కాదని హెచ్‌డీఎ్‌ఫసీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. అది సహజ సిద్ధంగా ఏర్పడిన నిర్మాణాత్మక గిరాకీయేనని, మున్ముందూ కొనసాగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారీగా తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరల్లో స్థిరత్వం, గృహ రుణాలపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు గడిచిన కొన్ని నెలల్లో గృహాల గిరాకీ పెరుగుదలకు దోహదపడ్డాయన్నారు. గురువారం జరిగిన ఓ వర్చువల్‌ ప్రాపర్టీ సదస్సులో పరేఖ్‌ ప్రస్తావించిన మరిన్ని అంశాలు.. 


  1. తొలి గృహ కొనుగోలుదారులతో పాటు పెద్ద ఇంటికి మారడం లేదా మరో ప్రాంతంలో రెండో ఇల్లు కొనుగోలు చేసే వారి వల్ల ఈ మధ్య ప్రాపర్టీ డిమాండ్‌ పెరిగింది. 
  2. ఇంటి నుంచే పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ట్రెండ్‌ ఊపందుకున్న కారణంగా కంపెనీ కార్యాలయానికి దగ్గర్లోనే ఇల్లు ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో గృహ కొనుగోలుదారులకు ప్రాంతాల ఎంపికలో అవకాశాలు విస్తృతమయ్యాయి. 
  3. ప్రపంచంలో డిజిటలీకరణ అతి తక్కువగా జరిగిన రంగాల్లో రియల్టీ ఒకటి. స్థిరాస్తి రంగం తన ఆదాయం నుంచి సాంకేతికతపై ఖర్చు చేసేది కేవలం 1.5 శాతమేనని అంచనా. రియల్టీ రంగంలో రియల్‌టైం డేటా అందుబాటు కూడా అరుదే. టెక్నాలజీ వినియోగం ద్వారా రియల్టీ రంగం లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచవచ్చు.  
  4. ఫిన్‌టెక్‌, హెల్త్‌టెక్‌, ఎడ్యుటెక్‌పై అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రా్‌పటెక్‌) ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌సిటీ లక్ష్యాల్లో ప్రాప్‌టెక్‌ కంపెనీలు కీలక పాత్ర పోషించవచ్చు. అంతేకాదు, బిల్డింగ్‌ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో స్థానిక మండళ్లు, మున్సిపాలిటీలకూ ఆధునిక టెక్నాలజీ ఎంతగానో దోహదపడనుంది. 
  5. గత ఏడాదిలో మొదలైన కరోనా సంక్షోభంతో కుదేలైన ప్రపంచ దేశాలు ప్రస్తుతం పునరుద్ధరణ బాటలో పయనిస్తున్నాయి. ధరాఘాతం పెరగకుండా నిలకడగా వృద్ధి రికవరీ సాధించేందుకు మౌలిక వసతుల నిర్మాణమే సరైన మార్గం.


స్థిరాస్తి సెంటిమెంట్‌పై ‘రెండో’ దెబ్బ 

దేశీయ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ భవిష్యత్‌ సెంటిమెంట్‌పై కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది చివరి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రియల్టీ భవిష్యత్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ 65 పాయింట్లుగా నమోదుకాగా.. ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 57 పాయింట్లకు తగ్గింది. నైట్‌ఫ్రాంక్‌-ఫిక్కీ-నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన 28వ విడత త్రైమాసిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా ఎగబాకడంతో వచ్చే ఆర్నెళ్లలో వ్యాపార అవకాశాలపై ఇండస్ట్రీ వర్గాల్లో అనిశ్చితి పెరిగిందని రిపోర్టు పేర్కొంది. సూచీ 50 పాయింట్ల ఎగువనే నమోదైనందున సెంటిమెంట్‌ ఇంకా ఆశావహ జోన్‌లోనే ఉందని సర్వే నివేదిక తెలిపింది. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.