హిందూపురంలో అధికార పార్టీ అరాచకం..

ABN , First Publish Date - 2021-12-07T06:50:55+05:30 IST

అధికార వైసీపీ దౌర్జన్యానికి దిగుతోంది. హిందూపురంలో ప్రతిపక్ష టీడీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ, వారి ఆస్తులను ధ్వంసం చేస్తోంది.

హిందూపురంలో అధికార పార్టీ అరాచకం..

  • టీడీపీ నేతల ఆస్తులే టార్గెట్‌...
  • స్థలం ప్రహరీ కూల్చివేత
  • స్వచ్ఛందంగా తొలగిస్తామన్నా వినని టౌన్ ప్లానింగ్‌ అధికారులు
  • ఫైనల్‌ నోటీసు ఇవ్వకుండానే కూల్చారంటూ 
  • మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన ఆవేదన


హిందూపురం, డిసెంబరు 6: అధికార వైసీపీ దౌర్జన్యానికి దిగుతోంది. హిందూపురంలో ప్రతిపక్ష టీడీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ, వారి ఆస్తులను ధ్వంసం చేస్తోంది. తద్వారా బెదిరింపులకు పూనుకుంటోంది. ఇందులో భాగంగానే మున్సిపల్‌ అధికార అస్ర్తాన్ని ప్రయోగించి, సోమవారం హిందూపురం మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మి, ఆమె భర్త నాగరాజుకు చెందిన వీడీ రోడ్డు సర్కిల్‌లోని స్థలం ప్రహరీని కూల్చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహానికి లోనయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ నాయకుడు నాగరాజుతోపాటు మరి కొందరు వీడీ సర్కిల్‌లో స్థలాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఉన్న పాత ప్రహారీపైనే గోడ కట్టారు. ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డు వదలకుండా అనధికారికంగా 5 అడుగుల కంటే ఎత్తుచేసి ప్రహరీ నిర్మించారంటూ మున్సిపల్‌ టౌనప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మునిసిపల్‌ టీపీఎస్‌ మంజులతోపాటు భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు ఎక్స్‌కవేటర్లతో వీడీ రోడ్డుకు చేరుకున్నారు.


ప్రహరీని కూల్చేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన లక్ష్మి, ఆమె భర్త నాగరాజు, టీడీపీ పట్టణ కన్వీనర్‌ రమేష్‌, మంగేష్‌, మురళి, పలువురు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పట్టణాభివృద్ధికి తాము అడ్డంకి కాదనీ, రెండు రోజులు అవకాశం ఇస్తే తామే తొలగించుకుంటామని రావిళ్ల లక్ష్మి, నాగరాజు చెప్పినా మున్సిపల్‌ అధికారులు వినకుండా ప్రహరీని కూల్చేశారు. అంతటితో ఆగకుండా స్థలం ముందర ఉన్న 200 అడుగుల గోడను పూర్తిగా కూల్చివేశారు. రావిళ్ల లక్ష్మీ, నాగరాజు మట్లాడుతూ తమకు ఒక నోటీసు ఇచ్చారనీ, దానిపై న్యాయస్థానానికి వెళ్లామన్నారు. ఫైనల్‌ నోటీసు ఇవ్వకుండానే కూల్చే అధికారం మున్సిపల్‌ అధికారులకు లేదన్నారు. టీడీపీలో క్రియశీలకంగా పని చేస్తున్నామన్న కక్షతోనే అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఆయన వద్ద ఉన్న మరో నాయకుడు.. మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి, తమను ఆర్థికంగా దెబ్బతీయాలని అధికారుల అస్ర్తాన్ని ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఫైనల్‌ నోటీసు ఇవ్వకుండా ప్రహరీ ఎందుకు కూలుస్తున్నారో చెప్పాలని మునిసిపల్‌ కమిషనర్‌కు ఫోన చేసినా.. స్పందించలేదన్నారు. ఇటీవల లేపాక్షి మండలం కంచిసముంద్రం పంచాయతీ సర్పంచ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపులో నాయకుడు నాగరాజు క్రియాశీలకంగా పనిచేశారు. ఓటమిని జీర్ణీంచుకోలేని అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష టీడీపీ నాయకుల ఆస్తులను టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్‌ రాఘవేంద్రకు చెందిన పరిగి రోడ్డులోని వాణిజ్య సముదాయం ఆర్చ్‌ తొలగించేందుకు అధికార పార్టీ మున్సిపల్‌ అధికారుల అస్ర్తాన్ని ప్రయోగించింది. తాజాగా మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన లక్ష్మీ, టీడీపీ నాయకుడు నాగరాజుపై అదే అసా్త్రన్ని ప్రయోగించినట్లు హిందూపురంలో చర్చ సాగుతోంది.


కోర్టు ఉత్తర్వుల మేరకే తొలగించాం.. - వెంకటేశ్వర్‌రావు, మునిసిపల్‌ కమిషనర్‌ 

రైల్వే రోడ్డు విస్తరణలో భాగంగానే అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించాం. అనుమతులు లేకుండా వీడీ రోడ్డులో ప్రహరీ నిర్మించడంతో తొలగించాం. ఫైనల్‌ నోటీసులుకూడా ఇచ్చాం. ఆయన తీసుకోకపోవడంతో ఇంటికి అతికించాం. నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాం.

Updated Date - 2021-12-07T06:50:55+05:30 IST