మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ మృత్యువాత

ABN , First Publish Date - 2022-08-09T06:41:51+05:30 IST

వర్షంతో తడిచిన రోడ్డు, అతివేగం ఘోరప్రమాదానికి దారితీసింది. ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టి కిందికి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ మృత్యువాత
మృతులు నాగిరెడ్డి, హనిమిరెడ్డి, ఆదిలక్షి, అనంతరాములమ్మ, గురవమ్మ (ఫైల్‌)

కంభం వద్ద ఘోర రోడ్డుప్రమాదం 

ఐదుగురు దుర్మరణం 

అందరూ పల్నాడు జిల్లాకు చెందిన బంధువులు 

లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో దుర్ఘటన 

బేస్తవారపేట, ఆగస్టు 8 : వర్షంతో తడిచిన రోడ్డు, అతివేగం ఘోరప్రమాదానికి దారితీసింది. ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టి కిందికి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్న తమ కుమారుడు ఇంటికి రావడంతో కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళుతుండగా అనంతపురం- అమరావతి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున కంభం రైల్వే గేటు వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.  


కూలిన ఆశలు 

శిరిగిరిపాడు గ్రామానికి చెందిన జూలకంటి హనిమిరెడ్డి, గురవమ్మల రెండో కుమారుడు నాగిరెడ్డి చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. గుంటూరులో బీటెక్‌ వరకు చదివి ఎంఎస్‌ చేయడానికి లండన్‌ వెళ్లాడు.  హనిమిరెడ్డి రూ.20లక్షలు అప్పుతెచ్చి మరీ కుమారుడిని చదివిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో మొక్కు తీర్చుకునేందుకు నాగిరెడ్డి లండన్‌ నుంచి గ్రామానికి వచ్చాడు. తిరుమలకు బయల్దేరిన నాగిరెడ్డి (22), తన అమ్మమ్మ, తాత చిలకల ఆదిలక్ష్మి(62), హనిమిరెడ్డి(70), ఆదిలక్ష్మి చెల్లెళ్లు పల్లె అనంతరాములమ్మ(60), భూమిరెడ్డి గురవమ్మ(58) కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కంభం రైల్వే గేటు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురూ లోపల ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 


రెండు వాహనాల్లో తిరుమలకు ప్రయాణం

మొక్కు తీర్చుకునేందుకు నాగిరెడ్డి తన బంధువులను తిరుమలకు రావాలంటూ పిలిచారు. దీంతో  నాగిరెడ్డి తల్లి గురవమ్మ, తండ్రి హనిమిరెడ్డి, సోదరుడు శ్రీనివాసరెడ్డి మరికొందరు బంధువులతో ముందు ఒక వాహనంలో వెళుతున్నారు. నాగిరెడ్డితో పాటు తాత, అమ్మమ్మ, మరో ఇద్దరు చిన్నమ్మమ్మలు మరో కారులో వెళ్తున్నారు. సమీప బంధువుకు చెందిన కారును నాగిరెడ్డి తెచ్చుకొని తానే స్వయంగా నడుపుతున్నాడు. అదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో శిరిగిరిపాడు నుంచి బయలుదేరారు. కంభం సమీపంలో ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురుస్తోంది. వేకువజామున లారీని గమనించక ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే కంభం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సెల్‌ఫోన్‌ ద్వారా ముందు కారులో వెళుతున్న బంధువులకు   సమాచారం ఇచ్చారు. మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. కంభం ఏస్సై నాగమల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మిన్నంటిన రోదనలు

‘మనకు మంచి రోజులు వచ్చాయమ్మ.. మనం ఆర్థికంగా త్వరలోనే స్థిరపడతాం’ అంటూ నాగిరెడ్డి చెప్పిన మాటలను చెబుతూ అతని తల్లి విలపిస్తుండటం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. కంభం ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతిచెందడంతో శిరిగిరిపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన వందల మంది ప్రజలు కంభం వైద్యశాల వద్దకు చేరుకున్నారు.


Updated Date - 2022-08-09T06:41:51+05:30 IST