ఆసిఫాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖకు దడ పుట్టిస్తున్న దేశీదారు

ABN , First Publish Date - 2022-04-22T03:34:42+05:30 IST

ఏడాది క్రితం వరకు వ్యాపారుల జేబులు నింపిన మద్యం వ్యాపారం ప్రస్తుతం అదే వ్యాపారులను బెంబేలెత్తిస్తోంది. మహారాష్ట్రకు సరిహద్దునే ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం మహారాష్ట్ర దేశీమద్యం ఏరులై పారుతోంది. వివిధ రకాల పేర్లతో అక్కడి బేవరేజ్స్‌ తయారు చేస్తున్న దేశీదార్‌ ధర తక్కువగా ఉండడం అధిక మత్తు ఇస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

ఆసిఫాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖకు దడ పుట్టిస్తున్న దేశీదారు

-‘మహా’ రివర్స్‌ పంచ్‌తో జిల్లా వ్యాపారులు విలవిల

-ఇక్కడి లిక్కర్‌ అమ్మకాలపై తీవ్రప్రభావం 

-సరిహద్దుగుండా పెద్దఎత్తున దేశీదారు దిగుమతి

-దాడులు చేస్తున్న ఎక్సైజ్‌ను ముప్పతిప్పలు పెడుతున్న స్మగ్లర్లు 

-40నుంచి 45శాతం అమ్మకాలు తగ్గాయంటున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఏడాది క్రితం వరకు వ్యాపారుల జేబులు నింపిన మద్యం వ్యాపారం ప్రస్తుతం అదే వ్యాపారులను బెంబేలెత్తిస్తోంది. మహారాష్ట్రకు సరిహద్దునే ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం మహారాష్ట్ర దేశీమద్యం ఏరులై పారుతోంది. వివిధ రకాల పేర్లతో అక్కడి బేవరేజ్స్‌ తయారు చేస్తున్న దేశీదార్‌ ధర తక్కువగా ఉండడం అధిక మత్తు ఇస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ముఖ్యంగా కిక్‌ అధికంగా ఉండ డంతో మందుబాబులు దేశీదారు వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు ఇక్కడి మద్యం ధరలు కూడా అధికంగా ఉండడం పరోక్షంగా మహారాష్ట్ర నుంచి దేశీదార్‌ స్మగ్లింగ్‌కు ఊతమిస్తోందన్న అంచనాలున్నాయి. ఏడాది క్రితం వరకు మహారాష్ట్రలో ఇక్కడి వ్యాపారులు ఆడిందే ఆటగా అమ్మిందే మందుగా సాగింది. ఇందుకు కారణం లేక పోలేదు. గడ్చిరోలి, చంద్రపూర్‌ జిల్లాలో మహారాష్ట్ర జిల్లాలో పాక్షిక మద్యనిషేధాన్ని అమలు చేయడంతో గడిచిన ఐదేళ్లు అక్కడ మందుబాబులకు మద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు పొరుగునే ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి, వాంకిడి, సిర్పూరు, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, మద్యం దుకాణాల నుంచి భారీ ఎత్తున ఐఎంఎల్‌ మద్యం మహారాష్ట్రకు స్మగ్లింగ్‌ జరిగేది. అయితే ఇక్కడి పరిస్థితులను గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం గత జూలైలో చంద్రపూర్‌ జిల్లాలో మద్య నిషేదాన్ని ఎత్తి వేసింది. ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో మాత్రమే మద్యనిషేధాన్ని అమలు చేస్తోంది. అయినా గడ్చిరోలి జిల్లాలో తెలంగాణ మద్యం కంటే ప్రస్తుతం మహారాష్ట్ర ఐఎంఎల్‌, దేశీదార్‌ విక్రయాలు భారీగా సాగుతున్నట్టు ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఎక్సైజ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫలితంగా మహారాష్ట్రకు విక్రయాలు నిలిచిపోవడంతో జిల్లాలోని సరిహద్దు మద్యం దుకాణాలు విక్రయాలు లేక ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దానికి తోడు స్థానికంగా గుడుంబా తయారీ కూడా మళ్లీ పుంజుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్‌ యంత్రాంగం దేశీదార్‌పై దృష్టిసారించి స్మగ్లింగ్‌ జరుగుతున్న మార్గాలపై గట్టి నిఘా పెట్టింది. అయినప్పటికీ స్మగ్లర్లు ఎక్సైజ్‌ యంత్రాం గాన్ని బురిడీ కొట్టించి మరీ జిల్లాలోకి దేశీదారును స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు కనిపెట్టారు. ఇందుకు అక్కడి పోలీసులు, అధికారులు కూడా సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర రివర్స్‌ పంచ్‌తో ఇక్కడి ఎక్సైజ్‌ యంత్రాంగం ఖంగు తినగ మద్యం వ్యాపారుల నుంచి దేశీదారు నియంత్రించాలంటూ ఎక్సైజ్‌పై తీవ్రంగా ఒత్తిడి పెరుగు తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్‌శాఖ ప్రతిరోజు ఏదో ఒక చోట దాడులు నిర్వహించి దేశీదారు లేదా మహారాష్ట్ర మద్యాన్ని పట్టు కుంటోంది. దాంతో పాటు స్థానికంగా తయారీ దారులపై దృష్టి సారించి దాడులు నిర్వహిస్తూ బైండోవర్‌లను పెంచుతోంది. దేశీదారు స్మగ్లింగ్‌, గుడుంబా తయారీ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల కొన్నికేసుల్లో ఒక్కొక్కరిపై లక్ష జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేశారు. 

దేశీదారుతో తగ్గిన మద్యం విక్రయాలు

మహారాష్ట్రలో మద్యం నిషేధం పాక్షికంగా సడలించటంతో దాని ప్రభావం జిల్లాలోని మద్యం విక్రయాలపై తీవ్రంగా కన్పిస్తున్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదిగా జరిగిన మద్యం విక్రయాల గణాంకా లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా రూడీ అవుతోంది. జిల్లాలో మొత్తం 30మద్యం దుకాణాలుండగా దేశీదారు కారణంగా 40నుంచి 45 శాతం విక్రయాల్లో తగ్గుదల నమోదైనట్టు గుర్తించారు. ఆసిఫాబాద్‌ సర్కిల్‌ పరిధిలో డిసెంబరు 2020నుంచి ఏప్రిల్‌ 2021మద్య 66,011 బాక్సుల ఐఎంఎల్‌ మద్యం, 33,477బాక్సుల బీర్లు విక్రయించగా 2021 డిసెంబరు నుంచి 2022 ఏప్రిల్‌ 22 ఐదు నెలల్లో 62,423 ఐఎంఎల్‌ మద్యం బాక్సులు, 38,681 బీరు బాక్సులు మాత్రమే విక్రయించారు. దాదాపు 4వేల బాక్సుల ఐంఎల్‌ఎ విక్రయాలు తగ్గాయి. ఇక కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో జనవరి 2020నుంచి ఏప్రిల్‌ 2021 మధ్య 2,81,715 ఐఎంఎల్‌ మద్యం, 1,60,522 బాక్సుల బీర్లు విక్రయించగా, 2021 జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు 2,59,241 ఐఎంఎల్‌ మద్యం, 1,82,722 బాక్సుల బీర్ల విక్రయించాయి. అంటే ఇక్కడ కూడా 30వేల పెట్టెల ఐఎంఎల్‌ మద్యం విక్రయాలు తగ్గాయి. ఈ గణాంకాలను బట్టి మహారాష్ట్ర మద్య నిషేధం ఎత్తివేత ఇక్కడి ఎక్సైజ్‌ యంత్రాంగంపై తీవ్రంగానే పడిందని చెప్పాలి. ఇదిలా ఉండగా, గతేడాదిగా రెండు సర్కిళ్ల పరిధిలో జరిపిన దాడుల్లో దేశీదారుతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఆసిఫాబాద్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం 451 దేశీదారు సీసాలను స్వాదీనం చేసుకొని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగజ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం 46 కేసులు నమోదు కాగా 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 వాహనాలను స్వాధీనం చేసుకొని పదిమందిని బైండోవర్‌ చేయగా మొత్తం 600లీటర్ల పరిమాణంలో 6670సీసాల దేశీదారును స్వాధీనం చేసుకు న్నారు. దేశీదారు అమ్మకాల ప్రభావం ఆసిఫాబాద్‌ సర్కిల్‌ కంటే కాగజ్‌నగర్‌ సర్కిల్‌లోనే తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

దాడులు చేస్తున్నాం

-మోహసీన్‌, ఎక్సైజ్‌ సీఐ ఆసిఫాబాద్‌ 

మహారాష్ట్రలో మద్య నిషేదం ఎత్తివేసినందున అక్కడి నుంచి దేశీదారు అక్రమ మార్గాల గుండా జిల్లాలోకి దిగుమతి అవుతున్న మాట వాస్తవమే. అలాంటి వారిని గుర్తించి ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నాం. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెడు తున్నాం. ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాం. ఆసిఫాబాద్‌లో ఆరుగురిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాం.

Updated Date - 2022-04-22T03:34:42+05:30 IST