అంతా ఆయనే!

Jun 19 2021 @ 23:32PM
మాన్సాస్‌ కార్యాలయం

మాన్సాస్‌లో కరస్పాండెంట్‌ ఆధ్వర్యంలోనే పాలన

కోర్టు కేసులు చూసేదీ వారే 

లీజు వ్యవహారాల్లోనూ కీలకం

పూర్తి స్థాయిలో దృష్టి సారించని చైర్మన్లు

అక్రమాలకు ఆస్కారం

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

మహరాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టుకు పూసపాటి వంశీయులే చైర్మన్లుగా ఉంటున్నా ..పాలన చూసేది దాదాపు కరస్పాండెంటే. చైర్మన్లు తమకు నచ్చిన వారిని కరస్పాండెంట్‌గా నియమించుకునేవారు. కోర్టుల్లో కేసులతో పాటు ట్రస్టుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే సాగుతాయి. ఆయన చెప్పిందే వేదంగా చైర్మన్లు అంగీకరించేవారు. ట్రస్టు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఎండోమెంట్‌ కమిషనర్‌ నియమించిన ఎగ్జిక్యూటివ్‌ అధికారే కరస్పాండెంట్‌గా వ్యవహరించాలని దేవదాయ శాఖ గతంలో వాదనకు దిగింది. కానీ దీనిని చైర్మన్లు అంగీకరించ లేదు. ఈ వివాదం కోర్టు వరకు కూడా వెళ్లింది. కరస్పాండెంట్‌ పాత్ర కీలకమైనది కావడం వల్లే ఇటు చైర్మన్లు, అటు దేవదాయ శాఖ అధికారులు ఆధిపత్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. 

మాన్సాస్‌ ట్రస్టు 1958లో ఏర్పాటైంది. డాక్టర్‌ పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1976నుంచి పీఎల్‌ఎన్‌ రాజును సెక్రటరీగా, ఆర్డీఎస్‌ఎస్‌ఎన్‌ రాజును కరస్పాండెంట్‌గా నియమించారు. ఎండోమెంట్‌ నియమించిన ఎగ్జిక్యూటివ్‌ ఆధికారి ఆధ్వర్యంలో ఇరువురి సమన్వయంతో ట్రస్టు కార్యకలాపాలు నడిచాయి. రూ.2వేలకు మించిన ఖర్చులను ఎగ్జిక్యూటివ్‌ అధికారి దృష్టిలో పెట్టేవారు. 1994 ప్రాంతంలో పీవీజీ మరణించిన తరువాత పెద్ద కుమారునిగా ఉన్న ఆనందగజపతి రాజు చైర్మన్‌ అయ్యారు. 1996 నుంచి బాధ్యతలు చూశారు. ఆయన హయాంలో పి.సాంబ, అచ్యుతరావు, డాక్టర్‌ ఎ.రాఘవరావులు కరస్పాండెంట్లుగా పనిచేశారు. 2016లో ఆనంద గజపతిరాజు మృతి చెందారు. ట్రస్టు బైలా ప్రకారం అశోక్‌ గజపతిరాజు అదే ఏడాది చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. ట్రస్టు కార్యకలాపాల్లో ఆనందగజపతి చైర్మన్‌గా పనిచేసిన కాలం నుంచి కొన్ని అరోపణలు వస్తున్న కారణంగా అప్పటివరకు ఉన్న కరస్పాండెంట్‌ను తొలగించి డీఆర్‌కే రాజును అశోక్‌ నియమించారు. 2019లో డీఆర్‌కే రాజును తొలగించి అప్పటికి ఎమ్‌వీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కేవీఎల్‌ రాజును మాన్సాస్‌ కరస్పాండెంట్‌గా నియమించారు. అశోక్‌ హయాంలో డీఆర్‌కే రాజు, కేవీఎల్‌ రాజు కరస్పాండెంట్లుగా పనిచేశారు. 

 వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పూసపాటి రాజుల కుటుంబంలో కలతలు రేగాయి. పూసపాటి కుటుంబంతో తెగతెంపులు చేసుకున్న ఆనందగజపతి మొదటి భార్య కుమార్తె సంచయితను 2020 మార్చిలో ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.  ఆమెను ఏకంగా మాన్సాస్‌, సింహాచల దేవస్థానం బోర్డు చైర్‌పర్సన్‌గా జీఓ నెంబరు 74ద్వారా నియమించారు. ఈ నియామకం నిబంధనలకు విరుద్ధమని చెబుతూ అశోక్‌ గజపతిరాజు హైకోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం ఆ జీఓను కోర్టు కొట్టేయడంతో మళ్లీ అశోక్‌ గజపతిరాజు మాన్సాస్‌, సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్టులకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంచయిత చైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో కూడా కేవీఎల్‌ రాజే కరస్పాండెంట్‌గా కొనసాగుతూ వస్తున్నారు. ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టాక కరస్పాండెంట్‌ అందుబాటులోకి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

ట్రస్టు బోర్డులో చైర్మన్‌కు పరిపాలనా అధికారం ఉంది కానీ అధికారిక నిర్ణయాలు, అమలు విషయంలో దేవదాయ శాఖదేనని ఆ శాఖ పట్టుబడుతూ వస్తోంది. దేవదాయ కమిషనర్‌ నియమించిన ఎగ్జిక్యూటివ్‌ అధికారే కరస్పాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తారని చెబుతూ కోర్టులో కేసు కూడా వేసింది. 2001 ప్రాంతంలో దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో మళ్లీ ట్రస్టు నిర్వాహకులుగా ఉన్న రాజులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి వారు నియమించుకున్న కరస్పాండెంటే అంతా చూస్తున్నారు. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.