ఆయనే నా బలం.. ధైర్యం

ABN , First Publish Date - 2021-01-17T06:10:04+05:30 IST

నర్సింగ్‌ యాదవ్‌...మాసిన గెడ్డం... అంతెత్తు విగ్రహం... చూడడానికే గంభీరంగా ఉంటారు. కానీ ఆయన్ను కదిలిస్తే ఓ

ఆయనే నా బలం.. ధైర్యం

నర్సింగ్‌ యాదవ్‌...మాసిన గెడ్డం... అంతెత్తు విగ్రహం... చూడడానికే గంభీరంగా ఉంటారు. కానీ ఆయన్ను కదిలిస్తే ఓ మనసున్న మనిషి కనిపిస్తారు. ఇష్టపడిన అమ్మాయి కోసం మూడేళ్లు నిరీక్షించి... ఆమెకు తనపై నమ్మకం కలిగించి... చివరి క్షణం వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినీ నటుడిగా... రాజకీయ నాయకుడిగా... బాధ్యతగల భర్తగా... తండ్రిగా... విభిన్న పాత్రల్లో ఒదిగిపోయిన ఆయనలో... సగభాగమై కలిసి నడిచిన చిత్రా నర్సింగ్‌యాదవ్‌ అంతరంగం ఇది... 


అరమరికలు లేకుండా సాగిపోయిన ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం మాది. ఇన్నేళ్లలో ఆయన ఏ రోజూ నా కంట కన్నీరు పెట్టనివ్వలేదు. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. నేను అప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని. మా నాన్నది చిత్తూరు. అయితే ఆయనకు పదహారేళ్లప్పుడే బెంగళూరు వెళ్లి స్థిరపడ్డారు. నేనూ అక్కడే పుట్టాను. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. ఓసారి తిరుపతిలో మా కజిన్‌ పెళ్లికి వెళ్లాం. అక్కడకు నర్సింగ్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. తొలిసారి మేము కలుసుకుంది అప్పుడే. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ కాదు కానీ... ఆ క్షణంలోనే ఆయన మనసులో అనుకున్నారట... ‘పరవాలేదు... ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు’ అని! 


భయపడినా... భరోసా కలిగింది...  

అయితే నర్సింగ్‌ మనసులో మాట మనసులోనే ఉంది. తరువాత ఓసారి షూటింగ్‌ కోసం బెంగళూరుకు వచ్చినప్పుడు ఫోన్‌ చేస్తే, మా ఇంటికి ఆహ్వానించాం. ఆ తరువాత రెండు మూడుసార్లు వచ్చి వెళ్లడంతో పరిచయం పెరిగింది. నన్ను పెళ్లి చేసుకొంటానని ముందు ఆయనే అడిగారు. నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని. ఆయన పహిల్వాన్‌... పైగా సినిమా నటుడు. పూర్తిగా భిన్నమైన నేపథ్యాలు. తనతో పెళ్లంటే మొదట కాస్త భయమేసింది. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు నలుగురితో తను మాట్లాడే తీరు, అందరితో కలగలసిపోయే తత్వం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘చివరి వరకు నీకు తోడుంటాను. నన్ను నమ్మి నువ్వు వస్తే నా జీవితమే మారిపోతుంది’ అన్నారు. అది నాకు బాగా నచ్చింది. తనతో ఉంటే నా జీవితం బాగుంటదనిపించింది. నన్ను బాగా చూసుకొంటారనే ధైర్యం కలిగింది. ఓకే చెప్పేశాను. 


మూడేళ్లు నిరీక్షణ... 

ఎవరికో సాయం చేసినప్పుడు, వేరొకరి సమస్య తనదిగా భావించి పరిష్కరించినప్పుడు పహిల్వాన్‌ అనో, మరొకటనో పేర్లు పెడుతుంటారు. కానీ తనేమిటో, తన మనస్తత్వమేమిటో విడమరిచి చెప్పాక నాలో భయం పోయింది. భరోసా దొరికింది. అయితే పెళ్లికి మా ఇంట్లోవాళ్లు ససేమిరా అన్నారు. వేరే సంబంధాలు చూస్తామన్నారు. నా మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఎవరెంత బలవంతపెట్టినా ఆయన్నే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను. ఇక ఎవరు చెప్పినా వినలేదు. ఆయన వాళ్లింట్లో వారందరినీ ఒప్పించారు. తరువాత మా పెద్దలకూ నచ్చజెప్పి, బతిమలాడి ఒప్పించారు.


అదే సమయంలో మా అమ్మకు కేన్సర్‌ అని తెలిసింది. ‘నీకేమీ పర్లేదు. నేను నీతో ఉంటాను. అమ్మకు తగ్గే వరకు ఆగుతాను’ అని నర్సింగ్‌ చెప్పారు. మూడేళ్లు కేన్సర్‌తో పోరాడి అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం తను నా కోసం అన్నేళ్లూ వేచి ఉన్నారు. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చివరకు 2000 నవంబర్‌లో మేము పెళ్లి చేసుకున్నాం. ఏదైనా... ముందే రాసిపెట్టి ఉంటుందంటారు కదా! అదే... డెస్టినీ! 


ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు... 

అమ్మ చనిపోయినప్పుడు నర్సింగ్‌ నాకు చెప్పిన ఒకే ఒక్క మాట... ‘ఈ రోజు నుంచి నీకు తల్లయినా, తండ్రయినా నేనే’ అని! నిజంగా ఏ రోజూ ఆయన నన్ను బాధ పెట్టింది లేదు. నేను ఆశించినదాని కంటే ఎక్కువగా చూసుకున్నారు. నాకు ఏ కష్టం రాకుండా, అత్తారింట్లో ఇబ్బందులు పడకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేనూ తన జీవన శైలికి, ఇక్కడి వాతావరణానికి త్వరగా అలవాటుపడ్డాను. ఆయనకు తమ్ముడు, నలుగురు చెల్లెళ్లు. అందరికీ అన్నయ్య భార్యగా నేను ఒక నిర్ణయం తీసుకొంటే అదే ఫైనల్‌. ఎవరూ ఎదురు చెప్పరు. వాళ్లు కూడా నన్ను తోబుట్టువులా ఆదరించారు.


నర్సింగ్‌ అంటే వాళ్లందరికీ ప్రాణం కనుక, ఆయన అర్ధాంగిగా నేనన్నా అంతే ఇష్టపడతారు. ఏ రోజూ ‘ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను’ అని బాధపడింది లేదు. ఆయన సాన్నిహిత్యంలో ఇరవై ఏళ్ల మా వైవాహిక జీవితాన్ని ఎంతో ఆస్వాదించాను. ఆనందించాను. అన్నట్టుగానే ఆయన మా అమ్మానాన్నలను మరపించారు. పెళ్లికి ముందు ఇచ్చిన మాటను, నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకున్నారు. 


బలం, ధైర్యం ఆయనే...

ఇప్పుడు మమ్మల్ని విడిచి నర్సింగ్‌ వెళ్లిపోయారు. అయినా కుటుంబ భారాన్ని మోసే నైతికబలాన్ని, ధైర్యాన్ని ఆయన నాకు ఇచ్చారు. మొదటి నుంచి నన్ను అలా మలిచారు. కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ లొకేషన్లన్నీ మావారే చూసుకొనేవారు. ఆయన ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ వర్క్‌ నేను మేనేజ్‌ చేసేదాన్ని. ఆయన భరోసాతోనే హీరోలు ధైర్యంగా లొకేషన్‌కు వచ్చేవారు. నర్సింగ్‌ వివిధ భాషల్లో 300కు పైగా చిత్రాలు చేయడం, లొకేషన్లు కూడా చూసుకోవడం వల్ల పరిశ్రమలో నటులు, సాంకేతిక నిపుణులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.


‘మా’లో ఈసీ మెంబర్‌గా, ‘జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అంతేకాదు... కోఠీలో ముప్ఫై ఏళ్లుగా గణపతి మండపాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నర్సింగ్‌ చనిపోయినప్పటి నుంచి ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌ కుటుంబ సభ్యుల్లా మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇంటికి వచ్చి పరామర్శించారు. 


వర్మ గురువు... చిరంజీవి ప్రాణం... 

నర్సింగ్‌కు రామ్‌గోపాల్‌ వర్మ గురువు. చిరంజీవి గారు ప్రాణం... గాడ్‌ఫాదర్‌! చిరంజీవి గారు కూడా నర్సింగ్‌తో చాలా ఆప్యాయంగా ఉంటారు. నర్సింగ్‌ మరణించాక పదో రోజున ఆయన ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. నర్సింగ్‌తో తనకు ఎంతటి అనుబంధం ఉందో గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారి ప్రతి సినిమాలో నర్సింగ్‌ ఉండాల్సిందే. అది ఒక సెంటిమెంట్‌లా మారిపోయింది. షూటింగ్‌లో కూడా ‘నర్సింగ్‌ వచ్చాడా’ అని అడుగుతారట!


మూత్రపిండాల సమస్యతో నర్సింగ్‌ చివర్లో సినిమాలు తగ్గించారు. అయినా చిరంజీవి గారు తన ‘ఖైదీ నం.150’లో పట్టుబట్టి ఆయనతో ఓ చిన్న బిట్‌ పెట్టించారు. హీరోయిన్లలో సౌందర్య, సుహాసినిలను మా వారు చాలా అభిమానిస్తారు. నర్సింగ్‌కు నచ్చిన సినిమా ‘క్షణక్షణం’. దాంతోనే ఆయనకు నటుడిగా మంచి బ్రేక్‌ వచ్చింది. సినిమాల్లోలానే ఇంట్లో కూడా ఆయన నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు.  




సచిన్‌, కొహ్లీలతోనూ... 

మా వారు భారత క్రికెటర్లతో కూడా బాగుండేవారు. సచిన్‌ ఓసారి మా ఇంటికి వచ్చారు. సుల్తాన్‌బజార్‌లో ఓ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా కొహ్లీ, ధోనీ తదితరులతో కూడిన భారత క్రికెట్‌ జట్టంతా పాల్గొంది. నర్సింగ్‌ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన ఉన్నారు కాబట్టే అక్కడ షూటింగ్‌ సాధ్యమైంది. 


నచ్చింది అదే... 

నర్సింగ్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. తనను ఎలాగైనా మలుచుకోవచ్చు. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు.ఆయనలో నాకు నచ్చింది నమ్మకం... నా మీద పెట్టుకున్న నమ్మకం! చివరి వరకు ఆ నమ్మకాన్ని సజీవంగా ఉంచారు. నచ్చనిది ముందూ వెనకా చూసుకోకుండా ఇతరులకు సాయం చేయడం. మనకు ఉందా లేదా అని కూడా పట్టించుకోకుండా అవతలివారికి మాట ఇచ్చేస్తారు. మొదట్లో నాకది అసలు నచ్చేది కాదు. కానీ సావకాశంగా ఆలోచిస్తే ఆయనే కరెక్ట్‌ అనిపించింది. ఆకలన్న వారికి అన్నం పెట్టడం... సాయం కోరి వచ్చిన వారిని ఉత్తి చేతులతో పంపించకూడదని ఆయన్ను చూసి నేర్చుకున్నా. దానంగా నేనూ ఆ దారిలోనే నడవడం మొదలుపెట్టాను. అందుకే నర్సింగ్‌ నాకు భర్త మాత్రమే కాదు... మార్గదర్శకుడు, నా నమ్మకం, బలం, ధైర్యం కూడా! 





రోజుకు లక్షసార్లు పిలిచేవారు... 

నర్సింగ్‌కు నేనంటే పంచప్రాణాలు. ‘చిత్రా...చిత్రా...’ అంటూ రోజుకు నా పేరు లక్షసార్లు పిలుస్తారు. నాకు ఒక్కోసారి విసుగొచ్చేస్తుండేది... ‘ఏంటి ఇన్నిసార్లు పిలుస్తున్నారు’ అని! అంతలోనే తన మనసు అర్థమయ్యేది. ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ఆయన ఎప్పుడూ నీ జపమే చేస్తుంటాడు’ అని మా ఆడపడుచులు అంటుండేవారు. మేం స్నేహితుల్లా ప్రతి ఒక్క విషయం మాట్లాడుకునేవాళ్లం. సంతోషం వచ్చినా... బాధ కలిగినా తను వెంటనే బయటపడిపోతారు. ఏదీ దాచుకోలేరు. ఇదెందుకు చేశావు? అంతెందుకు ఖర్చు పెట్టావు? అని ఏ రోజూ నన్ను ప్రశ్నించలేదు. ఆయన ఇలాకాలో నేను ఎలాగన్నా ఉండవచ్చు. నేనూ ఏ రోజూ ఆయనను భర్తలా చూడలేదు. స్నేహితుడిగానే భావించాను. ఇప్పుడదంతా ఒక కలలా మారిపోయింది. ఇంకా తను నా పక్కనే ఉన్నట్టు ఉంది. నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. 


చివరి కోరిక తీరకుండానే... 

నర్సింగ్‌ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు... ‘ఇలా మంచాన పడకుండా నటిస్తూనే తుది శ్వాస విడవాల’ని! ఆఖరి రోజుల్లో కూడా ‘కొద్దిగా నయమైతే మళ్లీ నటిస్తా’ననేవారు. చివరకు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఆయనకు నటనంటే అంత ఇష్టం.


మా ఒక్కగానొక్క కొడుకు రుత్విక్‌ యాదవ్‌ను తెరపై డాలనుకొనేవారు. ఆయన కోరికపైనే ఏడెనిమిది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. వాడికి ఇప్పుడు 18 ఏళ్లు. బీటెక్‌ చదువుతున్నాడు. అయితే వాడికి సినీ రంగంపై అస్సలు ఆసక్తి లేదు. బాగా చదువుకోవాలనుకొంటున్నాడు. అందుకే మేము కూడా తన అభీష్టాన్ని కాదని ఎందులోనూ బలవంతట్టదలుచుకోలేదు.

  హనుమా

Updated Date - 2021-01-17T06:10:04+05:30 IST