పనిచేసిన దుకాణానికే కన్నం వేశాడు

ABN , First Publish Date - 2022-08-09T07:19:05+05:30 IST

పనిచేసిన దుకాణానికే కన్నం వేశాడు

పనిచేసిన దుకాణానికే కన్నం వేశాడు
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి

విలాసాల కోసం దొంగతనం

 రూ.9 లక్షలు రికవరీ

కోదాడ టౌన్‌, ఆగస్టు 8 : కోదాడలో గత నెలలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో దుకాణంలో పనిచేసిన యువకుడే విలాసాల కోసం స్నేహితులతో కలిసి దొంగతనం చేసినట్లు గుర్తించారు. అయితే యువకుడిపై అనుమానంతోనే దుకాణ యజమాని సైతం ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి సోమవారం విలేకరులకు వివరించారు. కోదాడలోని బొడ్రాయిబజార్‌లోని ఆదర్శ మెడికల్‌ దుకాణంలో జూలై నెలలో చోరీ జరిగింది. రూ.12 లక్షలను దొంగలు చోరీచేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడికల్‌ షాపులో గతంలో పనిచేసిన తోట సాయికిరణ్‌పై అనుమానం ఉందని దుకాణ యజమాని మహ్మద్‌ షరీఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమ వారం తోట సాయికిరణ్‌ పట్టణంలోని కంచుకొమ్ముల సాయికిరణ్‌ ఇంట్లో ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసుల ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడ తోట సాయికిరణ్‌తో పాటు టీకుంట్ల ఉపేందర్‌, కంచుకొమ్ముల సాయికిరణ్‌, కంచుకొమ్ముల సంతోష్‌ కలిసి ఉన్నారు. వారిని విచారించగా నలుగురితో పాటు కంచుకొమ్ముల గణేష్‌ అనే వ్యక్తి తమ విలాసాల కోసం దొంగతనానికి పాల్పడినట్లుగా నేరస్థులు అంగీకరించారని తెలిపారు. దొంగలించిన రూ.12 లక్షల నుంచి రూ.3 లక్షలు తమ విలాసాలకు వినియోగించగా మిగిలిన రూ.9 లక్షలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కంచుకొమ్ముల గణేష్‌ పరారీలో ఉన్నాడు. కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన పట్టణ సీఐ నర్సింహారావు, ఎస్‌ఐలు, నాగభూషణ్‌రావు, రాంబాబు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  



Updated Date - 2022-08-09T07:19:05+05:30 IST