ఆయనకు... వంద మిలియన్ డాలర్ల పరిహారం

Dec 7 2021 @ 20:36PM

సిడ్నీ : వంద మిలియన్ డాలర్ల పరిహారాన్ని డబ్ల్యు అండ్ కె సంస్థకు చెల్లించాలంటూ... బిట్ కాయిన్ ఇన్వెస్టర్‌గా చెప్పుకునే  ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సైంటిస్ట్ క్రెగ్ రైట్‌ను మియామీ జ్యూరీ ఆదేశించింది. అమెరికాలో మూడు వారాలుగా సాగుతున్న ఓ కేసు విచారణ నేపధ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే... ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే...  బిట్‌కాయిన్ సృష్టికర్త సతోషి నకమోటో ఎవరన్నది ఈ తీర్పుతో తేలిపోతుందని అందరూ భావించారు. అయితే... మిస్టరీ మాత్రమే కొనసాగుతూనే ఉంది. వివరాలిలా ఉన్నాయి. 


బిట్ కాయిన్ క్రిప్టోను సృష్టించింది తానేనని క్రెగ్ రైట్ 2016 లో ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు... సతోషి నకమోటో అంటే కూడా తానేనని చెప్పుకొచ్చారు. క్రెగ్ రైట్ తన స్నేహితుడు డేవిడ్ క్లెమెన్‌తో కలిసి అంతకుముందే డబ్ల్యు అండ్ కే సంస్థను నిర్వహించాడు. క్లెమెన్ 2013 లో మృతి చెందాడు. కాగా... క్రెగ్ దగ్గరున్న బిట్‌కాయిన్లలో సగం తమకివ్వాలని కుటుంబ సభ్యులు మియామీ కోర్టునాశ్రయించారు. పదమూడేళ్ల క్రితం అంటే...  2007-08 కాలంలో క్రెగ్, క్లెమేన్ కలిసి బిట్‌కాయిన్‌ను  సృష్టించారని చెప్పుకుంటున్నారు. తన వద్ద 1.1 మిలియన్ బిట్‌కాయిన్‌లు ఉన్నట్లు క్రెగ్ చెప్పారు. వీటి విలువ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లకు పైమాటే. మన దేశ కరెన్సీలో ఇది రూ. 3.75 లక్షల కోట్లు.


వాటాలేదని తేల్చినా... 

ఇందులో సగం వాటాతో పాటు బిట్‌కాయిన్ వెనుక ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీపై మేధోహక్కులు కూడా కల్పించాలని క్లెమెన్ కుటుంబం కోరుతోంది. ఈ బిట్‌కాయిన్ వ్యవహారం కోర్టుకు సవాల్‌గా మారింది. వాదనలు విన్న కోర్టు... 1.1 మిలియన్ బిట్‌కాయిన్‌లలో క్లెమెన్‌కు వాటా లేదని తీర్పు చెప్పింది. వాటా విషయంలో క్రెగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే... ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మేధోహక్కుల ఉల్లంఘనలకు గాను ఇరువురూ కలిసి నెలకొల్పిన డబ్ల్యు అండ్ కె సంస్థకు వంది మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని క్రెగ్‌ను ఆదేశించారు. ఈ తీర్పును క్రెగ్ స్వాగతించడం గమనార్హం. డబ్ల్యు అండ్ కె వర్గాలు కూడా స్వాగతించాయి.


బిట్‌కాయిన్ సృష్టికి కారణమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీకి సంబంధించిన మేథోహక్కులను క్రెగ్ ఉల్లంఘించినట్లు ఈ తీర్పు ద్వారా తేలింది. ఈ క్రమంలో... బిట్‌కాయిన్ సృష్టికర్త అంశం మళ్లీ మిస్టరీగానే మారింది. పదమూడేళ్ళ క్రితం(2008 లో) ఆర్థిక సంక్షోభం సమయంలో... ఓ వ్యక్తి, లేదా కొంతమంది కలిసి సతోషి నకమోటో పేరిట డిజిటల్ కరెన్సీని సృష్టించారు. దీనిని పబ్లిష్ చేశారు. అది పని చేసే తీరును వివరించారు. కొద్ది నెలల తర్వాత ఈ కరెన్సీ మైనింగ్ కోసం అధికారికంగా సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేశారు. ఈ నేపధ్యంలో 1.1 మిలియన్ బిట్ కాయిన్లు  తనవేనన్న క్రెగ్ వాదనను కొందరు కొట్టిపారేస్తున్నారు. చాలాకాలంగా వీటిని ట్రేడింగ్‌లో ఎందుకు ఉంచడం లేదన్న ప్రశ్నలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.