‘ఉక్రెయిన్ నుంచి వచ్చినవాడు నా కొడుకు కాదు, మోదీ కొడుకే’

ABN , First Publish Date - 2022-03-12T22:27:37+05:30 IST

రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల

‘ఉక్రెయిన్ నుంచి వచ్చినవాడు నా కొడుకు కాదు, మోదీ కొడుకే’

న్యూఢిల్లీ : రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు తల్లడిల్లిపోయారు. వారి మనోవేదన వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి భారతీయులను స్వదేశానికి రప్పించింది. అదేవిధంగా జమ్మూ-కశ్మీరులోని సంజయ్ పండిత కుమారుడు కూడా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. తన బిడ్డను కళ్లారా చూసుకున్న ఆ తండ్రి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 


ఉక్రెయిన్‌లోని సూమీ నగరంలో పరిస్థితులను తెలుసుకున్న తమకు తమ కుమారుడిపై ఆశలు మిగలలేదని సంజయ్ చెప్పారు. తమ కుమారుడిని స్వదేశానికి రప్పించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తిరిగి వచ్చినవాడు మోదీ గారి కుమారుడని, తన కుమారుడు కాదని అన్నారు. ఆయన తీవ్ర భావోద్వేగంతో  మాట్లాడుతూ, ‘‘వచ్చినవాడు మోదీ గారి కుమారుడు, నా కొడుకు కాదని చెప్పాలనుకుంటున్నాను’’ అన్నారు. సూమీ నగరంలో యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్న తర్వాత తాము తమ కుమారుని రాకపై ఆశలు వదులుకున్నామని చెప్పారు. 


ఉక్రెయిన్ నుంచి వస్తున్నవారి కోసం వారి తల్లిదండ్రులు ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం దాదాపు 6 గంటలపాటు వేచి ఉన్నారు. వారు వచ్చి తమ తల్లిదండ్రులను, బంధు మిత్రులను ఆలింగనం చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు. చాలా మంది తమ పిల్లలకు పూలదండలు వేసి, స్వాగతం పలికారు. మరికొందరు స్వీట్లు పంచి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీతో ఏదైనా సాద్యమే’ అనే నినాదాలు చేశారు. మూడు విమానాల్లో 674 మంది తిరిగి స్వదేశానికి వచ్చారు. వీరిలో అత్యధికులు విద్యార్థినీ, విద్యార్థులే. 


Updated Date - 2022-03-12T22:27:37+05:30 IST