అధినేతలు వస్తున్నారు!

Published: Tue, 17 May 2022 00:35:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
   అధినేతలు వస్తున్నారు!

 1. వేడెక్కుతున్న ఉమ్మడి జిల్లా రాజకీయం
 2. అధికార, ప్రతిపక్ష నేతల పర్యటన  
 3. నేడు ఓర్వకల్లుకు జగన
 4. రేపు కర్నూలు, డోన నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
 5. పోటాపోటీగా శ్రేణుల ఏర్పాట్లు


ఒకరు తమపై ఉన్న వ్యతిరేకతకు కారణాలు అన్వేషించే పనిలో... మరొకరు తమకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను మరింత సానుకూలంగా మార్చుకునే లక్ష్యంతో... 

ఒకరు ఎన్ని ఉచితంగా ఇస్తున్నా...‘మంచిపేరు’ తెచ్చుకోలేకపోవడానికి గల మూలాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో... మరొకరు తమకున్న ‘మంచిపేరు’ను జనాల్లోకి మరోసారి తీసుకెళ్లాలనే తపనతో...

ఆ ఇద్దరూ దాదాపు 24 గంటల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. వారే సీఎం జగన...మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఇద్దరు అగ్రనేతలు మంగళ, బుధవారాల్లో జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

ఉమ్మడి జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇద్దరూ కర్నూలు జిల్లాపై దృష్టి పెట్టారు. ఒక రోజు వ్యవధిలో ఇద్దరూ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి మే 30కి మూడేళ్లు పూర్తవుతోంది. సాధారణ ఎన్నికలకు ఇక రెండేళ్లే సమయం. ఇటీవల అధికార పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నట్లు తేలింది. ఉచితాలు ఎన్ని ఇచ్చినా ప్రతికూలత పెరగడం పట్ల వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇదే సమయంలో టీడీపీ బలం పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇద్దరూ ఉమ్మడి జిల్లా పర్యటనకు వరుసగా రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

సీఎం ఇలా...బాబు అలా..

 సీఎం జగన ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో మంగళవారం పర్యటించనున్నారు. బుధవారం నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు కర్నూలు, డోన నియోజకవర్గాలలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 8-10 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నట్లు అధికార పార్టీ వైసీపీ సర్వేలో తేలినట్లు సమాచారం. దీనికి తోడు వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాయకులలో సమన్వయం కోసమే అధికార పర్యటన పేరుతో సీఎం జగన జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. అదే క్రమంలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ.. తాజాగా పల్లెల్లో, పట్టణ ప్రాంతాల్లో  బలం పుంచుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను ఆకట్టుకొని పార్టీలో పునరుత్తేజం తేవడానికి చంద్రబాబు  రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇలా ఇద్దరు అధినేతల రాకతో కర్నూలు రాజకీయాలు వేడెక్కనున్నాయి. 

  వైసీపీలో సర్వే గుబులు  

 ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజవర్గాలు సహా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీనే పట్టు సాధించింది. ఈ నెల 30కి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్లలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. నవరత్నాలు పేరుతో పెద్ద ఎత్తున ఉచితాలు పంపిణీ చేస్తున్నందు వల్ల  ప్రజలు తమ వైపే ఉన్నారనే ధీమాతో  ఇన్నాళ్లూ వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఓటర్ల నాడి తెలుసుకుందామని ఇటీవల అధికార పార్టీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన విషయాలు ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఉమ్మడి జిల్లాలోని 8-10 నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందని సర్వేలో తేలిందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. బడ్జెట్‌ స్థాయికి మించి మరీ ప్రభుత్వం సంక్షేమం పేరిట అప్పులు చేసి జనానికి ఉచితాలు పంచి పెడుతున్నా.. జనంలో వ్యతిరేకత ఉండడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లాపై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత నెలలో ‘వసతి దీవెన’ పంపిణీ పేరుతో సీఎం జగన నంద్యాలలో పర్యటించారు. నెల తిరక్కుండానే మంగళవారం ఓర్వకల్లు మండలంలో ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు. 

  వెంటాడుతున్న విభేదాలు: 

 ఉమ్మడి జల్లా వైసీపీలో వర్గవిభేదాలు ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్‌, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్నాయి. మూడేళ్ల పాటు నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఎవరికివారే యమునా తీరే అనేలా కార్యక్రమాలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఒకటి రెండు కార్యక్రమాలు మినహా తరువాత ఆర్థర్‌, సిద్ధార్థరెడ్డి కలిసి కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో అధినాయకత్వం జోక్యం చేసుకొని విజయవాడకు పిలిపించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది.  ఇది మూణ్నాళ్ల  ముచ్చటే అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.   

కర్నూలులోనూ అదే తీరు

కర్నూలు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అఫీజ్‌ఖాన, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీని దాదాపుగా దూరం పెట్టేశారని అంటున్నారు. గత ఎన్నికల్లో అఫీజ్‌ఖాన కేవలం 5 వేలు పైచిలుకు ఓట్లతో గెలిచారు. టీజీ భరతపై ఉన్న కోపంతో ఎస్వీ వర్గం బలంగా పని చేయడం వల్లే అఫీజ్‌ఖాన విజయం సాధించారని... లేదంటే ఫలితం మరోలా ఉండేదని ఎస్వీ వర్గీయులు అంటున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌, కుడా చైర్మన కోట్ల హర్షవర్ధనరెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచాక సుధాకర్‌ తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కోట్ల వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. డోన నియోజకవ్గంలో ఎమ్మెల్యేగా గెలిచి... ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తమను పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది.

 గడప గడపలో నిరసన 

 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు జనం మధ్యకు వెళుతున్నారు.  ఏ పల్లెకు వెళ్లినా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పక్కా ఇళ్ల వంటి అభివృద్ధి పనులపై జనం నిలదీస్తున్నారు. ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో ‘నీకు చెప్పినా ఒక్కటే.. గోడకు చెప్పినా ఒక్కటే.. మా ఇంటికి రావద్ద’ని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ఓ మహిళ నిలదీసింది. కోడుమూరు నియోజకవర్గంలో ‘మూడే ళ్లయినా మరుగుదొడ్లు  కట్టించలేదు.. నీవు ఉండేది ఒక ఏడాదేనంట కాదా.. ఇప్పుడైనా కట్టిస్తారా లేదా..!’ అంటూ ఎమ్మెల్యే డాక్టరు సుధాకర్‌ను ఓ మహిళ ప్రశ్నించింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే ప్రతికూల పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన జిల్లా పర్యటన రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 

 చంద్రన్న రాకతో టీడీపీలో నూతనోత్తేజం

ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది.   కానీ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి జగన ప్రభుత్వం ఏమీ చేయలేదనే విమర్శ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు వారిలో తీవ్ర నిరసనకు కారణమయ్యాయి. నిరుద్యోగం, అధిక ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివి   ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాయి. పాలన గాడి తప్పి.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రాష్ట్రం తిరిగి ప్రగతి వైపు పరుగులు పెట్టాలంటే ‘మళ్లీ చంద్రబాబే రావాలి’ అనే ఆకాంక్ష జనంలో బలపడుతోంది. పట్టణ, గ్రామీణుల్లో టీడీపీకి సానుకూలత పెరుగుతోంది. దీనిని ఎన్నికల వరకు కొనసాగించి ఓట్లు మలుచుకునే దిశగా జిల్లాలో టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కర్నూలులో పసుపు జెండా ఎగుర వేయాలనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాపై అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజుల చంద్రన్న పర్యటనతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు కూడా వ్యూహాలతో ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది.

 టీడీపీ ప్రభుత్వంలో ప్రగతి పరుగులు: 

 వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రగతి పరుగులు పెట్టిందని అంటున్నారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం, 30 వేల ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ హబ్‌, సీడ్‌ హబ్‌, కొలిమిగుండ్లలో సిమెంట్‌ పరిశ్రమలు, హంద్రీ నీవా విస్తరణ, ఆత్మకూరు దగ్గర సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో తాగు, సాగునీటికి దాదాపు రూ.4 వేల కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువ టీడీపీ ప్రభుత్వ కృషే. వేదవతి ప్రాజెక్టు, ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం గాజులదిన్నె జలాశయం నుంచి రూ.280 కోట్లతో పైపులైన, ఆదోని మైనార్టీ కాలేజీ గత ప్రభుత్వ చలువగానే చెబుతున్నారు. ఎమ్మిగనూరు బనవాసి పశు క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, గొర్రెల పరిశోధన కేంద్రం, నంద్యాల రోడ్లు విస్తరణ, మున్సిపల్‌ పట్టణాల్లో 50 వేల టిడ్కో ఇళ్లు (జీ+3) ఇళ్లు.. వంటి అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలోనే జరిగాయి. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరిఫ్లడ్‌  ఫ్లో కెనాల్‌, అవుకు టన్నెల్‌ అసంపూర్తి పనులు చంద్రబాబే పూర్తి చేసి కడప జిల్లాకు నీరిచ్చారు. డోన, పత్తికొండ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి లక్ష్యంగా హంద్రీనీవా కాలువ నుంచి 106 చెరువులు నింపే ప్రాజెక్టు రూ.168 కోట్లతో చంద్రబాబే తీసుకొచ్చారు. గుండ్రేవుల జలాశయానికి గత ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు లేక ఆయా ప్రాజెక్టులు నత్తకు నడకలు నేర్పడం మొదలు పెట్టాయి. పైగా కొన్ని ప్రాజెక్టులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో తాము చేసిన పనులు ప్రజలకు వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటన సాగుతుందని టీడీపీ జిల్లా నాయకులు అంటున్నారు.

  సీఎం పర్యటన ఇలా...

కర్నూలు, మే 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించరెన్నారు. ఓర్వకల్లు మండలం గుమితం తండా దగ్గర ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)కు సీఎం జగన శంకుస్థాన చేయనున్నారు. 

- మంగళవారం ఉదయం 9.35 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి సీఎం జగన బయలుదేరుతారు. 

-  9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుం టారు. 

  - ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు.

- 11.15 గంటలకు గుమితం తండా గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.

-  11.35 గంటల నుంచి 12.15 గంటల వరకు ఈ ప్రాజెక్టు శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రీనకో సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్టు ప్రాధాన్యంపై చర్చిస్తారు.

-  అనంతరం 12.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వెళ్లి... 12.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరు కుంటారు. 

- 1.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని... అక్కడి నుంచి 2.05 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటాని జిల్లా అధికారులు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం రాత్రి వరకు కలెక్టర్‌ కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

ఓర్వకల్లు: ముఖ్యమంత్రి  వైఎస్‌ జగనమోహనరెడ్డి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి హామ్లెట్‌ గుమితం తండా వద్ద ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపనలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  సోమవారం కలెక్టర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రీనకో అధికారులతో చర్చించారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమం నిర్వహణ, తదితర అంశాలపై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరిప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


అది చంద్రబాబు కల!

 1.  టీడీపీ హయాంలో ఐఆర్‌ఈపీకి బీజం 
 2.  4,766.28 ఎకరాలు కేటాయింపు
 3.  5,230 మోగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ లక్ష్యం
 4.  3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి 
 5.   ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు ఐఆర్‌ఈపీ 
 6.   మూడేళ్ల్ల తరువాత సీఎం శంకుస్థాపన  

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): పిన్నాపురం ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక (రెన్యూవబుల్‌) ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల. దీని ద్వారా  5,230 మెగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి బీజం పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు ఇది. రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి  పెద్దపీట వేశారు. అందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద 1,000 మెగావాట్స్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఓర్వకల్లు, గడివేముల మండలాల మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొల్పారు. అందులో గ్రీనకో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 500 మెగావాట్స్‌, ఇతర సంస్థలు 500 మెగావాట్స్‌ సోలార్‌ వపర్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వివిధ విభాగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సోలార్‌ ప్లాంట్‌కు దగ్గరలోనే ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) ఏర్పాటుకు గ్రీనకో ఎనర్జీస్‌ ప్రైౖ.లి సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే తొలిప్రాజెక్టు ఇది. 

 మూడేళ్ల తరువాత సీఎం జగన శంకుస్థాపన  

 ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) ఏర్పాటు కోసం గ్రీనకో సంస్థ క్షేత్ర స్థాయిలో అఽధ్యయనం చేసింది. మూడు దశల్లో 5,230  మెగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు అనుమతుల కోసం 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు ఆమోదించిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన 4,766.28 ఎకరాలు పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం ఉశేనాపురం, కాల్వ, బ్రాహ్మణపల్లి, గుమ్మితం తండా తదితర గ్రామాల పరిధిలో ఎకరం రూ.2.50 లక్షల ప్రకారం కేటాయించింది. పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తికి అవసరమైన 2.40 టీఎంసీల నీటిని గోరుకల్లు జలాశయం నుంచి కేటాయించారు. కీలకమైన ఈ ప్రాజెక్టుకు 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేయాల్సింది. ఇంతలో ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తరువాత వచ్చిన సీఎం జగన ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి ఉంటే విద్యుత ఉత్పత్తి మొదలయ్యేది. కానీ జగన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రీనకో సంస్థ అధికారులు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షల ప్రకారం భూములు కేటాయిస్తే.. జగన ప్రభుత్వం భూముల ధరను రూ.5 లక్షలకు పెంచింది. ఆ తరువాత ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అనుమతులు సాధించారు.  మూడు దశల్లో రూ.30 వేల కోట్ల వ్యయంతో చేపట్టే కీలమైన ఐఆర్‌ఈపీ ప్రాజెక్టుకు నేడు సీఎం జగన శంకుస్థాపన చేయనున్నారు ఇది పూర్తయితే 3 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. అంతేకాదు.. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.