అందరికీ ఆరోగ్య ఖాతాలు

ABN , First Publish Date - 2022-03-01T08:37:33+05:30 IST

దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను రూపొందించేందుకు కేంద్రం సిద్ధం అయింది.

అందరికీ ఆరోగ్య ఖాతాలు

  • ప్రతి ఒక్కరికీ 16 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య..
  • ఆయుష్మాన్‌ డిజిటల్‌ మిషన్‌ కింద హెల్త్‌ అకౌంట్స్‌
  • ఐదేళ్లలో 1600 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం 
  • రాష్ట్రంలో అమలుపై వైద్యశాఖ కసరత్తు  


హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతి పౌరుడి  ఆరోగ్య రికార్డులను రూపొందించేందుకు కేంద్రం సిద్ధం అయింది. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కింద ఆరోగ్య ఖాతాలను ప్రారంభించాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో రూ.1600 కోట్లతో ఈ మిషన్‌ను అమలు చేయనుంది.  ఇందుకే కేంద్ర కేబినెట్‌ రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డుల రూపొందించడంపై సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. వాస్తవానికి,  దీని అమలు కోసం గతేడాది ఓ పైలెట్‌ ప్రాజెక్టును నిర్వహించారు. అది విజయవంతమైంది. దాంతో దేశవ్యాప్తంగా దీన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒక యాప్‌, వెబ్‌సైట్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆరోగ్యవర్గాలు వెల్లడించాయి. 


ఆరోగ్య ఖాతా ఇలా ప్రారంభించవచ్చు

ఆరోగ్య ఖాతాను ఎవరికి వారే స్వయంగా ప్రారంభించుకోవచ్చు. బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్టుగా, ముందుగా మన ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌తో వెబ్‌సైట్‌  (https://healthid.ndhm.gov.in/) లో హెల్త్‌ అకౌంట్‌ను తెరవచ్చని అధికారులు చెబుతున్నారు. పౌరులు తమ వివరాలను ఎంటర్‌ చేయగానే 16 అంకెలతో కూడిన ఖాతా నంబరు కేటాయిస్తారు. ఆధార్‌ తరహాలో ఇది యూనిక్‌గా ఉంటుంది.  దీన్నే హెల్త్‌ ఐడీగా పరిగణిస్తారు. ఆస్పత్రులకు వెళ్లి పౌరులు తమ ఐడీ నంబరు చెబితే చాలు.  వైద్యుల వివరాలతో పాటు, చేయించుకున్న పరీక్షలు, వాడిన మందుల వివరాల్తో సహా హాస్పిటల్‌ వాళ్లే అప్‌లోడ్‌ చేస్తారు. దీంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ రిపోర్టులు తీసుకెళ్లాల్సిన పనివుండదు. హెల్త్‌ ఐడీని రూపొందించుకోలేని పౌరులకు ప్రైవేటు ఆస్పత్రులు కూడా దీన్ని అప్పటికప్పుడు రూపొందించవచ్చు. ప్రతి పౌరుడికీ ఆరోగ్యఖాతాల ద్వారా అందుబాటులో ఉన్న డేటాను ప్రభుత్వాలు విశ్షేషించుకొని ప్రజలకు వస్తున్న వ్యాధులపై ఒక అంచనాకు వస్తాయి. దీనికి అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు రూపొందించే వెసులుబాటు కలుగుతుందని వైద్యఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య బీమా కు కూడా దీన్ని తప్పనిసరి చేయనున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌ను లింక్‌ చేయనున్నారు. బీమా చేయించుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చేరగానే, అతడికి సంబంధించిన వివరాలన్నీ బీమా కంపెనీకి వెళ్తాయి. రోగికి ఇచ్చే చికిత్స పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆస్పత్రివాళ్లు ఆ వ్యక్తి హెల్త్‌ అకౌంట్‌లో అప్‌డేట్‌ చేస్తుంటారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆ వివరాలను సరిచూసుకుంటాయి.  



హెల్త్‌ ఐడీతో చికిత్స తేలికౌతుంది

మన దేశంలో చాలామంది నిరక్ష్యరాస్యులే. హెల్త్‌ రిపోర్టులపై  ఎక్కువమందికి అవగాహన ఉండదు. వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు పాత రిపోర్టులు తీసుకురారు. దీంతో  ప్రతిసారీ టెస్టులు చేయాల్సివుంటుంది. దాంతో వారి సమయం, డబ్బులు కూడా వృధా అవుతాయి పాశ్చాత్య దేశాల్లో ఒక వైద్యుడు డిజిటల్‌ రూపంలో రిపోర్టులను మరో వైద్యుడికి పంపుతారు. దాంతో చికిత్స తేలికఅవుతుంది. మనదేశంలో ఇలా లేదు. ఆరోగ్య ఖాతా అనేది మంచి నిర్ణయం. ఆరోగ్య ఖాతాతో రోగులకు వెంటనే చికిత్స అందించవచ్చు. అయితే రోగుల ఆరోగ్య రిపోర్టులను వారి అనుమతితో ఓటీపీ ద్వారా ఓపెన్‌ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిఏటా హెల్త్‌ప్రొఫైల్‌ చేయాలి. దీంతో ఎక్కడ ఏ వ్యాధులెక్కువ ఉన్నాయో తెలుస్తుంది.  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హెల్త్‌ ప్రొఫైల్‌ వివరాలను ఈ హెల్త్‌ఐడీతో లింకు చేస్తే బావుంటుంది. 

- డాక్టర్‌ ఎంవీరావు, జనరల్‌ మెడిసిన్‌, 

కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, యశోదా ఆస్పత్రి, హైదరాబాద్‌


మార్చి 5 నుంచి ‘హెల్త్‌ ప్రొఫైల్‌’

పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌


‘హెల్త్‌ ప్రొఫైల్‌’ కార్యక్రమాన్ని మార్చి 5న అధికారికంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టనున్నారు. మార్చి 5న ములుగులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సిరిసిల్లలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ను ప్రారంభించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్టును 3 నెలల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. అనంతరం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా నిర్వహించనున్నారు.  

Updated Date - 2022-03-01T08:37:33+05:30 IST