నిమ్మకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

ABN , First Publish Date - 2022-06-04T21:17:00+05:30 IST

నిమ్మకాయల్లో విటమిన్‌ - సి, పీచు పదార్థాలు, ఇతర ప్రయోజనకర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మ గుండె ఆరోగ్యానికీ,

నిమ్మకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

ఆంధ్రజ్యోతి(04-06-2022)

ప్రశ్న: ఎండాకాలంలో నిమ్మ రసం అమృతంలా అనిపిస్తుంది. అసలు నిమ్మ ప్రయోజనాలేమిటి?


- ముకుందకుమార్‌, వాల్తేరు


డాక్టర్ సమాధానం: నిమ్మకాయల్లో విటమిన్‌ - సి, పీచు పదార్థాలు, ఇతర ప్రయోజనకర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మ గుండె ఆరోగ్యానికీ, బరువు నియంత్రణకు, జీర్ణకోశ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఒక నిమ్మ కాయలో 30 మిల్లీ గ్రాముల విటమిన్‌- సి ఉంటుంది. ఇది మనకు రోజువారీ అవసరమైన దానిలో సగానికి పైనే. విటమిన్‌ - సి అధికంగా ఉన్న పళ్ళు, కూరగాయలు తినడం వల్ల గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. నిమ్మలో ఉండే హెస్పరిడిన్‌, డయోస్మిన్‌లు, కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. బరువు నియంత్రణలో ఉండడానికి కూడా నిమ్మను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఒక అరకప్పు నిమ్మరసం ప్రతిదినం తీసుకుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరుగుతాయనీ, కొత్తగా రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతుందని కూడా శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. నిమ్మలో ఉండే సిట్రిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ - సి రెండూ కూడా మనం ఆహారంలో తీసుకునే ఐరన్‌ని శరీరం శోషించుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా నిమ్మ రక్తహీనతను అడ్డుకుంటుంది. వికారాన్నీ, అరుచినీ తగ్గించడం ద్వారా నిమ్మ జీర్ణకోశ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. నిమ్మకున్న ప్రత్యేక సుగంధం, రుచి, అది అన్ని రకాల ఆహారాలకూ చక్కని అనుబంధ ద్రవ్యంగా మారుతుంది. సాధారణంగా జలుబు వైరస్‌ల వల్ల వస్తుంది. నిమ్మరసం తీసుకుంటే జలుబు చేయడం అనేది అపోహ  మాత్రమే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-04T21:17:00+05:30 IST