పురపాలికల్లో వైద్య శిబిరాలు

ABN , First Publish Date - 2020-11-30T05:23:18+05:30 IST

పురపాలికల్లో వైద్య శిబిరాలు

పురపాలికల్లో వైద్య శిబిరాలు
తాండూరులోని మున్సిపల్‌ కార్యాలయం

  • మెప్మా, వైద్య శాఖ సంయుక్తంగా శిబిరాల నిర్వహణ
  • పారిశుధ్య, భవన నిర్మాణ, వీధి వ్యాపారులకు హెల్త్‌ చెకప్‌
  • జిల్లా వ్యాప్తంగా కార్మికులకు ప్రయోజనం

తాండూరు: పురపాలక సంఘాల్లో ఆరోగ్య శిబిరాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొవిడ్‌ సమయంలో పారిశుధ్య కార్మికులు కీలకంగా వ్యవహరించారు. ప్రతీ నెలలో వారం వారం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ మున్సిపాలిటీల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని పేర్కొన్నారు. పురపాలికల్లో గుర్తించిన వీధి విక్రయదారులతోపాటు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పట్టణ పేదరిక నిర్మూలన(మెప్మా) సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. 


జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో శిబిరాలు...



జిల్లా వ్యాప్తంగా వేలాది మంది వీధి విక్రయదారులున్నారు. తాండూరులో 1,420 మంది, వికారాబాద్‌లో 1,273, పరిగి 365, కొడంగల్‌లో 286మంది చొప్పున వీధి విక్రయదారులున్నట్టు అధికారులు గుర్తించారు. చిరు వ్యాపారుల్లో చాలా మంది రహదారుల పక్కన పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మకాలు చేస్తూ తోపుడు బండ్ల ద్వారా విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్ల పక్కన తిరుగుతూ వాహనాల పొగ, దుమ్ము, ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నారు. వారికి ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు క్షయ, ఇతర శ్వాసకోస సంబంధిత వ్యాధులపాలవుతున్నారు. ఇలాంటి తరుణంలో వీధి విక్రయదారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. వ్యాధులకు గురైన వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.


అవగాహన కల్పిస్తున్న ఆర్పీలు


పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న రిసోర్స్‌ పర్సన్లు(ఆర్పీలు) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక వైద్య శిబిరాలపై వీధి విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నారు. వారిని స్థానిక మెప్మా లేదా పురపాలిక కారాయలయాల్లో నిరవహిస్తున్న వైద్య శిబిరాల వద్దకు తీసుకువస్తున్నారు. వీధి వ్యాపారులు అప్పులు చేసి వ్యాపారాలను నిర్వహిస్తుండటం, ఆదాయం అంతంత మాత్రమే కావడంతో వారు వ్యాధుల బారిన పడినప్పుడు సరైన వైద్యసేవలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో వీధి వ్యాపారులకు కొంత మేర ఊరట కలుగనుంది.


హెల్త్‌ క్యాంప్‌ షెడ్యూల్‌ ఇలా ...

- మొదటి శనివారం - మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది

- రెండో శనివారం - వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు

- మూడో శనివారం- మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది, ఇతరులకు

- నాల్గో శనివారం - స్ట్రీట్‌ వెండర్స్‌, సీనియర్‌ సిటిజెన్‌

Updated Date - 2020-11-30T05:23:18+05:30 IST